ఆరోగ్య రేఖ: ఏలూరు మండలంలో వైఎస్సార్ విలేజ్ క్లినిక్
►నాడు: ప్రభుత్వాస్పత్రి అంటే చిన్నచూపు.. ప్రజలకు ఏదైనా జబ్బు వస్తే పెద్దాసుపత్రికి వెళ్లాల్సిందే. పెద్ద రోగమొస్తే పేదలు ప్రాణాలపై ఆశ వదులుకోవాల్సిందే.. ఆపరేషన్ చేయించుకోవాలంటే అప్పు కోసం పరుగు తీయాల్సిన పరిస్థితి. ప్రభుత్వాస్పత్రికి వెళదామంటే గ్రామం నుంచి కిలోమీటర్ల మేర ప్రయాణించాలి. తీరా వెళ్లినా అక్కడ వైద్య సేవలు అందేవి కావు.
►నేడు: పేదలకు ఆరోగ్య భాగ్యాన్ని అందించేలా ప్రభుత్వం ఆరోగ్యశ్రీ అమలు చేస్తోంది. పల్లెల్లో డాక్టర్ వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్, పట్టణాల్లో అర్బన్ హెల్త్ క్లినిక్స్ ఏర్పాటుచేసి వైద్యాన్ని ప్రజలకు చేరువ చేసింది. ఆయా క్లినిక్స్‌లో 12 రకాల వైద్యసేవలు అందుతున్నాయి. ఆపరేషన్ అవసరమైతే ఆరోగ్యశ్రీ భరోసాగా నిలుస్తోంది. ఆపరేషన్ అనంతరం కూడా వైఎస్సార్ ఆరోగ్య ఆసరా ద్వారా ఆర్థిక సాయం అందుతోంది.
ఏలూరు టౌన్(ఏలూరు జిల్లా: రాష్ట్రంలో వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వాస్పత్రులు, పీహెచ్‌సీలను అభివృద్ధి చేయడంతో పాటు అధునాతన పరికరాలు, మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు వైద్య నిపుణులు, సిబ్బందిని నియమిస్తున్నారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని పటిష్టపర్చడంతో పాటు ఆరోగ్యశ్రీలో ఆపరేషన్ చేయించుకున్న వారికి వైఎస్సార్ ఆరోగ్య ఆసరా ద్వారా చేయూత అందిస్తున్నారు.
చదవండి: AP: నూతన మంత్రుల ప్రమాణ స్వీకారం.. సీఎస్ కీలక ఆదేశాలు
నాలుగు గదులతో.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రా లకు అనుబంధంగా ప్రతి గ్రామంలో డాక్టర్ వైఎ స్సార్ విలేజ్ క్లినిక్‌ను ప్రభుత్వం ఏర్పాటుచేస్తోంది. సమీప పీహెచ్‌సీ వైద్యుడి పర్యవేక్షణలో బీఎస్సీ నర్సింగ్ చదివిన నర్సింగ్ సిబ్బంది, ఒక ఏఎన్‌ఎం, సచివాలయం పరిధిలో ఆరోగ్య కార్యకర్త క్లినిక్‌లో అందుబాటులో ఉంటారు. ఇక్కడ అన్నిరకాల మందులు అందించేందుకు చర్యలు చేపట్టారు. విలేజ్ క్లినిక్‌లో వెయిటింగ్ రూమ్, ఓపీ రూమ్, కట్లు కట్టే గది, పరీక్షలకు మరో గదిని ఏర్పాటు చేస్తున్నారు.
ఏలూరు జిల్లాలో 60 పీహెచ్‌సీలు: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు 938 విలేజ్ క్లినిక్‌లు మంజూరయ్యాయి. వీటిలో ఏలూరు జిల్లాలో 375 ఉండగా కైకలూరు, నూజివీడు నియోజకవర్గాల్లోని 159తో కలిసి మొత్తం 534కు చేరాయి. ఉమ్మడి జిల్లాలో 152 విలేజ్ క్లినిక్‌ల భవన నిర్మాణాలు పూర్తయ్యాయి. ఉమ్మడి జిల్లాలో రూరల్ పీహెచ్‌సీలు 94 ఉండగా ఏలూరు జిల్లాలో 43, కైకలూరు, నూజివీడు నియోజకవర్గాల్లోని పీహెచ్‌సీలు 17తో కలిపి ఆ సంఖ్య 60కు చేరింది. ఉమ్మడి జిల్లాలో అర్బన్ పీహెచ్‌సీలు 34 ఉండగా, ఏలూరు జిల్లాకు 12, నూజివీడు, కైకలూరు నియోజకవర్గాల్లోని 2 పీహెచ్‌సీలతో కలిపి 14 ఉన్నాయి.
మెరుగైన సేవలు
గ్రామాల్లో పేదలకు నాణ్యమైన మెరుగైన సేవ లు అందించేందుకు ప్ర భుత్వం విలేజ్ క్లినిక్స్ ఏర్పాటుచేస్తోంది. కేంద్రాలకు భవనాల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇప్పటికే 104 సంచార వైద్యశాలలతో గ్రామాల్లో వైద్య పరీక్షలు చేయడంతో పాటు మందులు అందిస్తున్నాం. పీహెచ్‌సీలను బలోపేతం చేస్తున్నాం. విలేజ్, అర్బన్ క్లినిక్స్ తో వైద్య సేవలు మరింత విస్తృతంగా ప్రజలకు చేరువకానున్నాయి.
– డాక్టర్ బి.రవి, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి
Comments
Please login to add a commentAdd a comment