swaraj maidan
-
ఏప్రిల్ 14కు అంబేడ్కర్ విగ్రహ నిర్మాణం పూర్తి
సాక్షి, అమరావతి: విజయవాడ స్వరాజ్ మైదానంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 125 అడుగుల విగ్రహ నిర్మాణ పనులు ఏప్రిల్ 14కు పూర్తయ్యేలా చర్యలు చేపట్టామని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున చెప్పారు. ఈ విగ్రహ నిర్మాణ పనుల్ని గురువారం మంత్రులు నాగార్జున, ఆదిమూలపు సురేష్ పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నాగార్జున మాట్లాడుతూ గత ప్రభుత్వం అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని చెప్పి ఐదేళ్లు కాలయాపన చేసిందని విమర్శించారు. చేతల మనిషిగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటుచేసి చూపిస్తున్నారన్నారు. దేశచరిత్రలో నిలిచిపోయేలా విజయవాడ నడిబొడ్డున అంబేడ్కర్ విగ్రహ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తిచేసేందుకు సీఎం వైఎస్ జగన్ కృతనిశ్చయంతో ఉన్నారని చెప్పారు. అంబేడ్కర్ విగ్రహానికి సంబంధించిన బూట్లు వచ్చాయని, మిగిలిన భాగాలు దశలవారీగా వస్తాయని ఆయన తెలిపారు. పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ రాజకీయ పార్టీలు పోలీసులు సూచించిన ప్రాంతాల్లో కాకుండా ఇరుకుసందుల్లోను, ఇబ్బందికరమైన రోడ్లపైన ఇష్టానుసారం సభలు జరపడంతో నిండుప్రాణాలు బలిగొన్న ఘటనలు ఆందోళన కలిగించాయని చెప్పారు. ప్రతిపక్షంలోను ప్రచారయావను ఆపుకోలేక 11 నిండుప్రాణాలు పోవడానికి చంద్రబాబు నిర్వహించిన సభలే కారణమని చెప్పారు. -
శరవేగంగా అంబేడ్కర్ స్మృతి వనం
సాక్షి ప్రతినిధి, విజయవాడ: విజయవాడ స్వరాజ్ మైదానంలో బీఆర్ అంబేడ్కర్ కాంస్య విగ్రహం, స్మృతివనం పనులు శరవేగంగా జరుగుతున్నాయని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. ఈ ప్రాజెక్టు పనులను సోమవారం మంత్రుల కమిటీ సభ్యులు పినిపే విశ్వరూప్, ఆదిమూలపు సురేష్, వెలంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే మల్లాది విష్ణులు పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం మీడియాతో విశ్వరూప్ మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు పనులను పరిశీలించామన్నారు. 2023 ఏప్రిల్ 14న అంబేడ్కర్ జన్మదినం నాటికి విగ్రహాన్ని ప్రారంభించేలా పనులు వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారన్నారు. నిధులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా గ్రీన్ ఛానల్లో పెట్టామని.. రూ.268 కోట్ల బడ్జెట్లో ఇప్పటికే రూ.100 కోట్లు విడుదల చేశామన్నారు. తొలుత 12.5 అడుగుల నమూనా విగ్రహాన్ని రూపొందించామని.. దీనిని ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజలు పరిశీలించాక వారి సూచనలు, సలహాలను పరిగణలోకి తీసుకుని 125 అడుగుల తుది కాంస్య విగ్రహాన్ని ఏర్పాటుచేస్తామన్నారు. ఈ పనుల పర్యవేక్షణకు జిల్లా కలెక్టర్ నివాస్ తీసుకుంటున్న చొరవను మంత్రి విశ్వరూప్ ప్రశంసించారు. ఆదిమూలపు సురేష్, వెలంపల్లి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి హామీ మేరకు నగర నడిబొడ్డున విజయవాడకు తలమానికంగా నిలిచేలా ఈ భారీ అంబేడ్కర్ విగ్రహాన్ని, స్మృతివనాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. దీనిని చారిత్రక ప్రదేశంగా రూపొందిస్తున్నామన్నారు. -
అంబేడ్కర్ స్మృతివనం పనులకు శ్రీకారం
సాక్షి ప్రతినిధి, విజయవాడ: నగరంలో ఏర్పాటుచేయనున్న భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 125 అడుగుల కాంస్య విగ్రహం, స్మృతివనం పనులు ఊపందుకుంటున్నాయి. ఈ పనులు చేసేందుకు వీలుగా ఇక్కడి స్వరాజ్ మైదాన్‌లో ఉన్న 42 కట్టడాలను తొలగించగా ఆ భూమిని జిల్లా కలెక్టర్ జె. నివాస్ సాంఘిక సంక్షేమ శాఖకు ఇప్పటికే అప్పజెప్పారు. 18 ఎకరాల విస్తీర్ణంలో రూ.249 కోట్లతో ఇక్కడ అంబేడ్కర్ స్మృతివనం ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం విదితమే. ఈ పనుల నిర్వహణ బాధ్యతను కేపీసీ ప్రాజెక్టŠస్ లిమిటెడ్ సంస్థ దక్కించుకుంది. పనుల పర్యవేక్షణకు నోడల్ ఏజెన్సీగా సాంఘిక సంక్షేమ శాఖ, కార్యనిర్వహణ ఏజెన్సీగా ఏపీఐఐసీ వ్యవహరిస్తున్నాయి. ఇక్కడ 125 అడుగుల అంబేడ్కర్ కాంస్య విగ్రహంతోపాటు స్మృతి వనం నిర్మించనున్నారు. ఇందులో మెమోరియల్ పార్కు, అధ్యయన కేంద్ర నిర్మాణంతోపాటు, 2వేల మంది కూర్చునేందుకు వీలుగా కన్వెన్షన్ సెంటర్, 500 మందికి సరిపడా ఓపెన్ ఎయిర్ థియేటర్, 100 మంది సామర్థ్యంగల కన్వెన్షన్ మెడిటేషన్ హాల్ నిర్మంచనున్నారు. అలాగే గ్రీనరీని ఏర్పాటుచేస్తారు. ఇప్పటికే ఇక్కడున్న భవనాలను తొలగించడంతోపాటు, పనులు దక్కించుకున్న కాంట్రాక్టు సంస్థ ఆ ప్రాంతాన్ని చదును చేస్తోంది. 2023 మార్చికల్లా సిద్ధం ఇక అంబేడ్కర్ 12 అడుగుల కాంస్య విగ్రహం నమూనా తయారీ పనులూ ప్రారంభమయ్యాయి. హైలెవల్ కమిటీ దీనిని పరిశీలించి ఈనెల 18కల్లా ఆమోదం తెలుపుతుంది. ఆ తరువాత 25 అడుగుల నమూనా పనులు 19న ప్రారంభమై, మార్చి 10 నాటికి పూర్తిచేస్తారు. మార్చి 15లోపు ఈ నమూనాకు కమిటీ అనుమతి ఇవ్వాల్సింటుంది. మార్చి 16 నుంచి 2023 మార్చి నాటికి అంటే మొత్తం 402 రోజులకు అంబేద్కర్ విగ్రహంపూర్తిగా ముస్తాబవుతుంది. అన్ని పనులు పూర్తిచేసుకుని మార్చి 31, 2023 నాటికి విగ్రహాన్ని ఏర్పాటుచేసే విధంగా కాల పరిమితిని నిర్ణయించారు. దీంతో పాటు మిగిలిన భవనాల నిర్మాణం పనులూ అదే సమయానికి పూర్తిచేయాలని నిర్ణయించారు. పనులు వేగవంతం.. అంబేడ్కర్ 125 అడుగుల కాంస్య విగ్రహం, స్మృతి వనం పనులు వేగవంతమయ్యాయి. స్వరాజ్ మైదాన్ ప్రాంతంలో ఉన్న నిర్మాణాలను తొలగించి, స్థలాన్ని కాంట్రాక్టు సంస్థకు అప్పగించాం. స్థలాన్ని చదును చేయడంతోపాటు, కాంస్య విగ్రహ నమూనా పనులు ప్రారంభమయ్యాయి. నిర్మాణ పనుల ప్రగతిపై ఏపీఐఐసీ అధికారులతో ఇటీవలే సమీక్షించాం. పనులు నిర్ధిష్ట కాల వ్యవధిలో పూర్తిచేయాలని ఆదేశించాం. – జె. నివాస్, జిల్లా కలెక్టర్, కృష్ణా -
అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటుపై మంత్రుల కమిటీ సమీక్ష
సాక్షి, అమరావతి: విజయవాడలోని స్వరాజ్ మైదానంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అంబేడ్కర్ 125 అడుగుల విగ్రహం ఏర్పాటు పనులను వేగవంతం చేయాలని మంత్రుల కమిటీ ఆదేశించింది. తాడేపల్లిలోని ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో సోమవారం మంత్రుల కమిటీ సమావేశమైంది. సాంఘిక సంక్షేమ, ఆర్థిక, ప్రణాళిక, పరిశ్రమల శాఖల అధికారులతోపాటు నిర్మాణ సంస్థ ప్రతినిధులతో నిర్వహించిన ఈ సమావేశంలో పలు అంశాలపై కమిటీ చర్చించింది. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌ను పరిశీలించిన మంత్రులు పినిపే విశ్వరూప్, ఆదిమూలపు సురేష్ పలు సూచనలు చేశారు. స్వరాజ్ మైదానంలో మిగిలిన వాటిని ఖాళీ చేయించి పూర్తిస్థాయిలో స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో 2023 ఏప్రిల్ 23 నాటికి అంబేడ్కర్ 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రులు సూచించారు. పనుల పురోగతిపై మరో సమావేశాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో నిర్వహించి సమస్యలుంటే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రులు తెలిపారు. సమావేశంలో సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ కె.హర్షవర్ధన్, కలెక్టర్ జె.నివాస్, జూమ్ ద్వారా పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, ప్రణాళిక విభాగం కార్యదర్శి విజయకుమార్ పలు అంశాలపై మంత్రుల కమిటీతో చర్చించారు. -
పుస్తకం కంటే విశ్వసనీయ స్నేహితుడు లేడు
సాక్షి, అమరావతి/వన్‌టౌన్ (విజయవాడ పశ్చిమ): పుస్తకం కంటే విశ్వసనీయ స్నేహితుడు లేడని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. విజయవాడ స్వరాజ్ మైదానంలో ఏర్పాటు చేసిన 32వ పుస్తక మహోత్సవాన్ని శనివారం వెబినార్ విధానంలో గవర్నర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతీయ భాషల నుంచి ఎంపిక చేసిన రచనలను తెలుగులోకి అనువదించడం ద్వారా ఇక్కడి పాఠకులకు ఆయా భాషల సాహిత్యాన్ని పరిచయం చేయాలన్నారు. దీనివల్ల దేశంలోని ఇతర ప్రాంతాల సంస్కృతి, చరిత్రపై జ్ఞానం సుసంపన్నం అవుతుందన్నారు. దక్షిణ భారతదేశంలో ఏటా జరిగే అతిపెద్ద పుస్తక మహోత్సవాల్లో ఒకటిగా విజయవాడ పుస్తక మహోత్సవం గుర్తింపు పొందటం ముదావహమన్నారు. పుస్తకం మనల్ని విజ్ఞానం, వినోదం, కొత్త ఆలోచనా ప్రక్రియల ప్రపంచంలోకి తీసుకువెళుతుందని, ఒక పుస్తకం నిజమైన స్నేహితుడిగా ఉంటూ పాఠకుడి నుంచి ఏవిధమైన ప్రతిఫలం ఆశించదన్నారు. ఒక రచయితగా, పుస్తక ప్రేమికుడిగా తనకున్న అనుభవంతో ఈ విషయం చెబుతున్నానని, చిన్న వయసులోనే పిల్లల్లో పుస్తక పఠనం అలవాటు చేయాలని గవర్నర్ సూచించారు. గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా, దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఎమెస్కో అధ్యక్షుడు విజయ్‌కుమార్, పుస్తక మహోత్సవ కో–ఆర్డినేటర్ మనోహర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. నిరాడంబరంగా నూతన సంవత్సర వేడుక ఏపీ రాజ్‌భవన్‌లో నూతన సంవత్సర వేడుకలను శనివారం నిరాడంబరంగా నిర్వహించారు. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ దంపతులను పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. రాజ్‌భవన్ రూపొందించిన 2022 క్యాలండర్‌ను ప్రత్యేక ప్రధాన కా>ర్యదర్శి ఆర్పీ సిసోడియా, ఇతర అధికారుల సమక్షంలో గవర్నర్ ఆవిష్కరించారు. ముఖ్య ఎన్నికల కమిషనర్ విజయానంద్ సిబ్బందితో వచ్చి గవర్నర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. దేవదాయ శాఖ కార్యదర్శి వాణీమోహన్ నేతృత్వంలో టీటీడీ పండితులు గవర్నర్ దంపతులను ఆశీర్వదించి శ్రీవారి ప్రసాదాన్ని అందించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ, డీజీపీ డి.గౌతం సవాంగ్, నగర పోలీసు కమిషనర్ కాంతిరాణా టాటా, ముఖ్య సమాచార కమిషనర్ రమేష్‌కుమార్, కమిషనర్లు రవికుమార్, రమణకుమార్, జనార్ధనరావు, ఐలాపురం రాజా, శ్రీనివాసరావు, హరిప్రసాదరెడ్డి, చెన్నారెడ్డి, బీసీ సంక్షేమ శాఖ సంచాలకుడు అర్జునరావు తదితరులు గవర్నర్‌ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో రాజ్‌భవన్ సంయుక్త కార్యదర్శి శ్యామ్ ప్రసాద్ పాల్గొన్నారు. -
అంబేడ్కర్ విగ్రహ నిర్మాణానికి టెండర్లు
సాక్షి, అమరావతి: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌కు గౌరవ సూచకంగా విజయవాడ నడిబొడ్డున స్వరాజ్‌మైదాన్ (పీడబ్ల్యూడీ గ్రౌండ్)లో 125 అడుగుల డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావ్ రామ్‌జీ విగ్రహం ఏర్పాటుకు ఈపీసీ విధానంలో ఏపీఐఐసీ టెండర్లు పిలిచింది. ఈ విగ్రహ నిర్మాణ వ్యయాన్ని రూ.180 కోట్లుగా అంచనా వేశారు. మొత్తం 30,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు. కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థ 14 నెలల్లో విగ్రహ నిర్మాణం పూర్తి చేయాలి. టెండర్ డాక్యుమెంట్లు శుక్రవారం రాత్రి నుంచి అందుబాటులో ఉంచినట్లు ఏపీఐఐసీ అధికారులు తెలిపారు. మే 7వ తేదీ మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు బిడ్లు దాఖలు చేయడానికి అనుమతిస్తారు. టెండర్ దక్కించుకున్న సంస్థ 90 రోజుల్లో పనులు ప్రారంభించాల్సి ఉంటుంది. 249 కోట్లతో పార్కు అభివృద్ధి స్వరాజ్ మైదాన్‌లో సుమారు 20 ఎకారల విస్తీర్ణంలో డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావ్ రామ్‌జీ అండ్ డెవలప్మెంట్ పార్కును రూ.248.71 కోట్లతో అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. విగ్రహం కింద భాగంలో జీ+1 తరహాలో 2,000 మంది కూర్చోవడానికి వీలుండే విధంగా కన్వెన్షన్ సెంటర్, ధ్యాన మందిరం నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు పనులకు జ్యుడిషియల్ ప్రివ్యూ ఆమోదం లభించడంతో ఏపీఐఐసీ విగ్రహ నిర్మాణానికి టెండర్లు పిలిచింది. -
దీర్ఘకాలం నాణ్యంగా ఉండాలి
సాక్షి, అమరావతి: విజయవాడ స్వరాజ్ మైదాన్‌లో అంబేడ్కర్ స్మృతివనంలో ఏర్పాటు చేసే విగ్రహాన్ని దీర్ఘకాలం నాణ్యంగా ఉండేలా రూపొందించాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. స్ట్రక్చర్‌లో మెరుపు, కళ తగ్గకుండా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. విజయవాడ స్వరాజ్ మైదాన్‌లో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటుపై సీఎం జగన్ మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు భారీ అంబేడ్కర్ కాంస్య విగ్రహం, స్మృతివనానికి సంబంధించిన రెండు రకాల ప్లాన్లను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సీఎంకు చూపించారు. క్యాంపు కార్యాలయంలో సమీక్షిస్తున్న సీఎం వైఎస్ జగన్ నాగపూర్‌లోని అంబేడ్కర్ దీక్ష భూమి, ముంబైలోని చైత్యభూమి, లఖ్‌నవూలోని అంబేడ్కర్ మెమోరియల్, నోయిడాలోని ప్రేరణాస్థల్‌లను ఆయనకు చూపారు. గ్యాలరీ, ఆడిటోరియం ఎలా ఉంటుందన్న దానిపైనా ప్రజెంటేషన్ ఇచ్చారు. అంబేడ్కర్ కాంస్య విగ్రహం తయారీకి 14 నెలలు పడుతుందని, ఈ నేపథ్యంలో విగ్రహం, స్మృతివనం పనులను డిసెంబర్లో మొదలుపెట్టి 14 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. 2022 ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతి రోజున విగ్రహావిష్కరణ, స్మృతివనం ప్రారంభించాలని నిర్ణయించారు. స్మృతివనం వద్ద కన్వెన్షన్ సెంటర్, పబ్లిక్ గార్డెన్, ధ్యాన స్థూపం, బౌద్ధ శిల్పాల ఏర్పాటుతోపాటు రెస్టారెంట్, లాబీ, ధ్యాన కేంద్రం, చి్రల్డన్ ప్లే ఏరియా, వాకర్స్ ట్రాక్, ఫౌంటెయిన్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా సీఎం అధికారులకు పలు సూచనలు చేశారు. ‘‘ల్యాండ్‌స్కేప్‌లో గ్రీనరీ బాగా ఉండాలి. అది ఏమాత్రం చెడిపోకుండా చూడాలి. అంబేడ్కర్ స్మృతివనం వద్ద లైబ్రరీ, మ్యూజియం, గ్యాలరీ ఏర్పాటుతోపాటు ఆయన జీవిత విశేషాలు ప్రదర్శించాలి. అలాగే అంబేడ్కర్ సూక్తులను కూడా ప్రదర్శించాలి. పార్కు వద్ద రహదారిని విస్తరించి, ఫుట్‌పాత్‌ను అభివృద్ధి చేయాలి. రెండింటినీ ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలి’’ అని సీఎం ఆదేశించారు. సమీక్షలో మంత్రి మేకపాటి, సీఎస్ నీలం సాహ్ని, అధికారులు పాల్గొన్నారు. -
ఆకర్షణీయంగా అంబేడ్కర్ విగ్రహం
సాక్షి, అమరావతి: బీఆర్ అంబేడ్కర్ విగ్రహం విజిబిలిటీ (స్పష్టంగా కనిపించడం) ముఖ్యమని, ఎక్కడి నుంచి చూసినా విగ్రహం స్పష్టంగా కనిపించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. విజయవాడ స్వరాజ్ మైదాన్‌లో 125 అడుగుల బి.ఆర్.అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు, పార్క్ అభివృద్ధి మాస్టర్ ప్లాన్‌పై మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. సమీక్ష వివరాలు ఇలా ఉన్నాయి. ► విగ్రహం చక్కగా ఉండటంతో పాటు అక్కడ నిర్మించే ల్యాండ్ స్కేప్ (పార్కు) పూర్తి ఆహ్లాదకరంగా ఉండాలి. విగ్రహం ఎక్కడ ఏర్పాటు చేస్తే గ్రాండ్ లుక్ వస్తుందన్న దానిపై దృష్టి పెట్టండి. గ్రౌండ్లో బెస్ట్ లొకేషన్ ఎక్కడో ఫైనలైజ్ చేయండి. ► అక్కడ ఒక కన్వెన్షన్ హాల్ కూడా ఏర్పాటు చేస్తే అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. కన్వెన్షన్ సెంటర్, ఫుడ్ కోర్టు మాత్రమే కమర్షియల్‌గా ఉండాలి. వీటిపై వచ్చే ఆదాయం పార్క్ నిర్వహణకు ఉపయోగపడుతుంది. ► అక్కడ వీలైనంత వరకు కాంక్రీట్ నిర్మాణాలు తగ్గించాలి. మంచి వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలి. పనులు ప్రారంభించేలోగా ఆ స్థలంలో ఉన్న ఇరిగేషన్, ఇతర ప్రభుత్వ కార్యాలయాలన్నీ తరలించాలి. ఎంజీ రోడ్ నుంచి పార్క్ కనెక్టివిటీ కూడా అందంగా తీర్చిదిద్దాలి. మొత్తం మీద అక్కడంతా ఆహ్లాదకర వాతావరణం కనిపించాలి. ► ఈ సందర్భంగా వివిధ సంస్థల ప్రతినిధులు పలు నమూనాలు ప్రదర్శించారు. విగ్రహంతో పాటు, పార్కు నిర్మాణానికి సంబంధించి వారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ► ఈ సమీక్షలో మంత్రులు బొత్స సత్యనారాయణ, పినిపే విశ్వరూప్, ఆదిమూలపు సురేష్, వెలంపల్లి శ్రీనివాసరావు, కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, మునిసిపల్, ఇరిగేషన్, ఆర్థిక, సాంఘిక సంక్షేమ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వెంటనే విగ్రహం తయారీకి ఆర్డర్ ఇవ్వాలి. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి కావాలి. నవంబర్ 1వ తేదీన పనులు మొదలు పెట్టి 13 నెలల్లోగా పూర్తయ్యేలా చూడాలి. -
పార్లమెంట్‌లోని అంబేడ్కర్ విగ్రహం తరహాలోనే..!
సాక్షి, అమరావతి: భారత పార్లమెంట్‌లోని డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ విగ్రహం తరహాలోనే.. విజయవాడలోని స్వరాజ్ మైదాన్‌లో 125 అడుగుల విగ్రహం డిజైన్ ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గురువారం సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపె విశ్వరూప్, దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో చెన్నైకి చెందిన కన్సల్టెంట్ ఇచ్చిన విగ్రహ డిజైన్‌ను ఖరారు చేశారు. (చదవండి: యరపతినేని అనుచరులు 13 మందిపై సీబీఐ కేసు) ► పార్క్ సుందరీకరణకు ఐదుగురు కన్సల్టెంట్స్ నుంచి డిజైన్లు రాగా, వీటన్నింటినీ పరిశీలించారు. ► విగ్రహం కింద పీట (పెడస్టల్) ఎత్తు 30 అడుగులు ఉంటుంది. దీనిపై 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తారు. కింది భాగంలో గ్రంధాలయం, ధ్యాన మందిరం, కన్వెన్షన్ హాలు వంటివి ఏర్పాటు చేస్తారు. మిగిలిన స్థలంలో పార్క్ ఉంటుంది. ► పచ్చదనం ఉండే డిజైన్లకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వ ఆలోచన కాగా, సర్వాంగ సుందరంగా సందర్శకులను ఆకట్టుకునే విధంగా వచ్చే డిజైన్లకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ► వచ్చే నెల 2న విగ్రహ కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆ సమావేశంలో కమిటీ సభ్యులు తుది డిజైన్ ఖరారు చేస్తారు. సీఎం సూచనలు తీసుకున్న తరువాత పనులు మొదలు పెట్టాలని నిర్ణయించారు. సమావేశంలో అధికారులు కరికాల వలవన్, ముద్దాడ రవిచంద్ర, హర్షవర్థన్, గ్రీన్ కార్పొరేషన్ ఎండీ చంద్రమోహన్‌రెడ్డి పాల్గొన్నారు. -
అంబేడ్కర్‌కు సముచిత గౌరవం
సాక్షి, అమరావతి/ అమరావతి బ్యూరో: రాష్ట్ర ప్రజల్లో స్ఫూర్తిని కలిగించేలా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 125 అడుగుల నిలువెత్తు విగ్రహ ఏర్పాటుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ చారిత్రక ఘట్టానికి విజయవాడలోని స్వరాజ్ మైదాన్ వేదిక కానుంది. విగ్రహ ఏర్పాటుతో పాటు పార్కు తదితర నిర్మాణ పనులకు బుధవారం సీఎం వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అంబేడ్కర్ పార్క్‌కు వీడియో కాన్ఫ్రెన్స్ ద్వారా శంకుస్థాపన చేసి మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్ ► విజయవాడ నగరం నడిబొడ్డున విగ్రహం ఏర్పాటు చేస్తే అంబేడ్కర్‌కు తగిన గౌరవం ఇచ్చినట్టు అవుతుందని, ఆయన చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుంటాయనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అంబేడ్కర్ స్వరాజ్ మైదాన్గా నామకరణం ► నీటిపారుదల శాఖకు చెందిన 20.22 ఎకరాల విస్తీర్ణంలో పీడబ్ల్యూడీ మైదానం ఉంది. ► విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ 1997లో దీని పేరు ‘స్వరాజ్ మైదాన్’గా మార్చింది. ► ఇప్పుడు ఈ మైదానానికే ‘డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్వరాజ్ మైదాన్’గా వైఎస్సార్సీపీ ప్రభుత్వం నామకరణం చేసింది. ► ఏడాదిలోగా ఈ పనులన్నీ పూర్తి చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. విగ్రహ ఏర్పాటు తదితర అభివృద్ధి పనులను ఏపీఐఐసీకి అప్పగించింది. ► 20 ఎకరాల స్థలంలో అంబేడ్కర్ స్మారక మందిరంతో పాటు గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు. అలాగే విగ్రహం చుట్టూ ఆహ్లాదకరమైన (పార్కు), ఓపెన్ ఎయిర్ థియేటర్‌తోపాటు వాకింగ్ ట్రాక్‌ను అభివృద్ధి చేయనున్నారు. -
స్వరాజ్య మైదానం ప్రజల ఆస్తి
-
రైతుబజార్లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు
సాక్షి, విజయవాడ : స్వరాజ్ మైదానంలోని రైతుబజార్లో విజిలెన్స్ అధికారులు బుధవారం దాడులు చేపట్టారు. ఆరు బృందాలతో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. రైతుబజార్లో ప్రభుత్వ గుర్తింపు కార్డు లేకుండా షాపులు నిర్వహిస్తున్న వారిని లక్ష్యంగా చేసుకొని అధికారులు ఈ దాడులు చేపట్టినట్టు తెలుస్తోంది. విజిలెన్స్ అధికారులతో పాటు తూనికలు కొలతల శాఖ అధికారులు కూడా ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. రైతుబజార్లో అధిక రేట్లకు అమ్మకాలు జరుపుతున్న వ్యాపారులు.. ప్రభుత్వ గుర్తింపు కార్డు లేకుండా వ్యాపారం చేస్తున్న వారిపై, కూరగాయలను గ్రేడింగ్ చేసి బయట మార్కెట్‌కి పంపుతున్న వారిపై, ఎలక్ట్రానిక్ వెయింగ్ మిషన్లు సరిగా పనిచేయని షాప్ యాజమానులపై అధికారులు కేసులు నమోదు చేస్తున్నారు. -
విజయవాడలో సిటీ స్వ్కేర్‌పై నిరసనలు
-
అంతిమ విజయం ధర్మానిదే
విజయవాడ కల్చరల్ : ధర్మం ఉన్న చోట జయం ఉంటుందని ఇస్కాన్ సౌత్ ఇండియా డివిజన్ కౌన్సిల్ చైర్మన్ సత్యచగోపీనాథ్ ప్రభూజీ వివరించారు. ఇస్కాన్ సంస్థ స్వర్ణోత్సవాలు స్వరాజ్యమైదానంలో రెండురోజులుగా జరిగాయి. శనివారం నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి వచ్చిన బాల బాలికలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సత్యగోపీనాథ్ మాట్లాడుతూ భారతదేశం నిరంతరం ధర్మం కోసం పాటుపడుతున్నందునే ప్రపంచ దేశాలు మన దేశంవైపు చూస్తున్నాయని చెప్పారు. సక్రమంగా సంపాదించిన ధనమే నిలుస్తుందని, అక్రమ మార్గంలో వచ్చిన సంపాదన నిలువదని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా మూడు కేటగిరీలో నిర్వహించిన పోటీల్లో 30 వేలమందికి పైగా పాల్గొన్నారని చెప్పారు. దాదాపు రూ. 20 లక్షలను ప్రైజ్ మనీగా అందిస్తున్నామన్నారు. ఇస్కాన్ విశేష సేవలు : మంత్రి ప్రత్తిపాటి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ ఇస్కాన్ సంస్థ సేవలు ఇతర సేవా సంస్థలకు ఆదర్శంగా నిలుస్తోందని వివరించారు. సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరారవు మాట్లాడారు. వివిధ కేటగిరిలో గెలుపొందిన విద్యార్థులకు నగదు బహుమతిని అందజేశారు. విజేతలు వీరే .. ఆరు నుంచి పదో తరగతి వరకు మెదటి బహుమతి రూ. 1 లక్ష వడలి కాకినాడకు చెందిన సుబ్రహ్మమణ్వేశ్వరశర్మ, ద్వితీయ రూ.75 వేలు అనంతపురానికి చెందిన టి.సాయిలిఖిత, తృతీయ రూ. 50 వేలు అనంతపురానికి చెందిన బి.మహేష్‌బాబు, రెండో కేటగిరీలో మొదటి బహుమతి రేణిగుంటకు చెందిన పాసల మహేష్, ద్వితీయ బహుమతి కాకినాడకు చెందిన బి. వెంకటసాయి, తృతీయ బహుమతి పి. సాయిగాయత్రి, మూడో విభాగంలో మెదటి బహుమతి విజయవాడకు చెందిన డాక్టర్ జె. ప్రసన్న, ద్వితీయ బహుమతి ఎస్. కృష్ణ ప్రసాద్, తృతీయ బహుమతి బి. శ్రీనివాసులు సాధించారు. వీరితోపాటు ప్రతి జిల్లాలోనూ గెలుపొందిన విజేతలకు నగదు బహుమతులు అందజేశారు. ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు బరంపురానికి చెందిన ప్రిన్సి గ్రూప్ నృత్య దర్శకుడు టి. కృష్ణారెడ్డి నృత్య దర్శకత్వంలో శ్రీకృష్ణలీలలు, కాళీయ మర్దనం, శ్రీకృష్ణుని రాసలీలలు, కృష్ణడు అర్జనునికి గీతను బోధించడం అంశాలన ప్రదర్శించారు. నేటి కార్యక్రమాలు సాయంత్రం 7 గంటలకు సంకీర్తన, 7.30 సత్యగోపీనాథ్ భాగవతం అంశంగా ప్రసంగం, అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు -
స్వరాజ్ మైదాన్ పరిరక్షణకు ఉద్యమం
- వడ్డే శోభనాద్రీశ్వరరావు విజయవాడ విజయవాడలోని స్వరాజ్ మైదానాన్ని కాపాడుకునేందుకు నగర ప్రజలతో కలసి ఉద్యమిస్తామని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు తెలిపారు. స్వరాజ్ మైదానాన్ని చైనా కంపెనీకి కట్టబెట్టడాన్ని వ్యతిరేకిస్తూ ఆదివారం రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. ఇందులో మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావుతోపాటు వివిధ పార్టీల నాయకులు, నగర ప్రముఖులు పాల్గొన్నారు. చారిత్రక స్థలాన్ని చైనా కంపెనీకి ఎలా అప్పగిస్తారని సమావేశంలో పాల్గొన్న నాయకులు ప్రభుత్వంపై మండిపడ్డారు. వందల కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని విదేశీ కంపెనీకి దారాదత్తం చేస్తారా అని నిలదీశారు. గతంలో ఎంటర్టైన్మెంట్ పేరుతో విలువైన కెనాల్ గెస్ట్‌హౌస్‌ను ఎంపీ గంగరాజుకు కేటాయించారని.. కావాలంటే దాన్ని స్వాధీనం చేసుకుని చైనా సంస్థకు ఇచ్చుకోవాలన్నారు. -
