గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ సంఘాల నాయకులతో సమీక్షిస్తున్న ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులందరూ ఎలాంటి నిరసనలు చేపట్టకుండా మంగళవారం నుంచి విధులకు హాజరు కావాలని గ్రామ, వార్డు సచివాలయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ చెప్పారు. సోమవారం వెలగపూడిలోని రాష్ట్ర తాత్కాలిక సచివాలయంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశమై, ప్రొబేషన్ ప్రకటన తదితర సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లడానికి చాలా దారులున్నాయి. మీరు ఇంకా 30 ఏళ్లు ఉద్యోగాలు చేయాలి. మొదట్లోనే ఇలా చేస్తే మీపై తప్పుడు భావనలు వెళతాయి.
మీరంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి మంచి అభిప్రాయం ఉంది. కానీ, ఈ మూడు రోజుల పరిణామాలు తప్పు దారిలో వెళ్తున్నాయి. ఎలాంటి వినతులు లేకుండా విధులకు హాజరుకాకపోవడం, అధికారిక గ్రూపుల నుంచి వైదొలగడం, రోడ్లపైకి వచ్చి స్లోగన్లు వంటివి ఉద్యోగులకు కుదరదు. మీరు ఆశిస్తున్నవి కొంతవరకైనా జరగాలంటే మంచి వాతావరణం తేవాలి. పరిస్థితులు చక్కబడితేనే మీరు చెప్పిన అంశాలు సీఎం దృష్టికి తీసుకెళ్లగలను. 13 లక్షల ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీపై 2018 నుంచి చర్చలు జరుగుతున్నాయి. వాళ్లు అన్నిసార్లూ చర్చలు, వినతుల ద్వారా డిమాండ్లు ప్రభుత్వం ముందుంచారు. మీరు మంచిగా అడిగితే సీఎం ఒకటికి రెండు చేసే అవకాశం ఉంటుంది. తలకు బులెట్ పెట్టి ఇవ్వాలని కోరితే ఇచ్చేది కూడా ఇవ్వరు’ అని స్పష్టం చేశారు.
అధికారులు అక్టోబరన్నా, సీఎం జూన్ కల్లా ఇవ్వాలన్నారు
గతంలో ప్రొబేషన్‌పై జరిగిన సమావేశంలో 60 వేల మంది ఉద్యోగులే డిపార్టమెంట్ పరీక్షలు పాసయ్యారని అధికారులు సీఎంకు చెప్పారు. ఈ ఏడాది అక్టోబరుకల్లా అందరికీ ఒకేసారి ప్రొబేషన్ డిక్లేర్ చేద్దామని సూచించారు. కానీ, ముఖ్యమంత్రి జూన్ 30వ తేదీ ప్రొబేషన్ ప్రకటనకు చివరి తేదీ కావాలని చెప్పారు. ఉద్యోగులు మంచిగా అడిగితే ఇంకా ముందే వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరూ అడగకుండా ఒకేసారి 1.34 లక్షల మందికి ఉద్యోగాలిచ్చిన ముఖ్యమంత్రి.. మంచి విధానంలో అడిగితే మీ మాట వినే అవకాశం ఎందుకు ఉండదు? అందరికీ ఒకే రోజు సీఎం గారి చేతుల మీదుగా ప్రొబేషన్ డిక్లేర్ చేయాలని అనుకున్నారు. అది అర్ధం చేసుకోకుండా తప్పు దారిలో వెళితే చట్ట ప్రకారం చర్యలకు అవకాశం ఉంది. ప్రభుత్వం ఆ ఉద్దేశంతో లేదు. ఆ పరిస్థితులు మీరు తెచ్చుకోకూడదు. ఎవరన్నా మీకు ప్రొబేషన్ ప్రకటించరంటే నమ్మకండి. ఈ సీఎం ఉండగా మీ ప్రొబేషన్‌ని ఎవరూ ఆపలేరు. కాకపోతే ఇలాంటివి చేసుకొని మీకు మీరే ప్రొబేషన్‌ను ఆపుకొనే అవకాశం ఉంటుంది’ అని చెప్పారు.
ఇందుకే ప్రొబేషన్
ఐఏఎస్ అధికారిగా 30 ఏళ్ల సర్వీసులో ఏ ముఖ్యమంత్రికి నేరుగా మెసేజ్ చేయలేదని, కానీ, కొందరు సచివాలయ ఉద్యోగులు సోషల్ మీడియా ద్వారా నేరుగా మేసేజ్‌లు పంపారని జైన్ తప్పుపట్టారు. తాము ఏ సమాచారాన్నయినా సీఎంవో అధికారులు, సీఎస్ ద్వారా సీఎంకు చేరవేస్తామన్నారు. ఇలాంటి సర్వీసు రూల్స్‌పై అవగాహన కలిగించి, విధుల్లో శిక్షణ ఇవ్వడానికి ప్రొబేషన్ ఉంటుందని చెప్పారు.
77 వేల మంది విధులకు హాజరు
రాష్ట్రవ్యాప్తంగా సోమవారం ఉదయం నిర్ణీత సమయానికే 55,515 మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు విధులకు హాజరయ్యారని ఆ శాఖ ప్రధాన కార్యాలయం వర్గాలు తెలిపాయి. సాయంత్రానికి మొత్తం 77,409 మంది విధుల్లో పాల్గొన్నట్టు వెల్లడించాయి.
సీఎం జగన్‌పై మాకు నమ్మకం ఉంది: అంజన్‌రెడ్డి
ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పూర్తి న్యాయం చేస్తారన్న నమ్మకం ఉందని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రతి నిధి అంజన్‌రెడ్డి చెప్పారు. అజయ్‌జైన్‌తో భేటీ అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగుల ఆందోళన వెనుక కొన్ని శక్తులు ఉన్నాయన్న అనుమానాలు వ్యక్తం చేశారు. ఉద్యోగులు వాటి జోలికి పోకుండా వెంటనే విధుల్లో చేరాలని కోరారు.
ఎవరికీ నష్టం జరగదు: జానీ పాషా
ప్రొబేషన్ విషయంలో సచివాలయ ఉద్యోగులెవరికీ ఎలాంటి నష్టం జరగదని అజయ్‌జైన్ హామీ ఇచ్చారని ఉద్యోగుల మరో ప్రతినిధి జానీ పాషా చెప్పారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యోగులెవరూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు, అందోళనలు చేయవద్దని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment