సాక్షి ప్రతినిధి, బాపట్ల: బాపట్ల జిల్లాలో భారీ సంఖ్యలో కొత్త ఓటర్ల నమోదు జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో ఓటేయడానికి నవతరం ఉత్సాహంగా ముందుకు వస్తోంది. ఈ జిల్లాలో ఇప్పటివరకు 61,193 ఓట్లను కొత్తగా చేర్చారు. వీటిలో యువతవే 80 శాతం ఉన్నట్లు సమాచారం. మరోపక్క ఇబ్బడిముబ్బడిగా ఉన్న దొంగ ఓట్లను అధికారులు తొలగిస్తున్నారు.
జిల్లావ్యాప్తంగా లక్షలాదిగా వచ్చిన ఫారం–6, ఫారం–7, 8లను ఎన్నికల అధికారులు వడపోసి, దొంగ ఓట్లను తొలగించి కొత్త ఓట్ల నమోదును చాలా వరకు పూర్తి చేశారు. ఇప్పటికే 46,116 అక్రమ ఓట్లను తొలగించారు. అన్నీ కలిపి మరో 600 దరఖాస్తులను పరిశీలించాల్సి ఉంది. వీటిలో కొత్త ఓట్లకు సంబంధించి 400 దరఖాస్తులు ఉన్నాయి. జనవరి 12వ తేదీ వరకు దరఖాస్తులను పరిశీలిస్తారు. జనవరి 22 నాటికి తుది జాబితా విడుదల చేస్తారు. ఇప్పటివరకు నమోదైన కొత్త ఓట్లలో అత్యధికంగా అద్దంకిలో 12,883 నమోదయ్యాయి. బాపట్లలో 9,967, రేపల్లెలో 9,961, చీరాలలో 9,958, పర్చూరులో 9,385, వేమూరులో 9,039 ఉన్నాయి.
ప్రలోభాలకు లొంగకుండా దొంగ ఓట్ల తొలగింపు
జిల్లాలో 65 వేలకు పైగా దొంగ ఓట్లు ఉన్నాయని, వాటిని తొలగించాలని పర్చూరు వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి ఆమంచి కృష్ణమోహన్, పలువురు అధికార పార్టీ నేతలు జిల్లా కలెక్టర్‌కు, రాష్ట్ర ఎన్నికల అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేశారు. దొంగ ఓట్లను గుర్తించి వాటిని తొలగించాలని 65 వేలకు పైగా ఫారం–7 దరఖాస్తులను సమర్పించారు.
ఇప్పటికే నియోజకవర్గాల వారీగా వచ్చిన ఫారం–7 దరఖాస్తులను అధికారులు సమగ్రంగా పరిశీలించి దొంగ ఓట్లను తొలగిస్తున్నారు. దీంతో తమ దొంగ ఓట్ల వ్యవహారం బయటపడుతుందని భావించిన పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అధికార పార్టీ దొంగ ఓట్లు చేర్పిస్తోందంటూ ఆరోపణలకు దిగారు. అధికారులకు పదేపదే ఫిర్యాదు చేశారు. కోర్టును ఆశ్రయించారు. జిల్లా అధికారులపై ఒత్తిళ్లు తెచ్చారు.
అయినా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అధికార యంత్రాంగం వేలాది ఫారం–7 దరఖాస్తులను నిశితంగా పరిశీలించి, క్షేత్రస్థాయిలో విచారణ జరిపింది. ఇప్పటివరకూ 46,116 దొంగ ఓట్లను గుర్తించి, తొలగించింది. వీటిలో అత్యధికంగా పర్చూరు నుంచి 10,468 ఓట్లను తొలగించారు. రేపల్లె పరిధిలో 8,880, చీరాల నుంచి 7,420, అద్దంకిలో 7,207, వేమూరులో 6,295, బాపట్ల నుంచి 5,846 ఓట్లను తొలగించారు. తొలగించిన ఓటర్లలో ఇతరప్రాంతాలకు వలస వెళ్లిన వారు, అక్కడే స్థిరపడిన వారు, చనిపోయిన వారు, రెండు చోట్లా ఓట్లు ఉన్నవారు ఉన్నారు.
ఓటు హక్కుతో ఆనందం
రాబోయే ఎన్నికల్లో తొలిసారి ఓటేసే ఆవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు వేస్తాను. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగను. మంచి ప్రజాప్రతినిధిని ఎన్నుకునేందుకు నా వంతు తోడ్పాటు అందిస్తాను. మంచి పాలన అందించేవారికి మద్దతుగా నిలవాలన్నది కోరిక. – పూరేటి సంధ్య, కొప్పెరపాడు, బల్లికురవ మండలం
ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నా
నాకు ఓటు హక్కు రావడం చాలా సంతోషంగా ఉంది. నేను ఫీజు రీయింబర్స్ మెంట్‌తో చదువుకున్నాను. పేద, మధ్యతరగతి వారికి అండగా నిలిచే ప్రభుత్వాలకు ప్రజల మద్దతు ఎప్పుడూ ఉంటుంది. రాబోయే ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నాను. –ఎం.సాయి పూజిత, బీటెక్ విద్యార్థి, బాపట్ల
ప్రజల కోసం పనిచేసే వారికే ఓటు
తొలిసారి ఓటుహక్కు రావడం ఆనందంగా ఉంది. పేదలకు అండగా నిలిచి ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వానికే రాబోయే ఎన్నికల్లో నా ఓటు. ఎవరి ప్రలోభాలకూ లొంగకుండా ఓటు వేస్తాను. అందరికీ మంచి జరగాలన్నదే నా కోరిక.
– పి. వెంకట నాగ మణికంఠ రెడ్డి, దుండివారిపాలెం, కర్లపాలెం మండలం
Comments
Please login to add a commentAdd a comment