స్పిల్ వే వద్ద విలేకర్లతో మాట్లాడుతున్న మంత్రి అంబటి రాంబాబు
పోలవరం రూరల్: దివంగత వైఎస్సార్ చేపట్టిన పోలవరం ప్రాజెక్టును ఆయన తనయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పూర్తి చేసి జాతికి అంకితం చేస్తారని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు చెప్పారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు కళ్లార్పకుండా అసత్యాలు వల్లిస్తున్నారని మండిపడ్డారు. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు, అప్రోచ్ ఛానల్, పైలెట్ ఛానల్, స్పిల్ ఛానల్, స్పిల్‌వేని పూర్తి చేయకుండా, నీళ్లు మళ్లించకుండా డయాఫ్రమ్ వాల్‌ను నిర్మించడం చంద్రబాబు చేసిన చారిత్రక తప్పిదమన్నా రు. నిర్మాణంలో జాప్యానికి చంద్రబాబు నిర్వాకాలే కారణమన్నారు.
ఈ కారణంగానే 2019, 2020 వరదలకు డయాఫ్రమ్‌వాల్ దెబ్బతిందన్నారు. ప్రాజెక్టులు, వ్యవసాయంపై చిత్తశుద్ధి లేని చంద్రబాబు ఎన్నికల భయంతో పర్యటనలు తలపెట్టారని విమర్శించారు. పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, ఈఎన్‌సీ నారాయణరెడ్డి, సీఈ సుధాకర్‌బాబులతో కలిసి పనుల పురోగతిని పరిశీలించారు. స్పిల్‌వే, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ ప్రాంతాల్లో పర్యటించారు. ఎవరి హయాంలో ఎప్పుడెలా పనులు జరిగాయో నాడు–నేడు ఫొటో ఎగ్జిబిషన్ ద్వారా వివరించారు. పోలవరం పనులు ఎక్కడా ఆగలేదని మంత్రి అంబటి స్పష్టం చేశారు.
దెబ్బతిన్న డయాఫ్రమ్‌వాల్ ప్రాంతంలో ఇసుక నింపి జెట్ గ్రౌటింగ్ పనులు చేపట్టామన్నారు. గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన స్పిల్‌వే, స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానల్, గేట్లు, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లను తాము పూర్తి చేశామన్నారు. తాము పూర్తి చేసిన స్పిల్‌వేపై నడుస్తూ చంద్రబాబు నిస్సిగ్గుగా అబద్ధాలా డుతున్నారని దుయ్యబట్టారు. టీడీపీ సర్కారు ప్రాజెక్టు నిర్మాణంపై దృష్టి పెట్టకుండా బస్సు యాత్రలు, భజనలకే ప్రాధాన్యం ఇచ్చిందని వ్యాఖ్యానించారు.
ఈ ప్రశ్నలకు జవాబివ్వు బాబూ..
తాను అడిగే మూడు ప్రశ్నలకు జవాబు చెప్పాలని చంద్రబాబుకు అంబటి సవాల్ విసిరారు. ‘జాతీయ ప్రాజెక్టు పోలవరానికి పూర్తి నిధులు కేంద్రమే కేటాయించి పూర్తి చేయాలని విభజన చట్టంలో ఉన్నా నాడు ప్రధాని మోదీ, గడ్కరీ కాళ్లు పట్టుకుని పనులు ఎందుకు దక్కించుకున్నారు? 2013–14 ధరల ప్రకారం పూర్తి చేస్తానంటూ ఎందుకు ఒప్పుకున్నారు? 2018కి ప్రాజెక్టును పూర్తిచేసి అప్పగిస్తానని శాసనసభలో చెప్పిన మాటను ఎందుకు నిలబెట్టుకోలేదు?’ అని అంబటి ప్రశ్నించారు. చంద్రబాబు చేసిన తప్పిదాలన్నీ ఒక్కొక్కటిగా సరిదిద్దుతూ సీఎం జగన్ ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తున్నట్లు చెప్పారు.
ఇప్పటి వరకు 50 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిన సందర్భాలు లేవన్నారు. 1986లో 36 లక్షల క్యూసెక్కుల వరద మాత్రమే వచ్చిందన్నారు. ఎత్తు తగ్గిస్తున్నారంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు. డ్యామ్ సేఫ్టీ నిబంధనల ప్రకారం దశలవారీగా మూడు దశల్లో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేస్తారన్నారు. ఎస్‌ఈ నరసింహమూర్తి, అడ్వైజర్ గిరిధర్‌రెడ్డి, ఎంపీపీ సుంకర వెంకటరెడ్డి, జెడ్పీటీసీ కలుం హేమకుమారి, వైఎస్సార్‌సీపీ మండల అ«ధ్యక్షుడు మురళీకృష్ణ, తహసీల్దార్ బి.సుమతి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment