
మాట్లాడుతున్న మంత్రి కురసాల కన్నబాబు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పలు బ్యాంకుల ద్వారా ప్రాధాన్యతా రంగాలకు రూ.2.31 లక్షల కోట్ల రుణ సహాయం అందించేందుకు అవకాశమున్నట్లు నాబార్డు (జాతీయ గ్రామీణ వ్యవసాయాభివృద్ధి బ్యాంకు)రూపొందించిన స్టేట్ ఫోకస్ పేపర్ వెల్లడించింది. దీనిలో వ్యవసాయ రంగానికి రూ.1.57 లక్షల కోట్లు, ఎంఎస్‌ఎంఈ రంగానికి రూ.47,402 కోట్లు, ఎగుమతులు క్రెడిట్ కింద రూ.2,880 కోట్లు, విద్యా రంగానికి రూ.1,584 కోట్లు, గృహ నిర్మాణ రంగానికి రూ.14,335 కోట్లు, రెన్యువల్ ఎనర్జీకి రూ.461 కోట్లు, సోషల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వాల్వింగ్ బ్యాంకు క్రెడిట్ కింద రూ.513 కోట్లు, ఇతర రంగాలకు రూ.6,418 కోట్ల రుణాలు అందించేందుకు అవకాశముందని ఫోకస్ పేపర్లో పేర్కొన్నారు. ఈ పేపర్‌ను రిఫరెన్స్ డాక్యుమెంట్‌గా చేసుకుని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ 2021–22 ఆర్థిక సంవత్సరానికి బ్యాంకుల వార్షిక రుణ ప్రణాళికను రూపొందించనుంది. 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన స్టేట్ క్రెడిట్ సదస్సు శుక్రవారం నాబార్డు ఆధ్వర్యంలో సచివాలయంలో జరిగింది. ఈ సందర్భంగా స్టేట్ ఫోకస్ పేపర్ 2021–22ను వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఆవిష్కరించారు.
ప్రభుత్వ పథకాలకు తోడ్పాటునందించాలి : మంత్రి కన్నబాబు
అనంతరం.. వ్యవసాయ మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. ప్రాథమిక రంగాల అభివృద్ధితోపాటు రైతుల ఆర్థిక ప్రయోజనాలు తమ ప్రభుత్వ ప్రాధాన్యతలని స్పష్టంచేశారు. వీటి సాధనకు బ్యాంకులు తగిన తోడ్పాటును అందించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, మంత్రి ఇంకా ఏమన్నారంటే..
► జనతా బజార్ల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అందుకు కూడా బ్యాంకులు సహకరించాలి.
► అనంతపురం నుండి శ్రీకాకుళం వరకూ రిటైల్ చైన్ అభివృద్ధికి, గ్రామస్థాయిలో వ్యవసాయానికి సంబంధించి పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాల అభివృద్ధికీ సహకరించాలి.
► అదే విధంగా.. పాడి పరిశ్రమాభివృద్ధి రంగానికి, కౌలు రైతులకు మానవతా దృక్పథంతో వ్యవహరించి తగిన సహాయం చేయాలి.
► రాష్ట్ర ప్రగతికి నాబార్డు ఎంతగానో సహాయ పడుతోంది. ఇందుకు నాబార్డు చైర్మన్ గోవిందరాజులుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
నాబార్డు తోడ్పాటు అభినందనీయం : సీఎస్
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ మాట్లాడుతూ.. రాష్ట్రాభివృద్ధికి వివిధ బ్యాంకులు, నాబార్డు అందిస్తున్న తోడ్పాటును కొనియాడారు. నాబార్డు కేవలం వ్యవసాయ రంగానికే కాక నీటిపారుదల, విద్య, వైద్య రంగాల్లో కూడా సహకారం అందించడం అభినందనీయమన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాల అమలుకు మరింత సానుకూల దృక్పథంతో ముందుకు రావాలని సీఎస్ ఆకాంక్షించారు. నాబార్డు రూపొందించిన స్టేట్ ఫోకస్ పేపర్ ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉందన్నారు.
లక్ష్యానికి మించి సాయం: నాబార్డు సీజీఎం
నాబార్డు చీఫ్ జనరల్ మేనేజర్ సుదీర్‌కుమార్ జొన్నావర్ మాట్లాడుతూ.. 2019–20 ఆర్థిక సంవత్సరంలో నాబార్డు ద్వారా రాష్ట్రానికి రూ.27,992 కోట్ల సహాయం అందించాల్సి ఉండగా లక్ష్యాన్ని మించి రూ.32 వేల కోట్లు అందించామన్నారు. ప్రభుత్వ లక్ష్యాలు, ఆశయాలకు అనుగుణంగా నాబార్డు తనవంతు తోడ్పాటును అందిస్తోందన్నారు. 2020–21 ఆర్థిక సంవత్సరం కంటే 9 శాతం అధికంగా ప్రాధాన్యతా రంగంలో రుణ సౌకర్యాన్ని కల్పించేందుకు వీలుగా స్టేట్ ఫోకస్ పేపరును రూపొందించామన్నారు. సమావేశంలో నాబార్డు జీఎం బి ఉదయభాస్కర్ అజెండా అంశాలను వివరించారు. వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, ఆర్బీఐ జీఎం సుందరం శంకర్, సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి సునీత, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి అనురాధ, స్పెషల్ సెక్రటరీ మధుసూదన్‌రెడ్డి, రిజి్రస్టార్ ఆఫ్ కోఆపరేటివ్స్ ఎ.బాబు తదితరులు మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment