ఇక వందేభారత్‌ స్లీపర్‌ కోచ్‌ రైళ్లు.. ఒక్కో రైలుకు రూ.120 కోట్ల ఖర్చు | 200 Vande Bharat sleeper coach trains in the first phase | Sakshi
Sakshi News home page

ఇక వందేభారత్‌ స్లీపర్‌ కోచ్‌ రైళ్లు.. ఒక్కో రైలుకు రూ.120 కోట్ల ఖర్చు

Published Thu, Aug 3 2023 4:40 AM | Last Updated on Thu, Aug 3 2023 11:17 AM

200 Vande Bharat sleeper coach trains in the first phase - Sakshi

సాక్షి, అమరావతి: వందేభారత్‌ స్లీపర్‌ కోచ్‌ రైళ్లు త్వరలో పట్టాలెక్కనున్నాయి. రాజధాని ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు ప్రత్యామ్నా­యంగా రైల్వేశాఖ వందేభారత్‌ స్లీపర్‌ కోచ్‌ రైళ్లను ప్రవేశ­పెడుతోంది. మొదటిదశలో 200 రైళ్ల తయారీకి కాంట్రాక్టును ఖరారు చేసింది.  రైల్వేశాఖ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వందేభారత్‌ రైళ్లలో ప్రస్తుతం చెయిర్‌కార్‌ కోచ్‌లే అందుబాటులో ఉన్నాయి. దేశంలో రెండో అతివేగంగా ప్రయాణించే వందేభారత్‌ రైళ్లలో ప్రస్తుతం ఏసీ చెయిర్‌కార్‌ కోచ్‌లే ఉన్నాయి.

ఈ రైళ్లకు ప్రయాణికుల నుంచి ఆదరణ లభిస్తోంది. కానీ స్లీపర్‌ కోచ్‌లు లేకపోవడంపై ప్రతికూల స్పందన కూడా వ్యక్తమవుతోంది. స్లీపర్‌ కోచ్‌లు లేకపోవడంతో దూరప్రాంత ప్రయాణాలకు ప్రయాణికులు విముఖత చూపుతున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగానే రైల్వేశాఖ వందేభారత్‌ స్లీపర్‌ కోచ్‌ రైళ్లు ప్రవేశపెడుతోంది. స్లీపర్‌ కోచ్‌లతో కూడిన వందేభారత్‌ రైళ్ల తయారీకి టెండర్ల ప్రక్రియను పూర్తిచేసింది. మొత్తం 400 రైళ్లు ప్రవేశపెట్టాలన్నది రైల్వేశాఖ ఉద్దేశం.

మొదటిదశలో ప్రవేశపెట్టే 200 రైళ్ల కోసం టెండర్లను ఇటీవల ఖరారు చేసింది. ఏడుసంస్థలు బిడ్లు దాఖలు చేయగా.. రైల్‌వికాస్‌ నిగమ్‌ లిమిటెడ్, రష్యాకు చెందిన టీఎంహెచ్‌ గ్రూప్‌తో కూడిన కన్సార్షియం 120 రైళ్ల తయారీ కాంట్రాక్టును దక్కించుకుంది. ఒక్కో రైలును రూ.120 కోట్లతో తయారు చేసేందుకు ఈ కన్సార్షియం ముందుకొచ్చింది. టిట్లాఘర్‌ వేగన్, బీహెచ్‌ఈఎల్‌తోకూడిన కన్సార్షియం మరో 80 రైళ్లను తయారు చేయనుంది. 

గంటకు 160 కిలోమీటర్ల వేగం.. 
గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే వందేభారత్‌ స్లీపర్‌ కోచ్‌ రైళ్లలో మొత్తం 16 బోగీలుంటాయి. థర్డ్‌ ఏసీ కోచ్‌లు 11, సెకండ్‌ ఏసీ కోచ్‌లు 4, ఫస్ట్‌ ఏసీ ఒక కోచ్‌ ఉండేలా డిజైన్‌ చేశారు. ప్రయాణికుల స్పందనను బట్టి.. తరువాత దశల్లో కోచ్‌ల సంఖ్యను 20 లేదా 24కు కూడా పెంచాలని రైల్వేశాఖ భావిస్తోంది. ఈ రైలు బయలుదేరిన నిమిషం వ్యవధిలోనే గంటకు 160 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

రాజధాని ఎక్స్‌ప్రెస్‌లు ‘ఫ్రంట్‌ డ్రివెన్‌’ విధానంలో ప్రయాణిస్తున్నాయి. వందేభారత్‌ స్లీపర్‌ కోచ్‌లు ‘డిస్ట్రిబ్యూటెడ్‌’ విధానంలో ప్రయాణిస్తాయి. దీంతో రైలు ప్రయాణంలో కుదుపులు, శబ్దం కనిష్టస్థాయిలోనే ఉంటాయి.

రాజధాని ఎక్స్‌ప్రెస్‌ల కంటే వందేభారత్‌ స్లీపర్‌ కోచ్‌ రైళ్లు పట్టాలపై తక్కువ ఒత్తిడి కలిగిస్తూ అధికవేగంతో ప్రయాణిస్తాయి. దీనివల్ల పట్టాల నిర్వహణ వ్యయం కూడా తగ్గుతుందని రైల్వే ఇంజినీరింగ్‌ నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది చివరినాటికి తొలి వందేభారత్‌ స్లీపర్‌ కోచ్‌ల రైలును పట్టాలెక్కించాలని రైల్వేశాఖ భావిస్తోంది. 

నేటినుంచి సామర్లకోటలో వందేభారత్‌కు హాల్ట్‌ 
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కాకినాడ జిల్లా సామర్లకోటలో గురువారం నుంచి వందేభారత్‌ రైలు ఆగనుంది. ఈ రైలు సామర్లకోట జంక్షన్‌లో ఒక్క నిమిషం ఆగేందుకు రైల్వేశాఖ అనుమతి ఇచ్చింది. ఈ రైలు హాల్ట్‌కు అనుమతి ఇవ్వాలన్న ప్రజల విజ్ఞప్తుల్ని కాకినాడ ఎంపీ వంగా గీతావిశ్వనాథ్‌ కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విన్‌వైష్ణవ్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో 48 గంటల వ్యవధిలోనే వందేభారత్‌ రైలు హాల్ట్‌కు ఆమోదం లభించింది. దీంతో ప్రయాణికులు  సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement