AP: ప్రసవానికి ప్రభుత్వాస్పత్రికొస్తే రూ.11 వేలు | 11 thousand for Mother childbirth government hospital Andhra Pradesh | Sakshi
Sakshi News home page

AP: ప్రసవానికి ప్రభుత్వాస్పత్రికొస్తే రూ.11 వేలు

Oct 6 2021 4:50 AM | Updated on Oct 6 2021 4:56 AM

11 thousand for Mother childbirth government hospital Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ వైద్య రంగంలో అనేక విప్లవాత్మక సంస్కరణలతో దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది.. ఏపీ ప్రభుత్వం. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవం చేయించుకున్నవారికి కేంద్రం భాగస్వామ్యంతో రూ.11 వేలు అందిస్తోంది. ఉచిత వైద్యసేవలు, మందులు, ఆహారం, రవాణాకు ఈ రూ.11 వేలు అదనం కావడం విశేషం. ఈ మొత్తాన్ని కూడా నగదు రూపంలో నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తున్నారు. దేశంలో మరే రాష్ట్రంలోనూ ఇలా లేకపోవడం గమనార్హం. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంల ద్వారా ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికీ చేరవేయాలని ఆదేశించింది. ప్రభుత్వాస్పత్రులకు వస్తే అందే ప్రయోజనాలను వివరంగా చెప్పాలని సూచించింది. 
   
రవాణా నుంచి వైద్యసేవలన్నీ ఉచితంగానే..
ప్రభుత్వాస్పత్రులకు ప్రసవం కోసం వచ్చే గర్భిణులకు రవాణా నుంచి మందుల వరకు అన్నీ ఉచితమే. గర్భిణికి పురిటినొప్పులు రాగానే 108కు ఫోన్‌ చేస్తే ఆస్పత్రికి తీసుకెళతారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) నుంచి బోధనాస్పత్రి వరకూ ఎక్కడైనా వైద్యం చేయించుకోవచ్చు. 

372 పీహెచ్‌సీల్లో జీరో డెలివరీలు 
రాష్ట్రంలో 1,149 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలుండగా 372 పీహెచ్‌సీల్లో ఒక్క ప్రసవం కూడా జరగడం లేదు. ఇందులో అత్యధికంగా కృష్ణా జిల్లాలో 52 పీహెచ్‌సీలు ఉన్నాయి. వీటిలో కూడా సాధారణ ప్రసవాలు చేయాలని కుటుంబ సంక్షేమ శాఖ యోచిస్తోంది. ఇప్పటికే ఇద్దరు వైద్యాధికారులు, ముగ్గురు నర్సులు, లేబర్‌ రూమ్‌కు కావాల్సిన వసతులు అన్నీ పీహెచ్‌సీల్లో సమకూరుస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వాస్పత్రుల్లో 40 శాతం మాత్రమే ప్రసవాలు జరుగుతున్నాయి. వీటిని భారీగా పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.  

ప్రభుత్వాస్పత్రులకు వస్తే లాభాలెన్నో.. 
► గర్భిణి దశలోనే ప్రభుత్వాస్పత్రుల్లో వైద్య పరీక్షలకు వస్తే స్టాఫ్‌ నర్స్, పీహెచ్‌ఎన్, ఎంపీహెచ్‌ఎస్, మెడికల్‌ ఆఫీసర్‌లు ప్రత్యేక ట్రాకింగ్‌ సిస్టమ్‌ ద్వారా పరిశీలిస్తారు. 
► సాధారణ ప్రసవాలను ప్రోత్సహిస్తారు. సిజేరియన్‌ అవసరమైతే బాధ్యతగా చేస్తారు. 
► ప్రసవం సమయంలో రక్తం అవసరమైతే ప్రభుత్వమే సమకూరుస్తుంది. 
► బాలింతకు ఆస్పత్రిలో ఉన్నన్ని రోజులు ఉచితంగా పోషకాహారం అందిస్తారు. 
► చిన్నారులకు ఉచితంగా వ్యాక్సిన్లు ఇస్తారు. 
► ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కాగానే తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌లో ఇంటికి ఉచితంగా చేర్చుతారు. 
► బిడ్డ పుట్టగానే ఆధార్‌ నమోదు చేస్తారు.. పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం ఇస్తారు. 

బాలింతలకు భారీగా ఆసరా 
గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య ఆసరా ఇస్తోంది. సాధారణ ప్రసవానికి రూ.5 వేలు, సిజేరియన్‌ ప్రసవానికి రూ.3 వేలు ఇస్తోంది. తల్లి కోలుకునే సమయంలో ఈ మొత్తం వారికి ఎంతో భరోసానిస్తోంది. దీనికి తోడు ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన, జననీ సురక్ష యోజనల కింద మరికొంత సొమ్ము సమకూరుతోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement