సాక్షి, అమరావతి: శాసన సభ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని బుధవారం తెలుగుదేశం పార్టీ సభ్యులు పదేపదే అడ్డుకొన్నారు. ఎన్నిసార్లు చెప్పినా వారు వినకపోవడంతో స్పీకర్ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని వాయిదా వేశారు. సభ్యుల ప్రశ్నలన్నింటికీ సంబంధిత శాఖల మంత్రులు సమాధానం చెప్పినట్లుగానే భావించాలని సభాపతి కోరారు. సభలో పలువురు వైఎస్సార్‌సీపీ సభ్యుల ప్రశ్నలకు మంత్రుల సమాధానాలు ఇలా ఉన్నాయి..
రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు
రాష్ట్రంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యాన్ని కొంటున్నాం. ఇందుకోసం 7,000 వరి సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేశాం. వరి సేకరణలో 21,000 మంది నిమగ్నమై ఉన్నారు. రైతు క్షేత్రం నుంచి మిల్లు వరకు అన్ని రకాల వ్యయాలను ప్రభుత్వం భరిస్తోంది. ఇప్పటి వరకు 36,75,996 మెట్రిక్ టన్నుల వరి కొనుగోలు చేశాం. రైతులకు రూ.4,676.96 కోట్లు చెల్లించాం. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో పీడీఎస్ ఎన్‌ఫోర్స్‌మెంట్ తనిఖీల్లో 1.53 లక్షల క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నాం.
వైఎస్సార్ సున్నా వడ్డీ ద్వారా రూ.1,282.11 కోట్ల చెల్లింపులు
రాష్ట్రంలో బ్యాంకులు పంట రుణాలపై ఏడు శాతం వడ్డీని విధిస్తున్నాయి. ఇందులో రూ.లక్ష లోపు రుణం తీసుకొని సకాలంలో చెల్లించిన వారికి కేంద్రం 3 శాతం వడ్డీ సబ్సిడీగా ఇస్తుంటే, రాష్ట్రం వైఎస్సార్ సున్నా వడ్డీ కింద 4 శాతం సబ్సిడీ ఇస్తోంది. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 65,65,191 మంది రైతులకు రూ.1,282.11 కోట్లు చెల్లించాం.
రాష్ట్రంలో 6.16 లక్షల మంది నిరుద్యోగులు
రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించడానికి నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా వివిధ కోర్సుల్లో శిక్షణ ఇప్పిస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా 6,16,689 మంది నిరుద్యోగులు ఉండగా అందులో 4,22,055 మంది పురుషులు, 1,94,634 మంది మహిళలు ఉన్నారు.
కోవిడ్ చికిత్సకు రూ.2,893.41 కోట్లు
రాష్ట్రంలో కోవిడ్ వ్యాధిగ్రస్తుల చికిత్స కోసం రూ.2,893.41 కోట్లు వ్యయం చేశాం. వ్యాక్సిన్ కోసం రూ.85.79 కోట్లు ఖర్చు చేశాం.
ఓటీఎస్‌కు డిమాండ్
జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం (ఓటీఎస్) ద్వారా నివాసం ఉంటున్న వారికి ఇంటిపై పూర్తి హక్కులను ప్రభుత్వం కల్పిస్తోంది. ఈ పథకం కోసం ఇప్పటివరకు 9,86,966 దరఖాస్తులు రాగా 2022 మార్చి 2 నాటికి 4,47,713 మందికి యాజమాన్య హక్కులు ఇచ్చాం.
రూ.36,303.86 కోట్ల పెట్టుబడులు వచ్చాయి
పెట్టుబడులను ఆకర్షించడానికి ఔట్‌రీచ్ పేరిట పలు కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. వీటిద్వారా 2019 జూన్ నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో రూ.36,303.86 కోట్ల విలువైన పెట్టుబడులు వాస్తవరూపం దాల్చి, 91 మెగా ప్రాజెక్టులు ఉత్పత్తిని ప్రారంభించాయి. మరో 70మెగా ప్రాజెక్టులకు రూ.1,61,154.85 కోట్ల పెట్టుబడులు క్రియాశీలకంగా అమల్లో ఉన్నాయి. మరో రూ.41,434 కోట్ల పెట్టుబడులతో 31 ప్రాజెకులు ప్రారంభ దశలో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment