శరవేగంగా ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్లు | Sakshi
Sakshi News home page

శరవేగంగా ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్లు

Published Wed, Feb 7 2024 5:35 AM

3 lakh poor people House registrations completed by AP Govt - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతి­ష్టా­త్మకంగా నిర్వహిస్తోన్న పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్‌ కార్యక్రమం రికార్డు స్థాయిలో జరుగుతోంది. 4 రోజుల వ్యవధిలోనే రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. 2వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. తొలి­రోజు 5,000 రిజిస్ట్రేషన్లు జరగ్గా క్రమంగా వాటి సంఖ్య పెరిగింది. సోమవారం ఒక్కరోజే 90,000 రిజిస్ట్రేషన్లు చేశారు. మంగళవారం రాత్రికి లక్ష రిజిస్ట్రేషన్లు చేసే అవకాశం ఉంది. సాయంత్రం 6 గంటల సమయానికే 60 వేల రిజిస్ట్రేషన్లు జరి­గాయి.

వివిధ పనుల నిమిత్తం బయటకు వెళ్లిన లబ్ధిదారులు.. సాయంత్రం ఇంటికి వచ్చాక రిజిస్ట్రేషన్లు చేసే కార్యక్రమం వేగంగా జరుగుతోందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు జరిగిన 3 లక్షల రిజిస్ట్రేషన్లలో అత్యధికంగా పల్నాడు జిల్లాలో 24 వేలకుపైగా రిజిస్ట్రేషన్లు ఉన్నాయి. ఆ తర్వాత బాపట్ల, పశ్చిమ గోదావరి, కాకినాడ, అంబేద్కర్‌ కోనసీమ, నంద్యాల జిల్లాల్లో 17 నుంచి 20 వేల రిజిస్ట్రేషన్లు జరిగాయి. ప్రభుత్వం తరఫున వీఆర్‌వోలు లబ్ధిదారుల పేరు మీద రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. 

రోజుకు లక్ష రిజిస్ట్రేషన్లు 
మొత్తం 30.61 లక్షల రిజిస్ట్రేషన్లు చేయాల్సి ఉండగా ఇప్పటివరకు 15.33 లక్షల ఇళ్ల పట్టాల డేటాను ఆయా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఎంటర్‌ చేశారు. త్వరలో మిగిలిన డేటాను కూడా ఎంటర్‌ చేయనున్నారు. రోజుకు లక్ష రిజిస్ట్రేషన్లు చేయడాన్ని లక్ష్యంగా నిర్దేశించుకు­న్నారు. దీనిప్రకారం సాధ్యమైనంత త్వరగా మొత్తం రిజిస్ట్రేషన్లు పూర్తి చేయడానికి ప్రణాళిక రూపొందించారు. ఇందుకోసం సెలవు రోజు­ల్లోనూ రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ఆదివారాల్లోనూ రిజిస్ట్రేషన్లు ఆగకూడదని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.  

కన్వేయన్స్‌ డీడ్ల ముద్రణకు ఏర్పాట్లు 
రిజిస్ట్రేషన్లు చేసిన తర్వాత కన్వేయన్స్‌ డీడ్స్‌ను ముద్రించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆయా జిల్లాల కలెక్టర్లకు ఈ బాధ్యత అప్పగించారు. ఈ డీడ్లను త్వరలో సీఎం వైఎస్‌ జగన్‌ ప్రారంభించనున్నారు. ఆ తర్వాత అన్ని జిల్లాల్లోనూ వాటిని పంపిణీ చేయనున్నారు. దేశ చరిత్రలో పేదలకిచ్చిన ఇళ్ల పట్టాలను రిజిస్ట్రేషన్‌ చేస్తున్న ఏకైక ప్రభుత్వంగా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం నిలిచింది. ఇప్పటివరకు పేదలకు ఇచ్చిన స్థలాలకు గత ప్రభుత్వాలు డీ పట్టాలు ఇచ్చేవి.

వాటిపై పూర్తి హక్కులు లేకపోవడంతో లబ్ధిదారులు అనేక ఇబ్బందులు పడేవారు. అందుకే తొలిసారిగా వారికి హక్కుల ఇబ్బంది లేకుండా రిజిస్ట్రేషన్‌ చేసిన ఇళ్ల పట్టా ఇస్తున్నారు. పదేళ్ల తర్వాత ఈ పట్టా (కన్వేయన్స్‌ డీడ్స్‌) ఆటోమేటిక్‌గా సేల్‌ డీడ్‌గా మారుతుంది. గడువు తీరిన తర్వాత తహశీల్దార్‌ నుంచి నిరభ్యంతర పత్రం అవసరం ఉండదు. కన్వేయన్స్‌ డీడ్స్‌ సేల్‌ డీడ్‌గా మారాక దాన్ని ప్రైవేటు పట్టా మాదిరిగా వినియోగించుకునే అవకాశం ఏర్పడుతుంది. కన్వేయన్స్‌ డీడ్స్‌ పొందినప్పటి నుంచి దానిపై బ్యాంకు రుణాలు తీసుకునే అవకాశం ఉంటుంది. 

Advertisement
 
Advertisement
 
Advertisement