మరో ముగ్గురికి తీవ్ర గాయాలు
అడవి పందుల బారి నుంచి పంటను కాపాడుకునేందుకు ఏర్పాటు చేసిన విద్యుత్తు తీగే కారణం
బత్తలపల్లి: విద్యుత్ షాక్‌కు గురైన వివాహితను కాపాడే ప్రయత్నంలో ఓ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. ఇదే ఘటనలో గాయపడిన ముగ్గురు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వివరాలు... బత్తలపల్లి మండలం ఎం.చెర్లోపల్లి గ్రామానికి చెందిన కేశవనాయుడు రామాపురం గ్రామానికి చెందిన రామాంజనేయులు పొలాన్ని కౌలుకు తీసుకుని మొక్కజొన్న పంట సాగు చేశాడు. ఈ క్రమంలో అడవి పందులు పంటను నాశనం చేస్తున్నాయని గుర్తించిన ఆయన జీఏ వైరుతో పొలం చుట్టూ విద్యుత్ కంచెను ఏర్పాటు చేశాడు.
ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం గొర్రెల కాపరులు మేపునకు జీవాలను తోలుకు రావడంతో వారు ప్రమాదం బారిన పడకూడదని భావించిన ఆయన నాలుగు రోజుల క్రితం పొలం చుట్టూ విద్యుత్ కంచెను తొలగించాడు. అయితే విద్యుత్ స్తంభం నుంచి పొలం వరకూ లాగిన వైరును తొలగించడం మరచిపోయాడు. ఈ నేపథ్యంలో గ్రామానికి చెందిన వివాహిత లక్ష్మి శుక్రవారం దుస్తులు ఉతికేందుకు అటుగా వెళ్లింది. ఆమె వెంట వెళ్లిన కుమారుడు విద్యుత్ తీగ వైపుగా వెళుతుండడం గమనించి కాపాడే ప్రయత్నంలో అటుగా అడుగు వేసింది.
అయితే అక్కడ నేల తేమగా ఉండడంతో షాక్‌కు గురైంది. ఆ సమయంలో గట్టిగా కేకలు వేయడంతో అక్కడికి సమీపంలో ఉన్న నాగభూషణ వెళ్లి కట్టెతో తీగను కొట్టాడు. ఆ సమయంలో తీగ ఎగిరి నాగభూషణను తాకడంతో షాక్‌కు గురై కుప్పకూలాడు. విషయాన్ని గమనించగానే తల్లిదండ్రులు ఓబులేసు (69), లింగమ్మ ఒకరి వెనుక మరొకరు పరుగున వెళ్లి నాగభూషణు పైకి లేపే ప్రయత్నం చేయడంతో వారు కూడా షాక్‌కు గురయ్యారు. విషయాన్ని అక్కడికి సమీపంలో ఉన్న రవీంద్రారెడ్డి గమనించి వెంటనే ట్రాన్స్‌ఫార్మర్ వద్దకెళ్లి విద్యుత్ సరఫరాను నిలిపివేశాడు.
షాక్‌కు గురైన నలుగురూ అపస్మారక స్థితిలో ఉండడంతో గ్రామస్తులు వెంటనే ఆర్డీటీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స అందేలోపు ఓబులేసు మృతి చెందాడు. మిగిలిన ముగ్గురికి ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం అనంతపురంలోని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఆర్డీటీ ఆస్పత్రికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న ట్రాన్స్‌కో ఏఈ శివయ్య గ్రామానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను ఆరా తీశారు. ఘటనపై బత్తలపల్లి ఎస్‌ఐ సోమశేఖర్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.