
సాక్షి, అమరావతి: రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు చెల్లించాల్సిన కౌలు ఏటా 10 శాతం పెంచుతున్నట్టు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ప్రస్తుత (2022–23) ఆర్థిక సంవత్సరానికి గాను 24,739 మంది రైతుల ఖాతాల్లో రూ.184,99,37,974 నగదును జూన్, జూలై నెలల్లో జమచేయగా, మరో 1,304 మంది రైతుల ఖాతాల్లో సోమవారం రూ.7,84,14,562 జమచేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అమరావతి ప్రాంతంలో భూములిచ్చిన రైతులకు చెల్లించాల్సిన కౌలును వివాదాల్లో ఉన్న భూములకు మినహా, మిగతావాటికి ఏటా ఎలాంటి ఆలస్యం లేకుండా రైతుల ఖాతాల్లో జమచేస్తున్నామని చెప్పారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కౌలు చెల్లింపులకు రూ.208.10 కోట్లు కేటాయించగా.. ఇప్పటివరకు 26,043 మంది రైతులకు రూ.192,83,52,536 చెల్లించినట్లు తెలిపారు. రాజధాని భూ సమీకరణలో తీసుకున్న 34,400.15 ఎకరాల్లో 2,689.15 ఎకరాలు అసైన్డ్ భూములున్నట్లు చెప్పారు. అసైన్డ్ భూముల్లో 380.79 (కేటగిరీ–4, 6) ఎకరాలకు కౌలు చెల్లించే పరిస్థితి లేదన్నారు.
ఈ విభాగంలో మిగిలిన 2,308.36 ఎకరాలపై సీఐడీ విచారణ పూర్తయిన తర్వాత కౌలు మొత్తం చెల్లిస్తామని చెప్పారు. సివిల్ వివాదాల్లో ఉన్న మరో 455.04 ఎకరాలకు కూడా కేసులు ముగిశాక కౌలు చెల్లించనున్నట్టు తెలిపారు. 2015–16 నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం అమరావతి రైతులకు కౌలు రూపంలో రూ.1,344.93 కోట్లు చెల్లించినట్టు ఆయన చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment