
విజయవాడలోని గుణదల మూడో డివిజన్‌లో గాబ్రియల్‌కు పింఛన్ ఇస్తున్న వలంటీర్ సోనీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అవ్వాతాతలతో పాటు వితంతువులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, వివిధ రకాల చేతివృత్తిదారులకు ఒకటో తేదీ బుధవారం ఠంచన్‌గా పింఛను డబ్బులు చేతికి అందాయి. బుధవారం తెల్లవారుజాము నుంచే రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్ల పంపిణీ ప్రారంభించిన గ్రామ, వార్డు వలంటీర్లు రాత్రి ఎనిమిది గంటలకల్లా 55,03,498 మందికి రూ.1,516.10 కోట్లు పంపిణీ చేశారు. ఈ నెల ఒకటో తేదీ నుంచి 63.87 లక్షల మందికి పింఛన్లు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1,759.99 కోట్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. తొలిరోజునే 86.16 శాతం మందికి పంపిణీ పూర్తయిందని, మరో నాలుగురోజులు పంపిణీ కొనసాగుతుందని సెర్ప్ అధికారులు చెప్పారు.
శభాష్ వలంటీర్..
రోడ్డు ప్రమాదంలో కాలు విరిగి ఆపరేషన్ అయి నడవలేని స్థితిలో ఉండి కూడా.. తన కోసం ఎదురు చూసే అవ్వాతాతలకు సకాలంలో పింఛను నగదు అందించేందుకు బుధవారం తెల్లవారుజామునే వాకింగ్ స్టాండ్‌తో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి చిత్తశుద్ధి చాటుకున్నారు ఈ వలంటీర్. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని 168 సచివాలయం పరిధిలో వలంటీర్‌గా విధులు నిర్వర్తిస్తున్న సప్పా శ్రీనివాసరావు గతనెలలో ద్విచక్రవాహనంపై వెళ్తూ ప్రమాదానికి గురయ్యారు. ఎడమకాలు విరగటంతో డాక్టర్లు ఆపరేషన్ చేసి ఐరన్ ప్లేట్స్ వేశారు. కొద్దికాలం విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. అయినా శ్రీనివాసరావు వాకింగ్ స్టాండ్ సహాయంతో స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్ అందించి అందరి ప్రశంసలు అందుకున్నారు.
– వించిపేట (విజయవాడ పశ్చిమ
Comments
Please login to add a commentAdd a comment