14 నుంచి ‘వలంటీర్లకు వందనం’ | 2.33 lakh volunteers have been selected for Honors | Sakshi
Sakshi News home page

14 నుంచి ‘వలంటీర్లకు వందనం’

Published Sun, Apr 9 2023 5:01 AM | Last Updated on Sun, Apr 9 2023 10:24 AM

2.33 lakh volunteers have been selected for Honors - Sakshi

సాక్షి, అమరావతి: అవినీతికి తావు లేకుండా.. కులం, మతం, వర్గం, ప్రాంతం, పార్టీలకు అతీతంగా ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వివిధ సంక్షేమ పథకాల అమలులో వారధులుగా పనిచేస్తున్న గ్రామ, వార్డు వలంటీర్లను ప్రభుత్వం వరుసగా మూడో ఏడాది కూడా సత్కరించనుంది. కనీసం ఏడాదిపాటు వలంటీర్‌గా పనిచేస్తూ ఎటువంటి ఫిర్యాదులకు తావులేని మొత్తం 2,33,719 మంది వలంటీ­ర్లను ఈ ఏడాది సత్కరించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. వలంటీర్ల సత్కారాల కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 14న తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో లాంఛనం­గా ప్రారంభించనున్నారు.

అనంతరం దాదాపు నెల రోజులపాటు సచివాలయాల వారీగా ఎక్కడికక్కడ స్థానిక ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో సత్కార కార్యక్ర­మాలు కొనసాగుతాయి. సీఎం వైఎస్‌ జగన్‌అధికారంలోకి వచ్చిన మూడు నెలల వ్యవధిలోనే 2019 ఆగస్టు 15వ తేదీన వలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. కేవలం గౌరవ వేతనంతోనే నిస్వార్థంగా పనిచేస్తున్న వలంటీర్ల సేవలను గుర్తిస్తూ ఏటా ఉగాది సందర్భంగా ‘వలంటీర్లకు వందనం’ పేరుతో ఈ సత్కారాలను నిర్వహిస్తోంది.

2020–21 ఆర్థిక సంవత్సరానికి గాను 2021 ఏప్రిల్‌ 14న వలంటీర్ల సత్కారాల కార్యక్రమం నిర్వహించగా.. మరుసటి ఏడాది ఏప్రిల్‌ 7వ తేదీ నుంచి ఈ కార్యక్రమాలు మొదలయ్యాయి. ఈ ఏడాది ఉగాది సమయంలో రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమలులో ఉండటంతో ఈ నెల 14వ తేదీ నుంచి ప్రభుత్వం వలంటీర్ల సత్కారాల కార్యక్రమాన్ని నిర్వహించనుంది. 

అవార్డులతో పాటు నగదు పురస్కారం
ప్రతి నియోజకవర్గంలో ఐదుగురు చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 875 మంది వలంటీర్లను ‘సేవా వజ్ర’ పురస్కారం, రూ.30 వేల నగదు, మెడల్, బ్యాడ్జి, శాలువా,  సర్టిఫికెట్‌తో సత్కరిస్తారు.
♦ ప్రతి మండలం, మునిసిపాలిటీ నుంచి ఐదు­గురు చొప్పున, నగరపాలక సంస్థ నుంచి 10 మంది  చొప్పున ఎంపిక చేసి మొత్తంగా 4,220 మందికి ‘సేవారత్న’ అవా­ర్డు, రూ. 20 వేల నగదు, మెడల్, బ్యాడ్జి, శాలువా, సర్టిఫికెట్‌ అందజేసి సత్కరిస్తారు.
2,28,624 మందికి ‘సేవావిుత్ర’ పురస్కారం, రూ.10 వేల నగదు అందజేస్తారు.
వలంటీర్ల పనితీరు, ఆ ప్రాంత కుటుంబాలు వ్యక్తం చేస్తున్న సంతృప్తి, గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వలంటీర్ల హాజ­రు, ప్రతి నెలా మొదటి రోజునే వంద శాతం లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ, వివిధ సంక్షేమ పథకాల అమలులో వలంటీర్ల క్లస్టర్ల పరిధిలో లబ్ధిదారుల గుర్తింపు వివరాల నమోదు తదితర అంశాల ఆధారంగా సేవా వజ్ర, సేవారత్న అవార్డులకు వలంటీర్లను ఎంపిక చేసినట్టు అధికారులు వెల్లడించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement