పెనుకొండ/హనుమాన్‌జంక్షన్ రూరల్ : ‘జగనన్నకు చెబుదాం’కు ఫిర్యాదు చేసిన బాధితుల కోసం అధికారులు, పోలీసులు దిగొస్తున్నారు. ఫిర్యాదుదారుల నుంచి వివరాలు సేకరించి, ఆధారాలు తీసుకుని న్యాయం చేసేందుకు ఉపక్రమిస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి చేతిలో మోసపోయిన ఇద్దరు బాధితులు, వీఆర్వో నిర్లక్ష్యంతో ఇబ్బందిపడుతున్న మరో బాధితుడు 1902 నంబర్‌కు ఫోన్ చేయడంతో అధికారులు ఫిర్యాదుదారులను సంప్రదించి వారికి న్యాయం చేసేందుకు చర్యలు తీసుకున్నారు.
మూడేళ్లుగా ముప్పుతిప్పలు
శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం పాలసముద్రానికి చెందిన దిలీప్‌రెడ్డి మండలంలోని గొల్లపల్లి–చంద్రగిరి మధ్య రోడ్డు పక్కన ప్లాట్లు వేశాడు. తన వద్ద ప్లాట్లు కొనేవారికి బ్యాంకులోను కూడా తానే ఇప్పిస్తానని ప్రచారం చేశాడు. దీంతో పెనుకొండకు చెందిన గొల్ల గోపాల్, ఓబుళరెడ్డిలు ఆయన వద్ద ప్లాట్లు కొనుగోలు చేసేందుకు వెళ్లగా, ఒక్కో ప్లాట్ రూ.16 లక్షలుగా చెప్పాడు. ఒక్కో ప్లాట్‌కు రూ.4 లక్షల చొప్పున అడ్వాన్స్ ఇస్తే.. మిగతా మొత్తం తానే బ్యాంకు ద్వారా లోను ఇప్పిస్తానన్నాడు. దీంతో వారిద్దరూ 2020, జనవరిలో చెరో ప్లాట్ కోసం రూ.4 లక్షల చొప్పున దిలీప్‌రెడ్డికి ఇచ్చారు. ఆ తర్వాత దిలీప్‌రెడ్డి ముఖం చాటేశాడు.
లోన్ సంగతి తర్వాత కనీసం తాము చెల్లించిన డబ్బులన్నా వెనక్కి ఇవ్వాలని కోరగా.. చెక్కులిచ్చాడు. వాటిని బ్యాంకులో వేయగా అవి బౌన్స్ అయ్యాయి. దీంతో బాధితులు కోర్టును ఆశ్రయించి నోటీసులు పంపగా.. దిలీప్‌రెడ్డి వాటిని తీసుకోలేదు. ఇలా మూడేళ్ల పాటు పోరాటం చేస్తున్న బాధితులు రెండు రోజుల కిందట ‘జగనన్నకు చెబుదాం’కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. 1902 కాల్ సెంటర్ వారు వివరాలన్నీ నమోదు చేసుకుని, సమీప పోలీస్‌స్టేషన్‌కు వివరాలు పంపారు.
దీంతో బుధవారం ‘కియా’ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ వెంకటరమణ బాధితులకు ఫోన్ చేయగా గొల్ల గోపాల్ అందుబాటులోకి వచ్చాడు. అతన్ని స్టేషన్‌కు పిలిపించి వివరాలపై ఆరా తీసి, ఆధారాలు తీసుకున్నారు. అనంతరం దిలీప్‌పై కేసు నమోదు చేశారు. మరో బాధితుడు ఓబుళరెడ్డిని కూడా స్టేషన్‌కు పిలిపించి ఫిర్యాదు తీసుకుంటామని ఎస్‌ఐ తెలిపారు. మూడేళ్లుగా కనీసం కేసు కూడా నమోదు కాలేదని, 1902కు ఫోన్ చేయగానే పోలీసులే కేసు నమోదు చేశారని బాధితుడు గొల్ల గోపాల్ చెప్పారు.
అర్జీదారు ఇంటికి ఆర్డీవో
ఏలూరు జిల్లా నూజివీడు మండలం మీర్జాపురానికి చెందిన గోళ్ల రాణికి బాపులపాడు మండలం మల్లవల్లి గ్రామంలోని ఆర్‌ఎస్ నంబర్ 110–2లో రెండు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. పట్టా భూమి అయినప్పటికీ కొన్నేళ్లుగా రెవెన్యూ అధికారులు 22ఏ కేటగిరీ కింద ప్రభుత్వ భూమిగా నమోదు చేశారు. అప్పటి నుంచి రాణితో పాటు ఆమె కుటుంబ సభ్యులు రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.
అయితే వీఆర్వో సరిగ్గా స్పందించకపోవడంతో సమస్య పరిష్కారం కాలేదు. విసుగుచెందిన గోళ్ల రాణి కుటుంబ సభ్యులు ఈ నెల 13వ తేదీన ‘జగనన్నకు చెబుదాం’లో ఫిర్యాదు చేశారు. స్పందించిన గుడివాడ ఆర్డీవో పి.పద్మావతి, బాపులపాడు తహసీల్దార్ సీహెచ్ నరసింహారావు, మల్లవల్లి వీఆర్వో ప్రసాద్‌ను వెంటపెట్టుకుని బుధవారం మీర్జాపురంలోని గోళ్ల రాణి ఇంటికి వెళ్లారు.
మల్లవల్లి వ్యవసాయ భూములకు సంబంధించిన ప్రభుత్వ రికార్డులను తనిఖీ చేయడంతో పాటుగా, గోళ్ల రాణి వద్ద ఉన్న పత్రాలను కూడా ఆర్డీవో పద్మావతి పరిశీలించారు. సమస్య పరిష్కరించకుండా పదే పదే అర్జీదారులను తిప్పుకోవడం తగదని వీఆర్వో ప్రసాద్‌ను ఆర్డీవో మందలించారు. దీర్ఘకాలంగా ఉన్న మల్లవల్లి ఆర్‌ఎస్ నంబర్ 110–2 సెక్షన్ 22ఏ సమస్యను తక్షణమే పరిష్కరించి న్యాయం చేస్తామని ఆర్డీవో హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment