
వడదెబ్బతో వృద్ధురాలి మృతి
బుక్కరాయసముద్రం: తీవ్రమైన ఎండల తో ఓ వృద్ధురాలు వడదెబ్బకు గురై మృతి చెందింది. ఓబులాపురం గ్రామానికి చెందిన మహానందరెడ్డి శుక్రవారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి తోటకు వెళ్లారు. కాసేపటి తర్వాత ఆయన తల్లి రామక్క (80) కూడా నడుచుకుంటూ తోటకు వెళ్లింది. కాసేపు తోటంతా కలియదిరిగి 11.30 గంటల తర్వాత తిరిగి ఆమె నడుచుకుంటూ ఇంటికి చేరుకుంది. భగభగమండే ఎండలోనే తిరగడంతో ఆమె వడదెబ్బకు గురైంది. కాస్త అలుపు వచ్చినట్టవడంతో ఇంటి బయటే మంచంపై పడుకుంది. గంట తర్వాత కుమారుడు, కోడలు వచ్చారు. నీళ్లు తాగాలని చెబుతూ లేపడానికి ప్రయత్నించగా ఆమెలో చలనం లేదు. నిశితంగా పరిశీలించగా అప్పటికే ఆమె ఊపిరి ఆగిపోయింది. వడదెబ్బతోనే ప్రాణం విడిచిందని నిర్ధారించుకున్నారు. ఈమెకు ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలు సంతానం. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ ఎన్‌ఆర్‌ఐ వింగ్ కోఆర్డినేటర్ ఆలూరు సాంబశివారెడ్డి ఓబులాపురం వెళ్లి రామక్క మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
కేజీబీవీల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
అనంతపురం ఎడ్యుకేషన్: జిల్లాలోని కేజీబీవీల్లో ఖాళీగా ఉన్న నాన్‌టీచింగ్ పోస్టులకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని సమగ్రశిక్ష ఏపీసీ టి.శైలజ సూచించారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. అవుట్ సోర్సింగ్ విధానంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తిగల మహిళా అభ్యర్థులు www.samagrashik shaatp.blogspot.com వెబ్‌సైట్ ద్వారా శనివారం నుంచి ఈనెల 31 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు 42 ఏళ్ల వరకు అర్హులని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు, మాజీ సైనిక ఉద్యోగినులకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల వయోపరిమితి సడలింపు ఉంటుందని తెలిపారు. రోస్టర్ వారీగా పోస్టుల వివరాలు, గౌరవ వేతనం, విద్యార్హత వివరాలు వెబ్‌సైట్‌లో ఉంచిన నోటిఫికేషన్ ద్వారా పొందాలని ఏపీసీ వివరించారు.
ఖాళీల వివరాలు ఇలా...
● టైప్–3లో మొత్తం 43 ఖాళీలు (హెడ్‌కుక్– 8, అసిస్టెంట్ కుక్–19, డేఅండ్‌నైట్ వాచ్ ఉమెన్–5, స్వీపర్–6).
● టైప్–4లో మొత్తం 28 ఖాళీలు (హెడ్‌కుక్–6, అసిస్టెంట్ కుక్–14, చౌకీదార్–8)
‘కూలీల హాజరు పెంచండి’
ఆత్మకూరు: ఉపాధి కూలీల హాజరు శాతాన్ని పెంచాలని సంబంధిత అధికారులను రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ జాయింట్ కమిషనర్ మల్లెల శివప్రసాద్ ఆదేశించారు. గొరిదిండ్ల పంచాయతీలో చేపట్టిన ఉపాధి పనులను శుక్రవారం ఆయన పరిశీలించి, మాట్లాడారు. ప్రతి పంచాయతీలో కూలీల సంఖ్య పెంచి పనుల లక్ష్యం త్వరగా పూర్తి చేయాలన్నారు. రైతులు తమ పొలాల్లో నీటి కుంటలను ఏర్పాటు చేసుకుంటే భూములు సారవంతమవుతాయన్నారు. డ్రైల్యాండ్ హార్టీకల్చర్‌లో భాగంగా మెట్ట భూముల్లో పండ్ల తోటల పెంపకాన్ని చేపట్టాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో డ్వామా పీడీ సలీంబాషా, ఏపీడీ చెన్నకేశవులు, ఈసీ బబ్లు, టెక్నికల్, ఫీల్డ్ అసిస్టెంట్లు, కూలీలు పాల్గొన్నారు.