
‘ఉపాధి’ డిమాండ్ల సాధనకు 21న పాదయాత్ర
అనంతపురం అర్బన్: ఉపాధి కూలీల సమస్యల పరిష్కారానికి, డిమాండ్ల సాధనకు ఈ నెల 21న ‘కష్టజీవుల పాదయాత్ర’ చేపట్టనున్నట్లు ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం (వ్యకాసం) రాష్ట్ర కార్యదర్శి బి.కేశవరెడ్డి తెలిపారు. శుక్రవారం స్థానిక ఆ సంఘం కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉపాఽధి పథకాన్ని నిర్వీర్యం చేసే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అడుగులేస్తున్నాయని మండిపడ్డారు. ఉపాధి భృతిగా ప్రతి కూలీకి ఏడాదికి రూ.12 వేలు ఇవ్వాలన్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకూ కూలీలకు బకాయి పడిన రూ.37 కోట్ల వేతనాన్ని తక్షణమే చెల్లించాలన్నారు. డిమాండ్ల సాధనకు ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకెళ్లే క్రమంలో కష్టజీవుల పాదయాత్రను నాడు ఉపాధి హామీ పథకం ప్రారంభించిన నార్పల మండలం బండ్లపల్లి గ్రామం నుంచి ఈ నెల 21న ప్రారంభించనున్నామన్నారు. 22 సాయంత్రం 4.39 గంటలకు అనంతపురంలోని కృష్ణకళామందిర్‌లో బహిరంగసభ ఉంటుందన్నారు. కార్యక్రమానికి వ్యకాసం రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ కోటేశ్వరరావు, మాజీ ఎంపీ, ఏఐసీసీ అధికార ప్రతినిధి తులసిరెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు రాంభూపాల్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు డి.జగదీష్, వ్యకాసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్, తదితరులు పాల్గొంటారన్నారు. బహిరంగసభకు పెద్ద సంఖ్యలో ఉపాధి కూలీలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో నాయకులు నాగరాజు, పెద్దయ్య, రామాంజనేయులు, నరేష్ పాల్గొన్నారు.
వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కేశవరెడ్డి