కొమ్మాది (విశాఖ జిల్లా) : గీతం వైద్య కళాశాల ఆవరణలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు శుక్రవారం తెల్లవారుజామున స్వాధీనం చేసుకుని కంచె వేశారు. అందులో హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటుచేశారు. ఇక్కడ సర్వే నంబర్–17లో మొత్తం 14 ఎకరాల ప్రభుత్వ భూమిని గతంలో గుర్తించారు. అయితే, ఇందులో కళాశాలకు, ప్రభుత్వ స్థలానికి మధ్యనున్న 5.72 ఎకరాల స్థలంలో ఈ కంచెను ఏర్పాటుచేసినట్లు ఆర్డీవో భాస్కర్‌రెడ్డి తెలిపారు. వాస్తవానికి సర్వే నంబర్ 15, 20, 37, 38లో 40 ఎకరాలు ప్రభుత్వ స్థలం ఆక్రమణకు గురైనప్పటికీ అది ప్రస్తుతం కోర్టులో ఉందని తెలిపారు.
గతంలోనే మార్క్ చేశాం
ఇక కళాశాలకు ఆనుకుని ఉన్న 14 ఎకరాల ప్రభుత్వ భూమిని గతంలోనే స్వాధీనం చేసుకున్నామని.. అయితే, ఈ స్థలంలో గ్రీనరీ పెంచుతూ, ప్లే గ్రౌండ్‌గా తయారుచేశారని భాస్కర్‌రెడ్డి వివరించారు. అంతేకాక.. ప్రస్తుతం 14 ఎకరాలను గీతం యాజమాన్యం యథేచ్ఛగా ఉపయోగించుకుంటోందని, కలెక్టర్ మల్లికార్జున ఆదేశాల మేరకు ఇందులో 5.72 ఎకరాల స్థలానికి కంచె వేసినట్లు భాస్కర్‌రెడ్డి తెలిపారు. మిగిలిన స్థలానికి ప్రభుత్వ భూములు సరిహద్దుగా ఉండటంతో ఎలాంటి కంచెలు ఏర్పాటుచేయలేదని ఆయన చెప్పారు. ఈ స్థలంలో ఎటువంటి నిర్మాణాల్లేవని.. కానీ, త్వరితగతిన కంచె ఏర్పాటు పనులు పూర్తికావాలనే ఉద్దేశంతో తెల్లవారుజామున పనులు చేపట్టామని భాస్కర్‌రెడ్డి తెలిపారు. మొత్తం పదిచోట్ల ప్రభుత్వ హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేశామని ఆయన వివరించారు. కోర్టులో ఉన్నందున నిర్మాణాల జోలికి వెళ్లలేదని ఆర్డీవో స్పష్టంచేశారు. ఎటువంటి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో పోలీసు బందోబస్తు ఏర్పాటుచేసినట్లు ఆయన చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment