దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని అందరూ మురిసిపోతున్న వేళ మహాత్మాగాంధీ ఒక మాటన్నారు. మన దేశాన్ని మనమే పాలించుకోబోతున్నాం.. మంచిదే కానీ.. మనం గ్రామ స్వరాజ్యం సాధించినప్పుడే దేశానికి అసలైన స్వాతంత్య్రం వచ్చినట్టని అన్నారు. ఆయన సంకల్పానికి, ఆలోచనలకు అనుగుణంగా గాంధీజీ కలలగన్న గ్రామ స్వరాజ్య సాధనే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఓ విధానపరమైన నిర్ణయం తీసుకొని అమల్లోకి తీసుకొచ్చారు.
చదవండి: విప్లవాత్మక నిర్ణయం.. వారి కళ్లలో ఆనందం
పరిపాలన అనేది ప్రజలందరికీ చేరువ కావాలనే ఉద్దేశ్యంతో గ్రామ వార్డు సచివాలయాలు ప్రారంభమయ్యాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా.. 35 ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ఐదు వందలదాకా సేవల్ని ప్రజలకు అందిస్తున్నాయి. ఏదైనా ప్రభుత్వ సేవ కావాలంటే ఒకప్పుడు మండల జిల్లా కేంద్రాలకు పరిగెత్తే ప్రజలు ఇప్పుడు తమ ఊర్లోనే అనేక సేవల్ని పొందుతున్నారు. దాంతో ప్రజల సమయం, డబ్బు ఆదా అవుతున్నాయి. పింఛను నుంచి ఇంటి పట్టాల దాకా.. పథకం ఏదైనా సరే అర్హత వుంటే చాలు ప్రజలకు అందించాలనే ప్రభుత్వ సంకల్పాన్ని కార్యరూపంలోకి తేవడంలో గ్రామ వార్డు సచివాలయాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి.
కాకినాడ జిల్లా కాకినాడ నగరంలోని 30వ డివిజన్‌లో సేవలందిస్తున్న వార్డు సచివాలయాన్ని మూడు సంవత్సరాల క్రితం ఉప్పుటేరు వాగు సమీపంలో నిర్మించారు. దీని పరిధిలోగల 909 కుటుంబాలవారికి అర్హత వుంటే చాలు వివిధ సంక్షేమ పథకాలను అందించడంలో ఈ సచివాలయం కీలకంగా పని చేస్తోంది. అంతే కాదు పలు రకాల సర్కార్ సేవలను అతి తక్కువ సమయంలో అందిస్తున్నారు. సచివాలయ వ్యవస్థ వచ్చినప్పటి నుండి సంక్షేమ పథకాలు తమ ఇంటి వద్దకే నేరుగా వస్తున్నాయని స్థానికులు సంతోషంగా చెబుతున్నారు. ఒక పథకం అందాలంటే ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్ళు అరిగేలా రోజుల తరబడి తిరిగే వాళ్ళమని ఇప్పుడు ఆ పరిస్థితి లేదని వీరు అంటున్నారు. ఇప్పుడు ఏ పని కావాలన్నా తొందరగా అయిపోవడమే కాకుండా.. లంచాలు లేకుండానే పనులు చాలా సులువుగా అవుతున్నాయని వారు చెబుతున్నారు.
చదవండి: జగనన్న ప్రభుత్వం @3 ఏళ్లు: 3 సంవత్సరాలు.. 32 పథకాలు
కాకినాడ నగరంలో 3 లక్షలకు పైగా జనాభా వుంది. వీరికి సేవలందించేందుకు 101 వార్డు సచివాలయాలను ఏర్పాటు చేశారు. వీటిలో ఒకటైన 30 వ డివిజన్ వార్డు సచివాలయంలో మొత్తం 10 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ప్రతి సచివాలయ పరిధిలో వాలంటీర్లు వుంటారు. వారు తమకు కేటాయించిన ఇళ్లకు వెళ్ళి లబ్ధిదారుల వివరాలు సేకరించి సచివాలయానికి అందజేస్తారు. ఆ వివరాల ఆధారంగా సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు తమ పరిధిలోని ప్రజలకు సేవలందిస్తున్నారు. ఇలా సమాజ అభివృద్ధిలో భాగమవ్వడంద్వారా వృత్తిపరమైన సంతృప్తి కలుగుతోందని ఇక్కడ సంక్షేమ విభాగ సెక్రటరీగా పని చేస్తున్న శ్రీనివాస్ అంటున్నారు.
