పార్లమెంట్‌లో వ్యతిరేకించిన వైఎస్సార్‌సీపీకి కృతజ్ఞతలు
ముస్లింలకు ద్రోహం చేసిన టీడీపీ, జనసేన
ఏపీ ముస్లిం జేఏసీ కన్వీనర్ షేక్ మునీర్ అహ్మద్
సాక్షి, అమరావతి: వక్ఫ్ బోర్డు నిబంధనల్లో సవరణలు చేయడం రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనని ఏపీ ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ షేక్ మునీర్ అహ్మద్ స్పష్టంచేశారు. పార్లమెంట్‌లో వైఎస్సార్‌సీపీ ఎంపీలు వక్ఫ్ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకించడంపై ఆయన హర్షంవ్యక్తంచేశారు. ఈ మేరకు మునీర్ అహ్మద్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ప్రస్తుత పరిస్థితుల్లో వక్ఫ్ భూములు పట్టణ ప్రాంతాల్లో అతి విలువైనవిగా ఉండటంతో వాటిని కొట్టేసేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ముస్లిం మనోభావాలను గొప్ప మనసుతో అర్థం చేసుకుని మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వక్ఫ్ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకించి మైనార్టీలకు మరోసారి అండగా నిలిచారని కృతజ్ఞతలు తెలిపారు. కేంద్రంలోని బీజేపీ తెచ్చిన వక్ఫ్ సవరణలకు మద్దతు పలికిన టీడీపీ, జనసేన కూటమి ముస్లింలకు తీరని ద్రోహం చేశాయన్నారు.
ముస్లింలకు టీడీపీ వ్యతిరేకం: నాగుల్‌మీరా
ఎన్నికల ప్రచారంలో ముస్లింల హక్కులను కాపాడతానని నమ్మించి, నేడు కేంద్ర ప్రభుత్వం ముస్లిం సమాజ ఆస్తులను కాజేయాలనే కుట్రతో వక్ఫ్ చట్ట సవరణ బిల్లు తీసుకొస్తే సంపూర్ణ మద్దతు ఇచ్చిన టీడీపీ మరోసారి ముస్లింల వ్యతిరేక పార్టీ అని తేటతెల్లమైందని ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు షేక్ నాగుల్ మీరా అన్నారు.
వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు తాము వ్యతిరేకమని పార్లమెంటులో తెలిపిన వైఎస్సార్‌సీపీకి ముస్లిం సమాజం రుణపడి ఉంటుందని ఆయన చెప్పారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి క్యాంపు కార్యాలయం వద్ద గురువారం ఆయన మాట్లాడుతూ టీడీపీకి మద్దతు ఇచ్చిన ముస్లిం మైనార్టీ సంఘాలు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ముస్లిం సమాజంలో తిరుగుతాయని ప్రశ్నించారు.
కాగా, వివాదాస్పద వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకించి సెలెక్ట్ కమిటీకి పంపేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని సీఎం చంద్రబాబు, మంత్రి ఫరూఖ్‌ను పలు మైనారిటీ సంఘాల నాయకులు కలిసి వినతిపత్రాలు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment