పల్నాడు జిల్లా యడ్లపాడు గురుకుల పాఠశాలలో ఘటన
37 మందినీ వెతికి పట్టుకొచ్చిన పోలీసులు
బాత్రూంలు కడిగిస్తున్నారని, సరిగా భోజనం పెట్టడం లేదంటున్న విద్యార్థులు
నాదెండ్ల: గురుకుల పాఠశాలలో తమను వేధింపులకు గురిచేస్తున్నారని, సరైన ఆహారం అందించకుండా హింసిస్తూ తమతో బాత్రూమ్‌లు కడిగిస్తున్నారని.. అదేమని అడిగితే చావబాదుతున్నారంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు విద్యార్థులు పాఠశాల గోడ దూకి సమీపంలోని కొండల్లోకి పారిపోయారు. సోమవారం జరిగిన ఈ సంఘటన పల్నాడు జిల్లాలో సంచలనం రేపింది. యడ్లపాడు మండలం వంకాయలపాడులోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో 6–10 తరగతుల్లో 450 మంది విద్యార్థులున్నారు. సోమవారం ఉదయం పాఠశాలలో ప్రార్థన జరుగుతుండగా 67 మంది గోడ దూకి బయటకు వెళ్లారు.
ఇది చూసి కొందరు ఉపాధ్యాయులు 30 మందిని వెనక్కి తేగా.. మరో 37 మంది సమీపంలోని కొండల్లోకి వెళ్లి దాక్కున్నారు. ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో వైరలైంది. దీంతో చిలకలూరిపేట రూరల్ సీఐ సుబ్బానాయుడు, ఎస్‌ఐ బాలకృష్ణ సిబ్బందితో కలిసి కొండల్లో విద్యార్థులను వెతికి పట్టుకున్నారు. పాఠశాలలో భోజనం బాగుండదని, తాగునీటి సౌకర్యం కూడా సరిగా లేదని, మెనూ ప్రకారం వడ్డించరని తెలిపారు. విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. తమ పాకెట్ మనీని ప్రిన్సి పాల్‌కు ఇస్తామని, సెలవుల్లో తాము ఇళ్లకు వెళ్లేట ప్పుడు అడిగినా ఆ డబ్బు ఇవ్వడం లేదని కన్నీటిపర్యంతమయ్యారు.
పాఠశాల ప్రారంభంలో త మకు ఫ్రీ సీట్లు వచ్చినా ఒక్కో విద్యార్థి వద్ద నుంచి రూ.4 వేలకు పైగా వసూలు చేశారని చె ప్పారు. పోలీసులు నచ్చజెప్పి తిరిగి పాఠశాలకు తీసుకెళ్లారు. అనంతరం నరసరావుపేట డీఎస్పీ నాగేశ్వరరావు, గురుకుల పాఠశాల జిల్లా కో–ఆరి్డనేటర్ పద్మజ, తహసీల్దార్ జయశ్రీలు పాఠశాలకు చేరుకున్నారు. విద్యార్థులతో ఏకాంతంగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రిన్సిపల్ హనుమంతరావు, వైస్ ప్రిన్సిపల్ కంచర్ల శిరీష్‌బాబు, ఉపాధ్యాయులతోనూ మాట్లాడారు. జిల్లా కోఆరి్డనేటర్ మాట్లాడుతూ ఈ పాఠశాలలో ఉపాధ్యాయుల మధ్య విభేదాలున్నాయని, దీంతో వారు విద్యార్థులను రెచ్చగొడుతున్నారని, వారి ప్రోద్బలంతోనే గోడదూకి పారిపోయారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment