
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల రీ సర్వే కార్యక్రమం చురుగ్గా జరుగుతోంది. దాదాపు వెయ్యి గ్రామాల్లో ఇప్పటికే రీ సర్వే పూర్తయ్యింది. ఆ మేరకు నంబర్ 13 నోటిఫికేషన్లు కూడా జారీ చేశారు. మరో వెయ్యి గ్రామాల్లో అక్టోబర్ నాటికి రీ సర్వే పూర్తి చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అప్పటికి మొత్తంగా 2 వేల గ్రామాల్లో సర్వే పూర్తి చేసి.. కొత్త భూముల రికార్డులు తయారు చేయాలనే లక్ష్యంతో సిబ్బంది, అధికారులు పనిచేస్తున్నారు. మరోవైపు ఇప్పటివరకు 1,977 గ్రామాల్లో ఓఆర్‌ఐ(ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజెస్) జారీ ప్రక్రియను పూర్తి చేశారు.
డ్రోన్ల ద్వారా భూములను కొలిచి.. వాటి చిత్రాలు జారీ చేసిన తర్వాతే సర్వే బృందాలు తమ పని ప్రారంభిస్తాయి. ఆ తర్వాత రైతుల సమక్షంలో క్షేత్ర స్థాయి నిజనిర్థారణ చేస్తారు. ఇలా ఇప్పటివరకు 1,200 గ్రామాల్లో క్షేత్రస్థాయి నిజనిర్ధారణ కూడా పూర్తయ్యింది. సర్వే పూర్తయ్యాక భూ యజమానుల నుంచి వచ్చే అభ్యంతరాలను పరిష్కరించేందుకు కూడా వేగంగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం నియమించిన మొబైల్ మెజిస్ట్రేట్లు ఇప్పటివరకు 10,421 అభ్యంతరాలను సామరస్యంగా పరిష్కరించాయి. అలాగే రీ సర్వేను వేగంగా నిర్వహించేందుకు ఇటీవల ఏపీ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదారు పాస్‌బుక్ రూల్స్‌కు సవరణలు చేయాలని నిర్ణయించి ప్రాథమిక నోటిఫికేషన్ కూడా జారీ చేశారు.
రీసర్వే పూర్తయిన తర్వాత తయారు చేసే కొత్త రెవెన్యూ రికార్డుల రూపకల్పనలో ఈ సవరణలు ఉపయోగపడతాయని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. మరోవైపు మంత్రివర్గ ఉపసంఘం ప్రతి నెలా అప్పటివరకు జరిగిన సర్వేను సమీక్షించి అవసరమైన సూచనలిస్తోంది. సీఎం వైఎస్ జగన్ కూడా రీ సర్వే కార్యక్రమంపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ.. గడువు లోగా దాన్ని పూర్తి చేయించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో రీ సర్వే కోసం ప్రస్తుతం 21 డ్రోన్లు పనిచేస్తుండగా, సకాలంలో పనులు పూర్తి చేసేందుకు మరో 10 డ్రోన్లు సమకూర్చుకోనున్నట్లు సర్వే సెటిల్‌మెంట్ కమిషనర్ సిద్దార్థ జైన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment