అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలం చెట్టుపల్లికి చెందిన 53 ఏళ్ల సేనాపతి శ్రీనివాసరావుది నిరుపేద కుటుంబం. ఇతను 15 ఏళ్ల క్రితం పక్షవాతంతో మంచానికే పరిమితమయ్యాడు. ఈ పరిస్థితుల్లో 2020లో 104 మొబైల్ మెడికల్ యూనిట్ (ఎంఎంయూ) సేవలను సీఎం వైఎస్ జగన్ సర్కార్ ఆధునికీకరించడం శ్రీనివాసరావుకు వరంగా మారింది. నెలనెలా ఆ ఊరికి 104 వెళ్తోంది. అందులోని వైద్యుడు, వైద్య సిబ్బంది శ్రీనివాసరావు ఇంటికే వెళ్లి వైద్యం చేస్తున్నారు. మందులు అందిస్తున్నారు. శ్రీనివాసరావు ఆరోగ్యం మెరుగుపడింది. ఇప్పుడు శ్రీనివాసరావు సంతోషంగా ఉన్నాడు.
కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వాడపాలెంకు చెందిన 63 ఏళ్ల వై. కాంతం ఎడమ కాలికి గాయమైంది. రోజూ డ్రెస్సింగ్‌కు ఆస్పత్రికి వెళ్లాలంటే కష్టంతో కూడుకున్న పని. ఈ క్రమంలో తన పరిస్థితిని స్థానిక ఏఎన్‌ఎంకు వివరించింది. దీంతో గత నాలుగు నెలలుగా గ్రామ సందర్శనకు వచ్చినప్పుడు 104 వైద్యుడు, సిబ్బంది నెలనెలా కాంతం ఇంటికి వెళ్తున్నారు. గాయానికి డ్రెస్సింగ్ చేసి, మందులు అందిస్తున్నారు.
సాక్షి, అమరావతి: గ్రామాల్లో వయోభారం, అనారోగ్య సమస్యలతో మంచానికి పరిమితమైన వారికి, గర్భిణులు, మధుమేహం, రక్తపోటు, జ్వరం తదితర సమస్యలతో బాధపడుతున్న వారికి 104 సేవలను ప్రభుత్వం చేరువ చేసింది. అంతేకాదు.. టీడీపీ ప్రభుత్వ హయాంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన 104, 108 అంబులెన్స్ సేవలను సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ఆధునీకరించి సువర్ణాధ్యాయం సృష్టించింది. అత్యవసర వైద్య సేవలకు ప్రజలు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశ్యంతో ఏకంగా మండలానికొక 104, 108 వాహనాన్ని 2020 జులై 1న అందుబాటులోకి తెచ్చారు. సేవలకు పునరుజ్జీవం పోసి నేటికి రెండేళ్లు పూర్తవుతోంది.
1.49 కోట్ల మందికి వైద్యం
ఈ రెండేళ్ల కాలంలో 104 వాహనాలు గ్రామీణ ప్రజలకు విశేష సేవలు అందించాయి. ఇప్పటివరకూ వీటిలో 1,49,27,186 ఓపీలు నమోదయ్యాయి. 20 రకాల వైద్య సేవలు వీటిద్వారా అందుతున్నాయి. ఎనిమిది రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేస్తున్నారు. టీడీపీ హయాంలో రోజుకు 2 గ్రామాల చొప్పున.. ఒక్కో గ్రామంలో రెండు గంటలసేపు మాత్రమే వాహన సేవలు అందేవి. ఇప్పుడు 104 వాహనం రోజంతా ఒకే గ్రామంలో ఉంటోంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా సగటున రోజుకు 40వేల మందికిపైగా ప్రజలకు వైద్య సేవలు అందుతున్నాయి. మధ్యాహ్నం వరకూ ఓపీలు నిర్వహించి, మధ్యాహ్నం నుంచి వృద్ధులు, వికలాంగులు, మంచానికి పరిమితమైన రోగుల ఇళ్లకు వెళ్లి సేవలు అందిస్తున్నారు. ఇలా ఇప్పటివరకూ 13,32,408 హోమ్ విజిట్స్‌ను వైద్యులు నిర్వహించారు.
నాడు దైన్యం..
– టీడీపీ హయాంలో 104 వాహనాలు 292 ఉండేవి.
– 81,381 జనాభాకు ఒక 104 వాహనం..
– అందుబాటులో ఉండే మందులు 52 మాత్రమే
– అందే వైద్య సేవలు.. రక్తపోటు, మధుమేహం, జనరల్ ఓపీ
– వైద్యులు, మందుల కొరత ఉండేది.
– రోజుకు 20వేల లోపు జనాభాకు అరకొరగా వైద్య సేవలు
– పీహెచ్‌సీలతో సమన్వయం ఉండేది కాదు.
నేడు ధైర్యం..
– వైఎస్సార్‌సీపీ హయాంలో 656 వాహనాలున్నాయి.
– 44,452 జనాభా ఒక 104 వాహనం
– అందుబాటులో ఉండే మందులు 74
– 20 రకాల వైద్య సేవలు
– వైద్యులు, మందుల కొరతకు తావులేదు.
– రోజుకు 40,560 మందికి వైద్య సేవలు
– పీహెచ్‌సీలు, ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రులతో సమన్వయం ఉంటోంది.
రెండేళ్లలో 104 వైద్య సేవలు ఇలా..
– రక్తపోటు ఓపీలు : 24,73,681
– మధుమేహం ఓపీలు : 29,17,667
– ఏఎన్‌సీ : 3,87,628
– హోమ్ విజిట్స్ : 13,32,408
– ఇతర ఓపీలు : 81,48,210
– పంపిణీ చేసిన మందులు : 64,39,32,777
ఫోన్ చేసిన నిమిషాల్లో కుయ్..కుయ్..
రాష్ట్రవ్యాప్తంగా పట్టణాలు, గ్రామాలు, గిరిజన ప్రాంతాల్లో గతంతో పోలిస్తే 108 అంబులెన్స్‌లు చాలా వేగంగా స్పందిస్తున్నాయి.
– పట్టణ ప్రాంతాల్లో ఫోన్‌చేసిన 18.03 నిమిషాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో 19.21 నిమిషాల్లో, గిరిజన ప్రాంతాల్లో 24.50 నిమిషాల్లో, గిరిజన ప్రాంతాల్లో 27:23 నిమిషాల్లో అంబులెన్స్‌లు ఘటన స్థలికి చేరుకుంటున్నాయి.
– రెండేళ్లలో 20,16,297 అత్యవసర సేవలను ‘108’ అందించాయి.
– నిజానికి టీడీపీ హయాంలో 440 అంబులెన్స్‌లు ఉండేవి. కానీ, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వాటిని 748కు పెంచింది. దీంతో అప్పట్లో 1,19,595 మంది జనాభాకు ఒక అంబులెన్స్ ఉండగా, ప్రస్తుతం 74,609 మంది జనాభాకు ఒక అంబులెన్స్ ఉంది.
– ఇక రాష్ట్రవ్యాప్తంగా సగటున రోజుకు 3,294 మందిని అత్యవసర పరిస్థితుల్లో 108 అంబులెన్స్‌లు ఆసుపత్రులకు తరలిస్తున్నాయి
ఫోన్‌చేసిన 20 నిమిషాల్లో..
నా కుమార్తె పురిటి నొప్పులతో బాధపడుతుంటే 108కు ఫోన్‌చేశాం. 20 నిమిషాల్లో అంబులెన్స్ ఇంటికి వచ్చింది. సరైన సమయంలో ఆసుపత్రికి చేరాం. తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. 108 సకాలంలో రావడంవల్లే ఇది సాధ్యమైంది. పైసా ఖర్చు లేకుండా ఆస్పత్రిలో చేర్చారు.
– కర్రి అప్పలనాయుడు, రాకోడు గ్రామం, విజయనగరం జిల్లా
108లోనే ఇబ్బందిలేకుండా ప్రసవం
నాకు పురిటి నొప్పులు రావడంతో మా వాళ్లు 108కు ఫోన్‌చేశారు. కొద్ది నిమిషాల్లోనే అంబులెన్స్ వచ్చింది. వాహనం ఎక్కి కొంతదూరం వెళ్లగానే నాకు బీపీ పెరిగింది. వెంటనే అప్రమత్తమైన ఈఎంటీ శ్రీనివాసులు ఫోన్ ద్వారా డాక్టర్ల సలహాలు తీసుకుంటూ వాహనంలోనే ఇబ్బందిలేకుండా కాన్పు చేశారు.
– సీహెచ్ రాజేశ్వరి, దేవరపాళెం, నెల్లూరుత్వరలో మరో 432 వాహనాలు
104 ఎంఎంయూ వైద్య సేవలను మరింత విస్తరిండం ద్వారా ఫ్యామిలీ ఫిజీషియన్ విధానాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తెస్తున్నాం. ఈ క్రమంలో కొత్తగా మరో 432 వాహనాలను కొనుగోలు చేస్తున్నాం. ఈ వాహనాలన్నీ అందుబాటులోకొస్తే ప్రతీ గ్రామానికి నెలలో రెండుసార్లు ‘104’ వెళ్తుంది. దీంతో ప్రజలకు వైద్య సేవలు మరింత మెరుగ్గా అందుతాయి.
– విడదల రజని, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి
Comments
Please login to add a commentAdd a comment