
చర్చిపై నుంచి పడి యువకుడి మృతి
తాడిపత్రి టౌన్: గుడ్ ప్రైడే వేళ చర్చిపై నుంచి కిందపడి ఓ యువకుడు మృతిచెందాడు. వివరాలు.. తాడిపత్రిలోని నందలపాడులో నివాసముంటున్న జయమ్మ, మనోహర్ దంపతుల కుమారుడు విక్టర్‌కుమార్ (25)కు మతిస్థిమితం సరిగా లేదు. గుడ్ ఫ్రైడే ని పురస్కరించుకుని గురువారం రాత్రి చర్చి అలంకరణలో భాగంగా పిల్లలతో చాలా సేపు ఆడుకున్నాడు. శుక్రవారం తెల్లవారుజామున చర్చిపైకి చేరుకున్న విక్టర్‌కుమార్.. ప్రమాదవశాత్తు అదుపు తప్పి కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతన్ని స్థానికుల సాయంతో కుటుంబసభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ లోపు పరిస్థితి విషమించి మృతి చెందాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
వృద్ధురాలి ఆత్మహత్య
యల్లనూరు: మండలంలోని గడ్డంవారిపల్లికి చెందిన రాగిపిండి చిన్న అంకిరెడ్డి భార్య వెంగమ్మ (80) ఆత్మహత్య చేసుకుంది. గత నెలలో చెయ్యి విరిగిన ఆమెకు కుటుంబసభ్యులు చికిత్స చేయించారు. ఈ క్రమంలో జీవితంపై విరక్తి పెంచుకున్న ఆమె శుక్రవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. భర్త అంకిరెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
రైల్లో ప్రయాణికుడి మృతి
గుత్తి: రైలులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి ఉన్నఫళంగా మృతి చెందాడు. వివరాలు.. తెలంగాణలోని యాదాద్రికి చెందిన భీమన్న (42) బెంగుళూరుకు వలస వెళ్లి బేల్దారి పనులతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో కొన్ని రోజులు క్రితం సొంతూరుకు వెళ్లిన ఆయన శుక్రవారం కుటుంబ సభ్యులతో కలిసి రైలులో బెంగళూరుకు ప్రయాణమయ్యాడు. గుత్తి జీఆర్పీ పరిధిలో ప్రయాణిస్తుండగా బోగీలోనే కుప్పకూలాడు. రైలు స్టేషన్‌కు చేరుకోగానే వైద్యులు చేరుకుని పరీక్షించారు. అప్పటికే గుండెపోటుతో భీమన్న మృతి చెందినట్లుగా నిర్ధారించారు. ఘటనపై జీఆర్పీ ఎస్‌ఐ నాగప్ప దర్యాప్తు చేపట్టారు.
వ్యక్తి దుర్మరణం
అనంతపురం: నగర శివారులో చోటు చేసుకున్న ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. ట్రాఫిక్ పోలీసులు తెలిపిన మేరకు... రాప్తాడు మండలం బండమీదపల్లికి చెందిన ఎర్రగుంట్ల రంగారెడ్డి (46) శుక్రవారం ఉదయం అనంతపురంలో జరుగుతున్న శుభకార్యానికి హాజరయ్యేందుకు ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. 44వ జాతీయ రహదారిపై ఆర్‌కే ఫంక్షన్ హాల్ ఎదురుగా ప్రయాణిస్తుండగా ఎదురుగా రాంగ్ రూట్‌లో వచ్చిన చంద్రబాబు కొట్టాలకు చెందిన బైక్ మెకానిక్ షేక్ రహమాన్ ఢీకొన్నాడు. ఘటనలో కిందపడిన రంగారెడ్డి తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
మామిడి చెట్ల నరికివేత
పెద్దవడుగూరు: మండలంలలోని గ్రామానికి చెందిన సూర్యనారాయణ, లక్ష్మన్న, పుల్లన్న, సన్న నారాయణ, పెద్ద నారాయణ, అనిల్‌కు చెందిన 105 మామిడి చెట్లను గుర్తు తెలియని వ్యక్తులు నరికి వేశారు. మూడేళ్ల క్రితం పెన్నానదీ పరివాహక ప్రాంతంలో మామిడి మొక్కలు నాటుకున్నారు. ఈ క్రమంలో గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు మొక్కలను నరికి వేయడంతో రూ.5 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు బాధిత రైతులు వాపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీం, స్నిప్పర్ డాగ్‌ను రంగంలో దించి నిందితుల ఆధారాలను సేకరించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

చర్చిపై నుంచి పడి యువకుడి మృతి

చర్చిపై నుంచి పడి యువకుడి మృతి

చర్చిపై నుంచి పడి యువకుడి మృతి