‘బదిలీలు చేశారు... నియామకాలేవి?’ ‘మళ్ళీ కేంద్ర సర్వీసుకు ప్రవీణ్ ప్రకాశ్’ ‘సచివాలయ భవనం... అసంపూర్ణం‘ ‘రాత్రికి రాత్రే హోటల్ స్వాధీనం’, ‘కిడ్నాప్ చేసి చావ బాదారు’ ‘టిడ్కో ఇళ్ళ వద్ద 144 సెక్షన్’... ఇలా రకరకాల శీర్షికలతో పూర్తి అబద్ధాలను వండి వార్చిందంటూ ‘ఈనాడు’ పత్రికపై వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు. సోమవారం జాతీయ పత్రికా స్వేచ్ఛా దినోత్సవమని... పైపెచ్చు రామోజీరావు పుట్టినరోజు కూడా అని ఈ సందర్భంగా అబద్ధాల్ని మాత్రమే ప్రచురించాలన్న నియమం పెట్టుకున్న తీరులో ఇలాంటి కథనాలు వండి వార్చటమేంటని నిలదీశారు. ఈ కథనాల్లోని నిజానిజాల్ని వివరిస్తూ ఆయన రామోజీరావుకు ఓ బహిరంగ లేఖ రాసి మీడియాకు విడుదల చేశారు. నిత్యం ఉషోదయంతో పాటే అబద్ధాల్ని అచ్చువేస్తూ జనం మనసుల్లో విషం నాటుతోందంటూ ‘ఈనాడు’ను ఎండగట్టారు.
సాక్షి, అమరావతి: జాతీయ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం, తన పుట్టిన రోజు నాడు రామోజీరావు ఈనాడు దినపత్రికలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంపై ఆరు అసత్య కథనాలను ప్రచురించారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు. ఒకే రోజు మొదటి పేజీలో అన్ని అబద్ధాలను ప్రచురించిన తరువాత నిత్యం ఉషోదయాన ఈనాడులో సత్యాలు నినదిస్తున్నాయా? అసత్యాలు నినదిస్తున్నాయా? అని రామోజీ అంతరాత్మను ప్రశ్నించుకోవాలని సూచించారు. ఈమేరకు ‘ఈనాడు’లో ఈ నెల 16వ తేదీన వెలువడ్డ వార్తలపై వాస్తవాలను ప్రజలకు తెలియచేస్తూ అంబటి సోమవారం సుదీర్ఘ బహిరంగ లేఖ రాశారు. ఆ వివరాలివీ..
ఏమిటి? ఎందుకు? ఎప్పుడు? ఎలా? ఎవరు?
‘బదిలీలు చేశారు... నియామకాలేవి? శీర్షికతో మీరు వండి వార్చిన వార్తలో జర్నలిజంలో మౌలికమైన అంశాన్ని వదిలేశారు. 84 జూనియర్ కళాశాలలను ఏ ప్రభుత్వం మంజూరు చేసింది? ఎప్పుడు మంజూరు చేసింది? ఎవరు చేశారు? పార్ట్ టైం అధ్యాపకుల నియామకం ఎందుకు అవసరమైంది? బదిలీలు ఎందుకు చేశారు? అనే ప్రశ్నలకు సమాధానాలు లేకుండా పతాక శీర్షికన ఎందుకు ప్రచురించారు? నిజానికి ఎన్నికల ముందు ఈ 84 జూనియర్ కాలేజీలను మీ మిత్రుడు చంద్రబాబునాయుడు దిగి పోతూ పద్ధతి లేకుండా మంజూరు చేయడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని రాయటానికి మీ కలానికి మనసు ఎందుకు రాలేదు? లెక్చరర్ పోస్టులకు ఫైనాన్స్ అనుమతులు, బడ్జెట్ లేకుండా కాలేజీలు ఎలా మంజూరు చేశారు? పార్ట్‌టైం విధానంలో ఎలా నియమించారు? చంద్రబాబు చేసిన తప్పును సరిదిద్దుతున్న ప్రభుత్వం మీద రాళ్లు వేసేందుకు ఎందుకింత ఆరాటం?
అబద్ధంపై అబద్ధం..
‘మళ్లీ కేంద్ర సర్వీసుకు ప్రవీణ్ ప్రకాష్’ అన్నది మరో వార్తా కథనం. అలాగని ఆయన మీతో చెప్పారా? ఇదే అబద్ధం అయితే దానికి కొనసాగింపుగా ‘ముఖ్యమంత్రి సుముఖంగా స్పందించారని’ మరో అబద్ధాన్ని రాశారు. ఇలాంటి చీప్ ట్రిక్స్ ఎందుకు?
మీ సున్నిత హృదయానికి బాబు బకాయిలు పట్టవా?
