విపత్తులోనూ జిత్తులే.. | All Are Shocked Over Chandrababu and TDP leaders | Sakshi
Sakshi News home page

విపత్తులోనూ జిత్తులే..

Published Sat, May 8 2021 2:44 AM | Last Updated on Sat, May 8 2021 2:14 PM

All Are Shocked Over Chandrababu and TDP leaders - Sakshi

సాక్షి, అమరావతి: ఇది మునుపెన్నడూ చూడని విపత్కర పరిస్థితి! ప్రపంచమంతా ఈ సంక్షోభాన్ని ఎదుర్కోక తప్పలేదు. దేశంలోనూ ఊహించని పరిస్థితులు నెలకొన్నాయి. విరుచుకుపడుతున్న కరోనా సెకండ్‌ వేవ్‌ను తట్టుకునేందుకు రాష్ట్రాలన్నీ సర్వ శక్తులూ ఒడ్డుతున్నాయి. ఇలాంటి సమయంలో వైరస్‌ను కట్టడి చేసేందుకు సమష్టిగా పోరాడకుండా పరస్పరం నిందించుకుంటే మన దేశం బలహీనం అవుతుందనేది ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్దేశం.

తాజాగా జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌కు శుక్రవారం ట్విట్టర్‌ ద్వారా ఆయన చేసిన వినతి కూడా ఈ కోవలోనే ఉంది. ప్రజల ప్రాణాలే మిన్నగా భావించి విమర్శలను పక్కనపెట్టి కరోనాపై సమర్థంగా యుద్ధం చేద్దామని కోరారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో విభేదాలను విస్మరించి జాతి మొత్తం ఏకతాటిపై నిలిచి పోరాడాలని విజ్ఞప్తి చేయడం సీఎం జగన్‌ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తోందని దేశవ్యాప్తంగా వైద్య ఆరోగ్య రంగ నిపుణులు, రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు.

కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఫోన్‌ ద్వారా ప్రధాని మోదీ గురువారం చర్చించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. మరోవైపు ప్రతిపక్ష నేత చంద్రబాబు మాత్రం ప్రజలను రెచ్చగొట్టడం, ఆందోళనకు గురి చేయడం, ప్రభుత్వాన్ని నిందించడమే లక్ష్యంగా దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పచ్చి అబద్ధాలు వల్లిస్తూ వాటిని నిజాలుగా మభ్యపుచ్చేందుకు తన సన్నిహిత మీడియా ద్వారా చేస్తున్న ఆయన ప్రయత్నాలపై ఎవరికైనా జుగుప్స కలగక మానదు. వాస్తవాలు కావని స్పష్టంగా కనిపిస్తున్నా ఎలాగైనా ప్రజల్లో అలజడి రేకెత్తించేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాల పట్ల తీవ్రంగా మండిపడుతున్నారు. 

కొత్త వైరస్‌ అంటూ విష ప్రచారం..
కేంద్ర ప్రభుత్వం టీకాలు పంపినప్పటికీ కమీషన్ల కోసమే ప్రజలకు వ్యాక్సిన్లు ఇవ్వడం లేదని పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తూ టీడీపీ అధినేత వికృతానందం పొందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం టీకాలు కొనుగోలు చేయడం లేదంటూ నీచమైన ఆరోపణలకు దిగారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు ఎన్ని టీకాలు కొనుగోలు చేయాలనేది కేంద్ర ప్రభుత్వమే నిర్దేశిస్తోంది. వ్యాక్సిన్లే కాకుండా ఆక్సిజన్, రెమిడెసివర్‌ ఇంజక్షన్ల కోటాను కూడా కేంద్ర ప్రభుత్వమే నిర్ణయిస్తోంది. వీటిని కేంద్ర ప్రభుత్వం తన ఆధీనంలో ఉంచుకుని రాష్ట్రాల అవసరాలు, ఉత్పత్తికి అనుగుణంగా పంపిణీ చేస్తోంది. ఉన్నంత మేరకు సర్దుబాటు చేస్తూ వస్తోంది.

ఇవన్నీ వాస్తవాలని తెలిసినా మరుగున పరుస్తూ చంద్రబాబు దుష్ప్రచారానికి తెగించారు. అంతేకాదు ఆంధ్రప్రదేశ్‌ అంటేనే ఒక భూతం మాదిరిగా చిత్రీకరిస్తూ పక్క రాష్ట్రాల్లో ఆందోళన రేకెత్తించేలా మరో కుట్రకు తెరతీశారు. ఏపీలో కొత్త వేరియంట్‌ వైరస్‌ ఒకటి పుట్టుకొచ్చిందంటూ తప్పుడు ప్రచారానికి దిగారు. నిజానికి అది గతేడాది దక్షిణాది రాష్ట్రాల్లో కనిపించిన వైరస్‌ అని, అసలు ఏపీ వేరియంట్‌ అనే ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని సీసీఎంబీ డైర్టెక్టర్‌ సైతం తాజాగా అధికారికంగా స్పష్టంగా చెప్పారు. 

ఎన్‌ 440 వేరియంట్‌ కొత్తది కాదు పాతదే..
– చంద్రబాబు, టీడీపీ నేతలు: 
ఏపీలో కొత్తగా ఎన్‌–440 అనే కరోనా వేరియంట్‌ వేగంగా వ్యాపిస్తోంది. ఇతర వేరియంట్ల కంటే అది పది రెట్లు అధికంగా ప్రభావం చూపుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

– వాస్తవం: 
ఎన్‌–440 అనే కరోనా వేరియంట్‌ను జూలై 2020లోనే గుర్తించాం. ఇది కొత్తదేమీ కాదు.. ఈ వేరియంట్‌ వల్ల కొత్త కేసులు వస్తున్నాయనడంలో ఏమాత్రం వాస్తవం లేదని సీసీఎంబీ(సెంటర్‌ ఫర్‌ సెల్యూలార్‌ మాలిక్యులార్‌ బయాలజీ) డైరెక్టర్‌ రాకేశ్‌ మిశ్రా స్పష్టం చేశారు.

ఒక్క రోజులో ఆరు లక్షల మందికి టీకా...
– చంద్రబాబు, టీడీపీ నేతలు: 
రాష్ట్రంలో కరోనా కట్టడికి వ్యాక్సినేషన్‌ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. వ్యాక్సిన్ల కొనుగోలు కోసం  ఉత్పత్తి సంస్థలకు ఆర్డర్లు ఇవ్వడం లేదు. వ్యాక్సినేషన్‌ వేయకపోవడం వల్ల కరోనా విజృంభిస్తోంది.

– వాస్తవం..: 
దేశంలో ప్రస్తుతం నెలకు ఏడు కోట్ల డోసుల వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యం మాత్రమే ఉంది. సీరం సంస్థ  కోవిషీల్ట్‌ వ్యాక్సిన్‌ నెలకు ఆరు కోట్ల డోసు.. భారత్‌ బయోటెక్‌ సంస్థ కోవాగ్జిన్‌ను నెలకు కోటి డోసులు మాత్రమే ఉత్పత్తి చేస్తున్నాయి. ఈ సంస్థలు ఉత్పత్తి చేస్తున్న వ్యాక్సిన్లపై కేంద్ర ప్రభుత్వానికే నియంత్రణ ఉంది. నిర్దేశించిన కోటా మేరకు ఉత్పత్తి సంస్థల నుంచి రాష్ట్రాలే కొనుగోలు చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో 3.4 లక్షల కోవాగ్జిన్‌ డోసులు, 9.9 లక్షల డోసుల కోవిషీల్డ్‌ కేటాయించామని.. వాటిని కొనుగోలు చేయాలని ఏప్రిల్‌ 29న నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ అదనపు సంచాలకులు వికాష్‌ షీల్‌ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అశోక్‌ సింఘాల్‌కు లేఖ రాశారు. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం వ్యాక్సిన్ల కొనుగోలుకు ఆర్డర్లు ఇచ్చింది. అయితే అవసరమైన మేరకు కాకుండా..  కేటాయించిన మేరకు మాత్రమే  వ్యాక్సిన్‌ డోసులను కొనుగోలు చేయడానికి రాష్ట్రాలకు కేంద్రం అవకాశం ఇచ్చింది. టీకా ఉత్సవ్‌లో భాగంగా ఏపీలో 45 నుంచి 60 ఏళ్ల వయసు వారికి 1,400 కేంద్రాల్లో ఏప్రిల్‌ 14న ఒక్క రోజులోనే ఆరు లక్షల మందికి కోవిడ్‌ టీకాలు ఇవ్వడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రికార్డు సృష్టించింది. వ్యాక్సినేషన్‌పై రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇదే తార్కాణం. 

మూడు గంటల్లో బెడ్‌ కేటాయింపు..
– చంద్రబాబు, టీడీపీ నేతలు: 
కరోనా బారిన పడిన ప్రజలు తల్లడిల్లుతుంటే ప్రభుత్వం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది. చికిత్స అందించకపోవడం వల్ల పిట్టల్లా రాలిపోతున్నారు. ఆసుపత్రుల్లో బెడ్‌లను కూడా కేటాయించడం లేదు.

– వాస్తవం: 
కరోనా బాధిత రోగులు 104కి ఫోన్‌ చేసిన వెంటనే 108 అంబులెన్స్‌ పంపి ఆసుపత్రికి తరలించి బెడ్‌ కేటాయించే ప్రక్రియ మొత్తం మూడు గంటల్లోగా పూర్తి చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 558 ఆసుపత్రుల్లో కరోనాకు చికిత్స అందిస్తోంది. ఈ ఆసుపత్రుల్లో 44,599 బెడ్స్‌ ఉన్నాయి. ఇందులో ఆక్సిజన్‌ సౌకర్యం ఉన్న బెడ్‌ల సంఖ్య 26,446. వీటికి అదనంగా 26,362 ఆక్సిజన్‌ సౌకర్యం ఉన్న బెడ్స్‌ను యుద్ధప్రాతిపదికన సిద్ధం చేశారు. అన్ని ప్రైవేట్‌ ఆసుపత్రులను కరోనా చికిత్స అందించే ఆసుపత్రులుగా గుర్తించి వాటిల్లో 50 శాతం బెడ్స్‌ను ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వారికి కేటాయించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆక్సిజన్‌ కొరత తలెత్తకుండా తక్షణం చర్యలు చేపట్టింది. మెరుగైన చికిత్స అందించడం ద్వారా ప్రజల ప్రాణాలను రక్షిస్తోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement