
సాక్షి, అమరావతి: విజయవాడలోని స్వరాజ్ మైదానంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అంబేడ్కర్ 125 అడుగుల విగ్రహం ఏర్పాటు పనులను వేగవంతం చేయాలని మంత్రుల కమిటీ ఆదేశించింది. తాడేపల్లిలోని ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో సోమవారం మంత్రుల కమిటీ సమావేశమైంది. సాంఘిక సంక్షేమ, ఆర్థిక, ప్రణాళిక, పరిశ్రమల శాఖల అధికారులతోపాటు నిర్మాణ సంస్థ ప్రతినిధులతో నిర్వహించిన ఈ సమావేశంలో పలు అంశాలపై కమిటీ చర్చించింది. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌ను పరిశీలించిన మంత్రులు పినిపే విశ్వరూప్, ఆదిమూలపు సురేష్ పలు సూచనలు చేశారు.
స్వరాజ్ మైదానంలో మిగిలిన వాటిని ఖాళీ చేయించి పూర్తిస్థాయిలో స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో 2023 ఏప్రిల్ 23 నాటికి అంబేడ్కర్ 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రులు సూచించారు. పనుల పురోగతిపై మరో సమావేశాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో నిర్వహించి సమస్యలుంటే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రులు తెలిపారు. సమావేశంలో సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ కె.హర్షవర్ధన్, కలెక్టర్ జె.నివాస్, జూమ్ ద్వారా పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, ప్రణాళిక విభాగం కార్యదర్శి విజయకుమార్ పలు అంశాలపై మంత్రుల కమిటీతో చర్చించారు.