‘సచివాలయ భవనం... అసంపూర్ణం’ అంటూ ప్రజాస్వామ్య దేవాలయాలపై మరో వార్తా కథనాన్ని అచ్చు వేయించారు. రాష్ట్రవ్యాప్తంగా పది వేలకు పైగా గ్రామ సచివాలయాలు, 10 వేలకు పైగా రైతు భరోసా కేంద్రాలు, 8,500కి పైగా ఆరోగ్య కేంద్రాల నిర్మాణాలతో కలిపి మొత్తంగా దాదాపు 30 వేల నిర్మాణాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వటమే కాకుండా ఇప్పటికే దాదాపు రూ.3,088 కోట్లు వెచ్చించింది. ఇందులో కేవలం రూ.180 కోట్ల మేర బకాయిలు, అది కూడా వారం రోజుల నాటివి ఉంటే ‘అసంపూర్ణం’ అని శీర్షిక పెట్టడాన్ని జర్నలిజం అంటారా? వీటి గురించి ఇంత బాధపడుతున్న మీ సున్నిత హృదయం చంద్రబాబు సర్కారు పెండింగ్‌లో పెట్టిన రూ.వేల కోట్ల బకాయిల గురించి ఒక్క వార్త కూడా రాయకపోవడం ఈనాడు పత్రికా విలువల సరళికి నిదర్శనం.
చంద్రబాబు సర్కారు ఉచిత విద్యుత్తుకు ఎగ్గొట్టిన రూ.8655 కోట్ల బకాయిలు, ధాన్యం సేకరణ బకాయిలు రూ.960 కోట్లు, విత్తనాల సబ్సిడీ బకాయిలు రూ.384 కోట్లు, రైతులకు వడ్డీ లేని రుణాల కింద చెల్లించకుండా ఎగ్టొట్టిన రూ.1,046 కోట్లు... ఇవన్నీ ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వమే చెల్లించింది.
కిడ్నాప్ కథ ఎవరి కోసం?
కిడ్నాప్ చేసి చావ బాదారనేది మరో అసత్య కథనం. సరస్వతీ పవర్ అన్నది రామోజీ ఫిల్మ్ సిటీ మాదిరిగానే ప్రైవేట్ భూములను కొనుగోలు చేసిన సంస్థ. ఫిల్మ్‌సిటీలో భూములు ఖాళీగా ఉన్నాయి కాబట్టి వాటిని అమ్మిన రైతులు దున్నుకుంటామంటే రామోజీ అంగీకరిస్తారా? ఓ రైతును ఎవరో అర్ధరాత్రి బావా అని పిలిచి కొట్టారని రాశారు. ఎవరు పిలిచారో తెలియకుండానే రైతు వెళ్లారా? అక్కడ వైఎస్సార్ సీపీకి ఓటర్లే లేనట్లు ఆయన ఓటు కోసం పార్టీని మారమన్నారా? రూ.7,500 విలువైన మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్నాడని అరెస్ట్ చేస్తే దానికి చక్కటి కథ అల్లారు.
దర్జాగా వెళ్లకుండా ఆక్రమించాలా?
టిడ్కో ఇళ్లపై టీడీపీ, సీపీఐ దుష్ప్రచారానికి ఈనాడు వంత పాడింది. టీడీపీని, ముఖ్యమంత్రి పదవిని, ట్రస్టును ఎన్టీఆర్ నుంచి బలవంతంగా లాక్కుని కబ్జా చేసిన చంద్రబాబును సమర్ధించే మీరు సొంతింటి యజమానులు తమ ఇళ్లలోకి దర్జాగా వెళ్లకుండా ఆక్రమించాలన్న పద్ధతిలో వార్తలు ప్రచురించడం ఈనాడు సంస్కృతిని ప్రతిబింబిస్తోంది. చంద్రబాబు టిడ్కోకు రూ.3,200 కోట్ల మేర బకాయిలు పెట్టి దిగిపోయారని అందరికీ తెలుసు. టిడ్కో ఇళ్ల లబ్ధిదారులు చంద్రబాబు స్కీం ప్రకారం రూ.3 లక్షలు కట్టి చక్రవడ్డీలు చెల్లిస్తూ ఇల్లు తీసుకుంటారా? లేక సీఎం జగన్ స్కీం ప్రకారం ఉచితంగా, ఇప్పుడే పట్టా వచ్చే ఇల్లు ఉచితంగా కోరుకుంటారా? ఏది కావాలో బ్యాలెట్ పెడదామా?
చౌక బేరాల చరిత్రలో రికార్డు..
‘రాత్రికి రాత్రే హోటల్ స్వాధీనం’ అంటూ విశాఖలో ఫ్యూజన్ ఫుడ్స్ అనే సంస్థకు చంద్రబాబు పప్పు బెల్లాల కోసం ఇచ్చిన లీజును రద్దు చేయడం అన్యాయం అన్నట్లు వార్త రాశారు. ఆ హోటల్ ఏటా చెల్లించే లీజు ఎంత? ఆ స్థలం విశాఖలో ఎలాంటి కమర్షియల్ ఏరియాలో ఉంది? అనే ప్రశ్నలకు సమాధానం చెబితే మీ కథనంలో గాలి పోతుంది. ఆ సంస్థ ఏటా చెల్లించే లీజు రూ.30 వేలు. అంటే నెలకు రూ.2,500 మాత్రమే. వాట్టే డీల్!.. చౌక బేరాల చరిత్రలో ఇదో రికార్డు.
Comments
Please login to add a commentAdd a comment