అన్ని అడ్డంకులను అవాంతరాలను ఎదుర్కొని సచివాయాల వ్యవస్థ నానాటికీ బలోపేతమవుతోంది. స్థానిక ప్రజల తలలో నాలుకలాగా వ్యవహరిస్తూ ప్రజాదరణ పొందుతోంది.
దాంతో ఈ వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు మన సచివాలయాల వ్యవస్థను అధ్యయనం చేయడమే దీనికి నిదర్శనం. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సైతం ఈ మధ్యనే ఈ వ్యవస్థను ప్రశంసించారు. మహత్ముని గ్రామ స్వరాజ్య కలలను సాకారం చేస్తూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సచివాలయ వ్యవస్థను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారని ఈ వ్యవస్థ అందించే సేవలు ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నాయని స్థానిక నేతలు అంటున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా పని చేస్తున్న వేలాది గ్రామ వార్డు సచివాలయాలు ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన ఒక వంతెనలాగా మారాయి. ప్రభుత్వ పథకాల అమలులో కీలకంగా అవతరించాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంకల్పం ప్రకారం.. ఆయన ఆలోచనలకు అనుగుణంగా వందలాది ప్రభుత్వ సేవల్ని తక్కువ సమయంలోనే అందుబాటులోకి తెస్తున్నాయి.
నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలోని పడుగుపాడు గ్రామ ఒకటవ సచివాలయం. ఇక్కడ ఏడుగురు సచివాలయ సిబ్బంది, 17 మంది వాలంటీర్లు పనిచేస్తున్నారు. ఎంతో హుందాగా అత్యంత సుందరంగా కార్పొరేట్ కార్యాలయంలా కనిపిస్తున్న ఈ సచివాలయంలోలోకి అడుగు పెట్టగానే ఇక్కడ ధనమ్మ అనే వృద్ధురాలు కనిపించారు. సచివాలయ సేవలను ఆమె కొనియాడారు.
పడుగుపాడు గ్రామ ఒకటవ సచివాలయ పరిధిలో 949 కుటుంబాలున్నాయి. వీటికి సంబంధించిన సంక్షేమ పథకాలను, స్థానికులకు అవసరమయిన పౌర సేవలను అందించడానికి ఇక్కడి సిబ్బంది కృషి చేస్తున్నారు. సచివాలయ వ్యవస్థ రాకముందు, వచ్చిన తర్వాత పరిస్థితులు చాలా మారిపోయాయి
ఆయా ప్రాంతాల ప్రజల అవసరాలు, డిమాండ్లను బట్టి దాదాపు ఐదువందల రకాల సేవలు ఈ గ్రామవార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు అందుతున్నాయి. ఇవి కేవలం అందడమే కాదు, నాణ్యంగా వుండాలని, అంతే కాదు సమయానికి అందడం ముఖ్యమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పలుమార్లు అధికార్లకు దిశానిర్దేశం చేశారు. అది కాలక్రమంలో ఫలితాలనిస్తోంది. అవినీతి, వివక్షత, రాజకీయ ప్రమేయం లేకుండా పేదరిక నిర్మూలన కోసం కృషి చేస్తున్న గ్రామవార్డు సచివాలయాలు.. ప్రజల జీవితాల్లో మార్పుకు శ్రీకారం చుట్టాయి.
గ్రామ వార్డు సచివాలయాలు వచ్చిన తర్వాత ప్రజల జీవితాల్లో మార్పులు కనిపిస్తున్నాయి. వారు అందుకుంటున్న సేవల్లో గణనీయమైన తేడా కనిపిస్తోంది. పింఛను కావాలంటే గతంలోలాగా వారం పదిరోజులు ఎదురు చూడాల్సిన పని లేదు. ఎక్కడకో వెళ్లాల్సిన పని కూడా లేదు. ప్రతి నెలా ఒకటో తేదీన ఉదయం ఆరుగంటలు అయ్యీ కాకముందే లబ్ధిదారుల ఇంటి ముందు వాలంటీర్లు ప్రత్యక్షమవుతున్నాయన్నారు.
ప్రభుత్వం ఎంతో ముందుచూపుతో మరెంతో దార్శనికతతో ప్రవేశపెట్టిన వాలంటీర్ల వ్యవస్థ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతోందని ఇక్కడ పని చేస్తున్న వాలంటీర్లు అంటున్నారు. ఈ వ్యవస్థ కారణంగా తమకు సమాజంలో గౌరవం పెరిగిందని.. కరోనా సంక్షోభ ఆర్థిక ఇబ్బందుల్లో కూడా ప్రజలకు మేలు చేయడం జరిగిందని.. ఇది ఎంతో గొప్ప విషయమని మరో వాలంటీరు విజయ్ కుమార్ అంటున్నారు
నెల్లూరు నగరంలోని మైపాడు గేట్ వెంకటరెడ్డి నగర్ సచివాలయంలో పదిమంది సచివాలయ ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరితో పాటు 19 మంది వాలంటీర్లు ఇక్కడ సేవలందిస్తున్నారు. వేయికి పైగా కుటుంబాలు ఈ సచివాలయ పరిధిలో వున్నారు. మరణ ధృవీకరణ పత్రం కోసం గతంలో కాళ్లరిగేలా తిరిగిన సుభద్రమ్మ సచివాలయాలు వచ్చిన తర్వాత పెద్దగా సమయం పట్టకుండానే ఎవరికీ డబ్బులు ఇవ్వాల్సిన దుస్థితి లేకుండానే చాలా వేగంగా తమకు కావాల్సిన పత్రాలు వస్తున్నాయని అంటున్నారు.
వైఎస్ జగన్ పాలన మొదలై మూడు సంవత్సరాలవుతోంది. ముప్పయికిపైగా పథకాలు ప్రజాదరణ పొందాయి. ప్రతి పథకానికి ఒక విశిష్టత వుంది. కేజీ నుంచి పీజీదాకా విద్యార్థులకు పథకాలున్నాయి. విద్య వైద్య వ్యవసాయ రంగాలకు చెందినవారితో పాటు బీసీ ఎఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలను ఆర్థిక కష్టాలనుంచి బైటపడేసి వారి అభివృద్ధికి బాటలు వేస్తున్నాయి. వీటిలో ఏ ఒక్క పథకం కూడా దుర్వినియోగం కాకుండా అర్హులకు మాత్రమే చేరాలనే తపనతో గ్రామవార్డు సచివాలయాలు నిరంతరం పని చేస్తున్నాయి.
ఈ మహాయజ్ఞంలో భాగం కావడం సంతోషంగా వుందని వాలంటీర్లు చెబుతున్నారు.
వాలంటీర్లు తమ పరిధిలోని కుటుంబాలను తమ కుటుంబాలుగా భావిస్తున్నారు. అంతే కాదు ఆయా కుటుంబాలు కూడా తమకు సంబంధించిన వాలంటీర్లను తమ కుటుంబ సభ్యులుగా బావించి ఆదరిస్తున్నాయి. ఇది ఈ మూడేళ్లలో సమాజంలో కనిపిస్తున్న మానవీయ బంధమని ఇక్కడ పని చేస్తున్న వాలంటీర్ నిమ్మల అరుణ అంటున్నారు.
సచివాలయంలో అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీగా పని చేసే సతీష్ గతంలో ఒక సాప్ట్‌వేర్ కంపెనీలో పని చేశారు. గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సెక్రటరీగా ఉద్యోగం సాధించాడు. ఉపాధ్యాయురాలిగా పని చేయాలని భావించిన ప్రియాంక మనసు మార్చుకొని గ్రామవార్డు సచివాలయ ఉద్యోగం సాధించారు ప్రభుత్వ సంకల్పం ప్రకారం పని చేస్తున్నామని సంతోషంగా వుందని ఈమె అంటున్నారు.
గ్రామవార్డు సచివాలయాల కారణంగా లక్షలాది మందికి ఉద్యోగాలు లభించడం ఒక మార్పు.. అంతే కాదు...రాష్ట్ర వ్యాప్తంగా వున్న వేలాది సచివాలయాలద్వారా ప్రజల ముంగిటకే పాలన వెళ్లిపోతోంది. గతంలో పలు సేవలకోసం సమయం, డబ్బు వృధా చేసుకున్నవారికి ఇప్పుడా సమస్యలు లేవు. పనులు తొందరగా, సులువుగా, కళ్ల ముందే అయిపోతున్నాయి. ప్రజలకు అంతకంటే కావాల్సిందేముంది.
Comments
Please login to add a commentAdd a comment