పుస్తక మహోత్సవాన్ని ప్రారంభిస్తున్న గవర్నర్
సాక్షి, అమరావతి/వన్‌టౌన్ (విజయవాడ పశ్చిమ): పుస్తకం కంటే విశ్వసనీయ స్నేహితుడు లేడని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. విజయవాడ స్వరాజ్ మైదానంలో ఏర్పాటు చేసిన 32వ పుస్తక మహోత్సవాన్ని శనివారం వెబినార్ విధానంలో గవర్నర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతీయ భాషల నుంచి ఎంపిక చేసిన రచనలను తెలుగులోకి అనువదించడం ద్వారా ఇక్కడి పాఠకులకు ఆయా భాషల సాహిత్యాన్ని పరిచయం చేయాలన్నారు. దీనివల్ల దేశంలోని ఇతర ప్రాంతాల సంస్కృతి, చరిత్రపై జ్ఞానం సుసంపన్నం అవుతుందన్నారు.
దక్షిణ భారతదేశంలో ఏటా జరిగే అతిపెద్ద పుస్తక మహోత్సవాల్లో ఒకటిగా విజయవాడ పుస్తక మహోత్సవం గుర్తింపు పొందటం ముదావహమన్నారు. పుస్తకం మనల్ని విజ్ఞానం, వినోదం, కొత్త ఆలోచనా ప్రక్రియల ప్రపంచంలోకి తీసుకువెళుతుందని, ఒక పుస్తకం నిజమైన స్నేహితుడిగా ఉంటూ పాఠకుడి నుంచి ఏవిధమైన ప్రతిఫలం ఆశించదన్నారు. ఒక రచయితగా, పుస్తక ప్రేమికుడిగా తనకున్న అనుభవంతో ఈ విషయం చెబుతున్నానని, చిన్న వయసులోనే పిల్లల్లో పుస్తక పఠనం అలవాటు చేయాలని గవర్నర్ సూచించారు. గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌పీ సిసోడియా, దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఎమెస్కో అధ్యక్షుడు విజయ్‌కుమార్, పుస్తక మహోత్సవ కో–ఆర్డినేటర్ మనోహర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
నిరాడంబరంగా నూతన సంవత్సర వేడుక
ఏపీ రాజ్‌భవన్‌లో నూతన సంవత్సర వేడుకలను శనివారం నిరాడంబరంగా నిర్వహించారు. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ దంపతులను పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. రాజ్‌భవన్ రూపొందించిన 2022 క్యాలండర్‌ను ప్రత్యేక ప్రధాన కా>ర్యదర్శి ఆర్‌పీ సిసోడియా, ఇతర అధికారుల సమక్షంలో గవర్నర్ ఆవిష్కరించారు. ముఖ్య ఎన్నికల కమిషనర్ విజయానంద్ సిబ్బందితో వచ్చి గవర్నర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
దేవదాయ శాఖ కార్యదర్శి వాణీమోహన్ నేతృత్వంలో టీటీడీ పండితులు గవర్నర్ దంపతులను ఆశీర్వదించి శ్రీవారి ప్రసాదాన్ని అందించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ, డీజీపీ డి.గౌతం సవాంగ్, నగర పోలీసు కమిషనర్ కాంతిరాణా టాటా, ముఖ్య సమాచార కమిషనర్ రమేష్‌కుమార్, కమిషనర్లు రవికుమార్, రమణకుమార్, జనార్ధనరావు, ఐలాపురం రాజా, శ్రీనివాసరావు, హరిప్రసాదరెడ్డి, చెన్నారెడ్డి, బీసీ సంక్షేమ శాఖ సంచాలకుడు అర్జునరావు తదితరులు గవర్నర్‌ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో రాజ్‌భవన్ సంయుక్త కార్యదర్శి శ్యామ్ ప్రసాద్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment