సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విమానయానరంగం జోరుమీద కొనసాగుతోంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఆరు నెలల కాలంలో రాష్ట్రంలోని ఆరు విమానాశ్రయాల ద్వారా 27,49,835 మంది ప్రయాణించారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య ఆరు నెలల కాలంతో పోలిస్తే ఈ ఏడాది రాష్ట్రంలో విమాన ప్రయాణికుల సంఖ్యలో 17.22శాతం వృద్ధి నమోదైంది.
2022-23 సంవత్సరంలో రాష్ట్రంలోని ఆరు విమానాశ్రయాల నుంచి 23,45,795 మంది ప్రయాణించగా, ఆ సంఖ్య ఈ ఏడాది 27,49,835కు చేరింది. రాష్ట్రంలో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు జోరుగా కొనసాగుతున్నాయన్న విషయాన్ని ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
విశాఖలో అత్యధిక వృద్ధి...
పరిపాలనా రాజధానిగా ప్రకటించిన విశాఖపట్నం విమానాశ్రయం అన్నిటికంటే అత్యధికంగా 30.5శాతం వృద్ధిరేటును నమోదు చేసింది. గత ఏడాది విశాఖ నుంచి 11.50 లక్షల మంది ప్రయాణించగా, ఆ సంఖ్య ఈ ఏడాది ఏకంగా 15.03 లక్షలకు పెరిగింది. పరిపాలనా రాజధానిగా ప్రకటించినప్పటి నుంచి విశాఖకు విమాన ప్రయాణికుల సంఖ్య పెరిగిందని, గత కొన్ని నెలలుగా నమోదవుతున్న గణాంకాలే దీనికి నిదర్శనమని ఎయిర్‌పోర్టు అధికారులు పేర్కొన్నారు.
విశాఖ తర్వాత గడిచిన ఆరు నెలల్లో విజయవాడ నుంచి 5.41 లక్షల మంది, తిరుపతి నుంచి 4.30 లక్షల మంది, రాజమండ్రి నుంచి 2.11 లక్షల మంది ప్రయాణించారు. కడప ఎయిర్‌పోర్టు నుంచి 41,056 మంది, కర్నూలు ఎయిర్‌పోర్టు నుంచి 21,326 మంది ప్రయాణించారు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల విమానాలు రద్దు కావడంతో తిరుపతి, కర్నూలు విమానాశ్రయాల నుంచి ప్రయాణించేవారి సంఖ్యలో స్వల్ప తగ్గుదల నమోదైందని, రానున్నకాలంలో ఈ రెండు చోట్ల నుంచి కూడా ప్రయాణికుల సంఖ్య పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
‘భోగాపురం’తో డబుల్
ప్రస్తుతం నడుస్తున్న విశాఖపట్నం విమానాశ్రయం ఎయిర్‌ఫోర్స్ వారిది కావడంతో రాత్రిపూట అనేక ఆంక్షలు ఉన్నాయని, భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి వస్తే ఆంక్షలు తొలగిపోతాయని, ప్రయాణికుల సంఖ్య రెట్టింపు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకే తొలి దశలో ఏటా 60 లక్షల మంది ప్రయాణికుల సామర్థ్యంతో భోగాపురం విమానాశ్రయం నిర్మిస్తున్నారు. ఈ పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల శంకుస్థాపన చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ విమానాశ్రయం 2025 నాటికి అందుబాటులోకి రానుంది.
చదవండి: వావ్..విశాఖ!
Comments
Please login to add a commentAdd a comment