సాక్షి, అమరావతి: రుషికొండపై రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న నిర్మాణాల వ్యవహారాలన్నీ కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ (ఎంవోఈఎఫ్)కు అప్పగిస్తామని హైకోర్టు ప్రతిపాదించింది. ఈ కొండపై నిర్మాణాల నిమిత్తం చేసిన తవ్వకాలపై సర్వే చేసేందుకు హైకోర్టు ఆదేశాల మేరకు ఎంవోఈఎఫ్ ఇప్పటికే ఓ కమిటీని ఏర్పాటు చేసిన నేపథ్యంలో నిర్మాణాల్లో ఉల్లంఘనల వ్యవహారాన్ని కూడా ఆ శాఖే చూడటం సబబని తెలిపింది.
నిర్మాణాల్లో కొన్ని ఉల్లంఘనలు ఉన్నట్లు ఆ కమిటీ తేల్చిందని, అవి చిన్నవేనా లేక తీవ్రమైనవా అన్న విషయాలను ఆ శాఖే తేలిస్తే బాగుంటుందని తెలిపింది. ఈ ప్రతిపాదనలపై స్పందన తెలియజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి, జస్టిస్ రావు రఘునందన్‌రావు ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
విశాఖలోని రుషికొండపై తవ్వకాలు, నిర్మాణాలపై జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్, విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ వేర్వేరుగా దాఖలు చేసిన వ్యాజ్యాలపై ఏసీజే ధర్మాసనం విచారణ జరిపింది. రుషికొండపై పనుల్లో ఉల్లంఘనలు ఉన్నట్లు ఎంవోఈఎఫ్ కమిటీ తేల్చినందున, నిర్మాణాలు కొనసాగించకుండా ఆదేశాలు జారీ చేయాలని మూర్తి యాదవ్ తరఫు సీనియర్ న్యాయవాది కేఎస్ మూర్తి కోరారు.
దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. ఈ మొత్తం వ్యవహారాన్ని ఎంవోఈఎఫ్‌కు అప్పగిస్తామని ప్రతిపాదించింది. దీనిపై ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) చింతల సుమన్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. పిటిషనర్ల అభ్యర్థన మేరకే ఎంవోఈఎఫ్ కమిటీని ఏర్పాటు చేసిందని, ఈ కమిటీ క్షేత్రస్థాయిలో సర్వే చేసి నిర్మాణాల్లో ఉల్లంఘనలు లేవని నివేదిక ఇచ్చిందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.
నివేదికను పరిశీలిస్తే పూర్తి వివరాలు అర్థమవుతాయన్నారు. ఈ వ్యవహారాన్ని ఎంవోఈఎఫ్‌కు పంపడం వల్ల జాప్యం తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. ఒకవేళ ఎంవోఈఎఫ్‌కు పంపాలనుకుంటే పిటిషనర్లు వారి వ్యాజ్యాలను ఉపసంహరించుకోవాలన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment