ఏయూ వీసీ ప్రసాద్‌రెడ్డి నుంచి డాక్టరేట్ అందుకుంటున్న చంద్రవతి. పక్కన పడాల్
కొయ్యూరు (అల్లూరి సీతారామరాజు జిల్లా): ఆసక్తి, విషయ పరిజ్ఞానం, సాధించాలనే తపన ఉంటే దేనినైనా సాధించవచ్చని నిరూపించింది ఓ గిరిపుత్రిక. తల్లిదండ్రులు తనని చదివించలేని పరిస్థితుల్లో ఉన్నా, మొక్కవోని దృఢ సంకల్పంతో ఉన్నత చదువుల్లో ప్రతిభ చూపారు రాజేంద్రపాలేనికి చెందిన దిబ్బ చంద్రవతి. ఆమె తల్లిదండ్రులు దిబ్బ సుందర్రావు, సింగారమ్మ కూలీలు. చంద్రవతి పదో తరగతి మండలంలోని పెదమాకవరం పాఠశాలలోను, ఇంటర్ పాడేరు బాలికల గురుకుల జూనియర్ కళాశాలలో పూర్తి చేశారు. డిగ్రీ విశాఖలో చదివారు.
అనంతరం ఆంధ్రా యూనివర్సిటీలో రెండేళ్లు ఎంఫిల్ చేశారు. పీహెచ్‌డీలో భాగంగా ‘నాగ కేసరి చెట్ల నుంచి జీవ ఇంధన తయారీ’పై పరిశోధనకు శ్రీకారం చుట్టారు. యూనివర్సిటీ ఆచార్యులు ఎస్‌బీ పడాల్ పర్యవేక్షణలో పరిశోధన నిర్వహించారు. దీనిపై జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రచురణలు జరగడంతో ఆమెను డాక్టరేట్ వరించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అటవీ ప్రాంతంలో విలువైన ఔషధాలు ఉన్నాయని తెలిపారు.
ఆదిమజాతి గిరిజనులు వృక్షాలతో అన్యోన్యంగా ఉంటారని, వివిధ రకాల రోగాలకు వారి పరిసరాల్లో పెరిగే మొక్కలు, చెట్లను ఉపయోగిస్తారని చెప్పారు. అడవిలో పెరిగే నాగ కేసరి చెట్ల నుంచి సేకరించిన విత్తనాలను నూనెగా మార్చి జీవ ఇంధనంగా తయారు చేశామని ఆమె వివరించారు. తక్కువ ఖర్చుతో ఇంధనాన్ని తయారు చేయవచ్చునని తెలిపారు. పరిశోధన పూర్తి కావడంతో ఏయూ ఉప కులపతి పీవీజీడీ ప్రసాద్ రెడ్డి నుంచి ఈనెల తొమ్మిదిన డాక్టరేట్ అందుకున్నట్టు ఆమె తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment