12.5 అడుగుల అంబేడ్కర్ నమూనా విగ్రహాన్ని పరిశీలిస్తున్న మంత్రులు విశ్వరూప్, సురేష్, వెలంపల్లి, ఎమ్మెల్యే విష్ణు, కలెక్టర్ నివాస్
సాక్షి ప్రతినిధి, విజయవాడ: విజయవాడ స్వరాజ్ మైదానంలో బీఆర్ అంబేడ్కర్ కాంస్య విగ్రహం, స్మృతివనం పనులు శరవేగంగా జరుగుతున్నాయని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. ఈ ప్రాజెక్టు పనులను సోమవారం మంత్రుల కమిటీ సభ్యులు పినిపే విశ్వరూప్, ఆదిమూలపు సురేష్, వెలంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే మల్లాది విష్ణులు పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం మీడియాతో విశ్వరూప్ మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు పనులను పరిశీలించామన్నారు.
2023 ఏప్రిల్ 14న అంబేడ్కర్ జన్మదినం నాటికి విగ్రహాన్ని ప్రారంభించేలా పనులు వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారన్నారు. నిధులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా గ్రీన్ ఛానల్‌లో పెట్టామని.. రూ.268 కోట్ల బడ్జెట్‌లో ఇప్పటికే రూ.100 కోట్లు విడుదల చేశామన్నారు. తొలుత 12.5 అడుగుల నమూనా విగ్రహాన్ని రూపొందించామని.. దీనిని ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజలు పరిశీలించాక వారి సూచనలు, సలహాలను పరిగణలోకి తీసుకుని 125 అడుగుల తుది కాంస్య విగ్రహాన్ని ఏర్పాటుచేస్తామన్నారు.
ఈ పనుల పర్యవేక్షణకు జిల్లా కలెక్టర్ నివాస్ తీసుకుంటున్న చొరవను మంత్రి విశ్వరూప్ ప్రశంసించారు. ఆదిమూలపు సురేష్, వెలంపల్లి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి హామీ మేరకు నగర నడిబొడ్డున విజయవాడకు తలమానికంగా నిలిచేలా ఈ భారీ అంబేడ్కర్ విగ్రహాన్ని, స్మృతివనాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. దీనిని చారిత్రక ప్రదేశంగా రూపొందిస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment