ఎనర్జీ ఎఫిషియెంట్ సబ్‌మెర్సిబుల్ మోటారును తయారు చేసిన ‘ఏపీఎస్‌ఈఈడీసీఓ’
పంపుసెట్ అభివృద్ధిలో ఆంధ్రా వర్సిటీ సహకారం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వినూత్న ఇంధన సామర్ధ్య సాంకేతికతలను ప్రోత్సహించే లక్ష్యంతో, ఏపీ స్టేట్ ఎనర్జీ ఎఫిషియెన్సీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్‌ఈఈడీసీఓ) ముందడుగు వేసింది. ఇంటీరియర్ పర్మనెంట్ మాగ్నెట్ సింక్రోనస్ మోటర్ (ఐపీఎంఎస్‌ఎం) సాంకేతికతతో ఎనర్జీ ఎఫిషియెంట్ సబ్‌మెర్సిబుల్ మోటార్‌ను విజయవంతంగా తయారు చేసింది. దీని కోసం సబ్‌మెర్సిబుల్ వాటర్ పంపింగ్ అప్లికేషన్ల కోసం రూపొందించిన ఎలక్ట్రికల్ మోటార్ డ్రైవ్ సిస్టమ్ డిజైన్ ప్రోటోకాల్‌ను ఆంధ్రా విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసింది.
ఈ పరిశోధన ప్రాజెక్ట్‌లోని మోడల్ మోటార్‌ను ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ విద్యుత్ సౌధలో శుక్రవారం ఆవిష్కరించారు. వ్యవసాయ రంగంలో పంపుసెట్లు కీలకపాత్ర పోషిస్తాయని, ఐపీఎంఎస్‌ఎం మోటార్ల ద్వారా ఈ రంగంలో విద్యుత్‌ను ఆదా చేయవచ్చని ఆయన తెలిపారు. ఏపీ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ (ఏపీఎస్‌ఈసీఎం) ద్వారా బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) నిధులతో దాదాపు 20 వ్యవసాయ పంపుసెట్లలో ఐపీఎంఎస్‌ఎం సాంకేతికతను ప్రయోగాత్మకంగా అమలు చేయాలని ఏపీఈపీడీసీఎల్‌ను ఈ సందర్భంగా విజయానంద్ ఆదేశించారు.
ఆంధ్రా వర్సిటీ ప్రొఫెసర్ మల్లికార్జున్ రావు, ఏపీఎస్‌ఈఈడీసీఓ టెక్నికల్ హెడ్ శ్రీనివాసులుతో కలిసి మోటార్ పనితీరును ఏపీఎస్‌ఈసీఎం సీఈఓ కుమార రెడ్డి వివరించారు. ఐపీఎంఎస్‌ఎం మోటార్లు సంప్రదాయ ఎలక్ట్రిక్ మోటార్‌లకు ప్రత్యామ్నాయమని, ఇండక్షన్ మోటార్‌లతో పోల్చితే తక్కువ విద్యుత్ వినియోగం ఉంటుందని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ మోటార్లకు 80 శాతం సామర్థ్యం ఉండగా, ఐపీఎంఎస్‌ఎం అనేది 90 శాతం ఉందని వెల్లడించారు.
సంప్రదాయ మోటారు జీవిత కాలం సుమారు పదేళ్లుకాగా, అధిక గ్రేడ్ మెటీరియల్స్ కారణంగా ఐపీఎంఎస్‌ఎం మోటార్ సుమారు 18 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వరకూ పనిచేస్తుందని చెప్పారు. తక్కువ నిర్వహణ వ్యయం,30శాతం తక్కువ విద్యుత్ వినియోగం ఉంటుందని ఆయన వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment