సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఏటీసీ టైర్స్ డైరెక్టర్ తోషియో ఫుజివారా, కంపెనీలు ప్రతినిధులు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ ప్లాంట్ ప్రారంభోత్సవానికి హాజరుకావాల్సిందిగా ముఖ్యమంత్రిని కోరారు. విశాఖపట్నం అచ్యుతాపురం వద్ద ఏపీఐఐసీ కేటాయించిన భూమిలో ఏటీసీ టైర్స్ ఏపీ ప్రైవేట్ లిమిటెడ్ నూతన ప్లాంట్‌ను ఏర్పాటుచేసింది. ఆగస్టులో ఈ ప్లాంట్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఏటీసీ టైర్స్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి సీఎం వైఎస్ జగన్‌ను కంపెనీ డైరెక్టర్, ప్రతినిధులు ఆహ్వానించారు. ప్లాంట్ నిర్మాణం, ఉత్పత్తులు, ఉద్యోగాలకు సంబంధించి సీఎం వైఎస్ జగన్‌కు వివరించారు.
ఏటీసీ – ది యోకోహామా రబ్బర్ కో. లిమిటెడ్, జపాన్‌కు పూర్తిగా అనుబంధ సంస్థ. ఏటీసీ, ఏటీసీ అనుబంధ కంపెనీలు సంయుక్తంగా అలయెన్స్ టైర్ గ్రూప్ (ఏటీజీ)గా ఏర్పడ్డాయి. ఆఫ్ హైవే టైర్ల (ఓహెచ్‌టీ) వ్యాపారంలో ప్రపంచంలో ఏటీజీ ప్రముఖంగా పేరొందింది. 6 ఖండాల్లోని 120 దేశాలలో ఏటీజీ వ్యాపారాలు కొనసాగుతున్నాయి. ఏటీసీ భారతదేశంలో రెండు తయారీ ప్లాంట్లను కలిగి ఉంది. ఇందులో ఒకటి తిరునెల్వేలి (తమిళనాడు), మరొకటి దహేజ్ (గుజరాత్).
అచ్యుతాపురం వద్ద రూ. 1,750 కోట్లతో ప్లాంట్ ఏర్పాటు, ప్రారంభంలో రోజుకు 135 మెట్రిక్ టన్నుల ప్రొడక్షన్ కెపాసిటీ, 2 వేల మందికి ఉద్యోగావకాశాలు. pic.twitter.com/RfxfRdFJPw
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) June 24, 2022
చదవండి: (ఏపీ కేబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం)
విశాఖపట్నం అచ్యుతాపురం వద్ద రూ. 1,750 కోట్లతో ఈ సంస్థ ప్లాంట్ ఏర్పాటు చేసింది. ప్రారంభంలో రోజుకు 135 మెట్రిక్ టన్నుల ప్రొడక్షన్ కెపాసిటీ, 2 వేల మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. అచ్యుతాపురం ప్లాంట్‌లో చిన్న టైర్లు (ఏఎఫ్‌సీ సెగ్మెంట్), పెద్ద బయాస్ టైర్లు (అగ్రి మరియు కాన్స్), రేడియల్ టైర్లు (అగ్రి), రేడియల్ (ఓటీఆర్), బయాస్ టైర్, ఓటీఆర్ టైర్లు, ఫారెస్ట్రీ టైర్లు, సాలిడ్ టైర్లు వంటి ఉత్పత్తులు జరుగనున్నాయి.
ఈ సమావేశంలో పరిశ్రమలు, పెట్టుబడులు, వాణిజ్యశాఖ మంత్రి గుడివాడ అమరనాథ్, ఏటీసీ టైర్స్ ఏపీ ప్రైవేట్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్స్ ప్రహ్లాద్ రెడ్డి, అంబరీష్ ఆర్ షిండే, పీఆర్ హెడ్ వైవీ. కృష్ణంరాజు, పరిశ్రమల శాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవన్, పరిశ్రమల శాఖ డైరెక్టర్ సృజన గుమ్మళ్ళ, సీఎంవో అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment