74 మంది బైండోవర్, ఐదుగురిపై రౌడీషీట్లు
నరసరావుపేట: పల్నాడు జిల్లాలో ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న హింసపై గురువారం సిట్ కేసుల్లో 13 మందితో పాటు పోలింగ్‌కు ముందు, ఆ తర్వాత జరిగిన సంఘటనలకు సంబంధించి నమోదైన కేసుల్లో 54 మందిని అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ మలికా గార్గ్ వెల్లడించారు. ఎన్నికల నేరాల్లో ఈ ఒక్క రోజే తొమ్మిది మందికి 41 సీఆర్‌పీసీ నోటీసులు ఇచ్చామన్నారు. నరసరావుపేట సబ్ డివిజన్‌లో ఒకరు, సత్తెనపల్లి సబ్ డివిజన్ లో 46 మంది, గురజాల సబ్ డివిజన్‌లో 27 మందితో కలిపి 74 మందిని బైండోవర్ చేశామన్నారు.
నరసరావుపేట సబ్ డివిజన్‌లో ఐదుగురిపై రౌడీషీట్స్ ఓపెన్ చేసి, ఎన్నికల సమయంలో ట్రబుల్ మాంగర్స్‌గా గుర్తించినట్లు ఎస్పీ గార్గ్ తెలిపారు. బైండోవర్ చేసిన వారిలో నిబంధనలు ఉల్లంఘించిన ఐదుగురిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చేందుకు నోటీసులు ఇచ్చారు. 102 సీఆర్‌పీసీ సెక్షన్‌లో ఒక వాహనాన్ని సీజ్ చేశామన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించేవారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.
పాల్వాయిగేటు ఎన్నికల సిబ్బందిపై వేటు
ఎన్నికల పోలింగ్ సందర్భంగా పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం రెంటచింతల మండలంలోని పాల్వాయి గేటు 202వ పోలింగ్ స్టేషన్లో చోటుచేసుకున్న పరిణామాలపై ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులపై వేటు పడింది. ప్రిసైడింగ్ ఆఫీసర్‌గా విధులు నిర్వహించిన సత్తెనపల్లి జీజేసీ జూనియర్ కాలేజ్ జూనియర్ లెక్చరర్ పీవీ సుబ్బారావు, పోలింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్‌గా విధులు నిర్వహించిన వెంకటాపురం జిల్లా పరిషత్ హైస్కూలు స్కూలు అసిస్టెంట్ షేక్ షహనాజ్ బేగంలను ఎన్నికల విధుల ఉల్లంఘన కారణంగా విధుల నుంచి తొలగిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి శ్రీకేష్ బి లత్కర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
ముగ్గురు ఉపాధ్యాయుల సస్పెన్షన్
దర్శి: ప్రకాశం జిల్లా దర్శిలో టీడీపీ వారికి ఓటు వేసేందుకు పోస్టల్ బ్యాలెట్‌కు రూ.5 వేలు లంచం తీసుకున్న కేసులో ముగ్గురు ఉపాధ్యాయులను కలెక్టర్ దినేష్‌కుమార్ సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన వారిలో గుత్తా నారాయణ, గోవిందు, అరుణకుమారి ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment