
ప్రభుత్వ సేవలపై ప్రజల్లో అసంతృప్తి
అనంతపురం అర్బన్: ప్రభుత్వ సేవలపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారని, ఐవీఆర్‌ఎస్ సర్వేలో అధికారుల పనితీరుపై ఈ మేరకు అభిప్రాయం వెల్లడించారని కలెక్టర్ వి.వినోద్‌కుమార్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూభవన్‌లో తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, విలేజ్ సర్వేయర్లు, ఇతర సిబ్బందితో ఐవీఆర్‌ఎస్‌కు సంబంధించి కౌన్సెలింగ్, అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని దిశానిర్దేశం చేశారు. ప్రజల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చే విధంగా పనిచేయాలన్నారు. రెవెన్యూ, సర్వే, పౌర సరఫరాల శాఖల అధికారుల పనితీరుపై నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ వచ్చిందంటూ అసహనం వ్యక్తం చేశారు. తీరు మార్చుకుని ప్రజలు మెచ్చేలా పనిచేయాలని ఆదేశించారు. భూ సమస్యలు, భూ సర్వే నిమిత్తం రైతులకు నోటీసులు జారీ చేస్తున్నారా.. ఈ–సేవకు సంబంధించి నిర్దేశించిన రుసుం కంటే రైతుల నుంచి ఎక్కువ వసూలు చేశారా.. అని ప్రజలకు ఫోన్ చేసి అడుగుతున్నారన్నారు. కళ్యాణదుర్గం రెవెన్యూ డివిజన్‌లో 37 మంది, అనంతపురం డివిజన్‌లో 30 మంది, గుంతకల్లు డివిజన్‌లో 14 మంది విలేజ్ సర్వేయర్లపై నెగెటివ్ ఫీడ్ బ్యాక్ అందిందన్నారు. కార్డుదారుల నుంచి అదనంగా డబ్బు వసూలు చేసిన ఎండీయూలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయా ప్రాంతాలకు తహసీల్దార్లు, సీఎస్‌డీటీలు వెళ్లి విచారణ చేయాలని చెప్పారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, డీఆర్‌ఓ ఎ.మలోల, ఆర్‌డీఓ కేశవ నాయుడు, సర్వే భూ రికార్డుల శాఖ ఏడీ రూప్లానాయక్, డీఎస్‌ఓ జగన్‌మోహన్‌రావు, తహసీల్దార్లు, డీటీలు, తదితరులు పాల్గొన్నారు.
రెవెన్యూ, పౌర సరఫరాల శాఖలపై వ్యతిరేక అభిప్రాయం
తీరు మార్చుకుని మెరుగైన సేవలందించాలి
కలెక్టర్ వినోద్‌కుమార్
ఢిల్లీ వెళ్లిన కలెక్టర్
కలెక్టర్ వి.వినోద్‌కుమార్ మంగళవారం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలకు సంబంధించి యూపీఎస్‌సీ బుధవారం ఢిల్లీలో నిర్వహించనున్న సన్నాహక సమావేశంలో కలెక్టర్ పాల్గొంటారు. తిరిగి ఆయన ఈ నెల 24న విధులకు హాజరవుతారు. దేశవ్యాప్తంగా 77 జిల్లాల నుంచి కలెక్టర్లు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. రాష్ట్రం నుంచి అనంతపురం కలెక్టర్‌తో పాటు మరో మూడు జిల్లాల కలెక్టర్లు పాల్గొననున్నారు.

ప్రభుత్వ సేవలపై ప్రజల్లో అసంతృప్తి