26 ఏళ్ల ఆనవాయితీకి తిలోదకాలు
ప్రభుత్వ అధీనంలోనే స్వరాజ్య మైదానంలోని సగభాగం సగం స్థలంలోనే బుక్ ఫెస్టివల్ విజయవాడ : ప్రతి ఏటా ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే బెజవాడ పుస్తక మహోత్సవం ఈసారి చిన్నబోయే పరిస్థితి ఏర్పడింది. ఈ బుక్ ఫెస్టివల్ ఏర్పాటుచేసే స్వరాజ్య మైదానంలో (పీడబ్ల్యూడీ గ్రౌండ్స్) సగభాగాన్ని మాత్రమే ఈసారి ప్రభుత్వం కేటాయించడంతో స్టాల్స్ సంఖ్య కుదించక తప్పలేదు. దేశ, విదేశాలకు చెందిన ప్రఖ్యాత ముద్రణ సంస్థలతో నిర్వహించే ఈ మహోత్సవానికి స్వరాజ్య మైదానం వేదిక. మైదానం సమీపంలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ఉందనే కారణంతో ఈ ప్రాంతాన్ని హై సెక్యూరిటీ జోన్‌గా చూపి అందులో పుస్తక మహోత్సవ నిర్వహణకు ఆంక్షలు విధించారు. 11 ఎకరాల ఈ మైదానంలో కలెక్టర్ క్యాంపు కార్యాలయం ఉన్న వైపునంతటినీ ప్రభుత్వం తన అధీనంలోకి తీసుకుంది. బందరు రోడ్డువైపు రైతు బజార్ నుంచి కల్యాణ్ జ్యూయలర్స్ షోరూమ్ సమీపం వరకే ఎగ్జిబిషన్ నిర్వహించుకునేందుకు అవకాశం కల్పించారు. దీంతో 400 వరకూ ఏర్పాటుకావాల్సిన స్టాల్స్ 230కి తగ్గిపోయాయి. గత సంవత్సరం 389 స్టాల్స్‌తో ఎగ్జిబిషన్ నిర్వహించగా ఈసారి ఆ స్థాయిలో నిర్వహించే అవకాశం లేకుండాపోయింది. ప్రముఖ ముద్రణా సంస్థల స్టాల్స్: సిల్వర్‌జూబ్లీ ఉత్సవాలు జరుపుకొన్న విజయవాడ బుక్ ఫెస్టివల్ కోసం ప్రతి సంవత్సరం వేలాదిమంది ఎదురుచూస్తుంటారు. ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జి వంటి ప్రఖ్యాత అంతర్జాతీయ ముద్రణా సంస్థలు, ఎస్ చాంద్, హిమాలయ వంటి పేరొందిన ముద్రణా సంస్థలు ప్రతి ఏటా ఇక్కడ తమ స్టాల్స్ ఏర్పాటు చేస్తాయి. ప్రతి సంవత్సరం జనవరి ఒకటి నుంచి పదో తేదీ వరకూ జరిగే ఈ ఎగ్జిబిషన్‌ను నాలుగు లక్షల మంది సందర్శిస్తారని, రెండు కోట్లకు పైగా విక్రయాలు జరుగుతాయని అంచనా. ఈ ఎగ్జిబిషన్లో దాదాపు దొరకని పుస్తకం ఉండదు. అందుకే దూరప్రాంతాల నుంచి కూడా అనేకమంది ఇక్కడకొస్తారు. 1989 నుంచి ఇలా నిరాఘాటంగా జరుగుతున్న పుస్తక మహోత్సవానికి భద్రత కారణాల పేరుతో ఈసారి అధికార యంత్రాంగం బ్రేకు వేసింది. తొలుత పుస్తక మహోత్సవాన్ని వేరే చోట పెట్టుకోవాలని విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీకి సూచించారు. కానీ నగరం నడిబొడ్డున అందరికీ అందుబాటులో ఉన్న గ్రౌండ్‌ను కాదని వేరేచోట పెడితే ఇబ్బంది వస్తుందని నిర్వాహకులు ఆందోళనతో సగం స్థలం కేటాయించారు. పుస్తక ప్రియుల ఆందోళన నగరంలో విజ్ఞాన, వినోద, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు స్వరాజ్య మైదానం ఎంతోకాలం నుంచి వేదికగా ఉంటోంది. కొద్దిరోజుల నుంచి భద్రత పేరుతో వీటికి అనుమతివ్వడంలేదు. దీంతో భవిష్యత్తులో పుస్తక మహోత్సవాలు, ఇతర కార్యక్రమాలకు ప్రత్యామ్నాయం చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నగరంలో ఈ తరహా మైదానం మరొకటి లేకపోవడంతో అలాంటి కార్యక్రమాలు నగరం వెలుపల నిర్వహించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అందుబాటులో ఉన్న ఒకే ఒక మైదానాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని తమను ఊరిబయటకు వెళ్లమనడంపై పుస్తక ప్రియులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.