సాక్షి, అమరావతి: ‘జగనన్న పాల వెల్లువ’ ద్వారా పాడి రైతులకు మరింత ప్రయోజనం చేకూరుస్తూ అమూల్ సంస్థ తాజాగా ఆరో సారి సేకరణ ధరలను పెంచింది. లీటర్‌కు గరిష్టంగా గేదె పాలపై రూ.3.30, ఆవుపాలపై రూ.3.08 చొప్పున పెంచింది. కిలో వెన్నపై రూ.30, ఘనపదార్థాలపై రూ.22 మేర పెంచారు. రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాల పరిధిలో శనివారం నుంచి ఈ పెంపు వర్తించనుంది. 2.29 లక్షల మంది పాడి రైతులకు దీనివల్ల లబ్ధి చేకూరనుంది.
26 నెలల్లో ఆరు దఫాలు సేకరణ ధరలు పెంపు
రాయలసీమలో అమూల్ తరఫున కైరా యూనియన్, కోస్తాంధ్రలోని సబర్కాంత్, ఉత్తరాంధ్రలో బనస్కాంత్ యూనియన్లు పాలను సేకరిస్తున్నాయి. పథకం ప్రారంభించినప్పుడు లీటర్‌కు గరిష్టంగా గేదె పాలకు రూ.71.47, ఆవు పాలకు రూ.34.20 చొప్పున చెల్లించగా తాజా పెంపుతో కలిపి గత 26 నెలల్లో ఆరు దఫాలు పాల సేకరణ ధరలు పెరిగాయి. అమూల్ తరఫున రాయలసీమ జిల్లాల్లో పాలు సేకరిస్తున్న కైరా యూనియన్ గతేడాది నవంబర్‌లో పెంచగా, సెంట్రల్ ఆంధ్రలో సబర్కాంత్ యూనియన్ సెప్టెంబర్‌లో పాల సేకరణ ధరలను పెంచింది. ప్రస్తుతం లీటర్‌కు గరిష్టంగా గేదె పాలకు రూ.82.50, ఆవు పాలకు రూ.39.48 చొప్పున చెల్లిస్తోంది. కాగా ఆరోసారి ఈ రెండు యూనియన్లు మరోసారి పాలసేకరణ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి.
లీటర్‌కు గేదె పాలపై కనిష్టంగా (5.5 శాతం కొవ్వు, 9 శాతం ఎస్‌ఎన్‌ఎఫ్) రూ.1.65, గరిష్టంగా (11 శాతం కొవ్వు, 9 శాతం ఎస్‌ఎన్‌ఎఫ్) రూ.3.30 చొప్పున పెంచాయి. ఆవుపాలపై కనిష్టంగా (3.2 శాతం కొవ్వు, 8.7 శాతం ఎస్‌ఎన్‌ఎఫ్) రూ.2.47, గరిష్టంగా (5.4 శాతం కొవ్వు, 8.7 శాతం ఎస్‌ఎన్‌ఎఫ్) రూ.3.08 చొప్పున పెంచాయి. దీంతో గేదె పాలకు లీటర్‌కు కనిష్టంగా రూ.40.75 నుంచి రూ.42.40కు, గరిష్టంగా రూ.82.50 నుంచి 85.80కు పెంచింది. ఆవుపాలకు లీటర్‌కు కనిష్టంగా రూ.31.73 నుంచి రూ.34.20కు పెంచగా, గరిష్టంగా 39.48 నుంచి రూ.42.56కు పెంచింది. ఈ పెంపు శనివారం నుంచి వర్తించనుంది. ఉత్తరాంధ్ర పరిధిలో పాలు సేకరిస్తున్న బనస్కాంత్ యూనియన్ డిసెంబర్ 15వ తేదీన పెంచింది.
26 నెలల్లో 6.36 కోట్ల లీటర్ల సేకరణ
జగనన్న పాలవెల్లువ పథకం 2020 డిసెంబర్‌లో మూడు జిల్లాలతో ప్రారంభం కాగా ప్రస్తుతం 17 జిల్లాలకు (పునర్విభజన తర్వాత) విస్తరించింది. 14,845 మంది రైతులతో మొదలైన ఈ ఉద్యమంలో 2.61 లక్షల మంది భాగస్వాములయ్యారు. వంద గ్రామాలతో మొదలై 3,173 గ్రామాలకు విస్తరించింది. 1,608 ఆర్బీకేల పరిధిలోని 3,142 గ్రామాల్లో రైతుల నుంచి రోజూ సగటున 1.72 లక్షల లీటర్ల పాలు సేకరిస్తోంది. రెండేళ్లలో 6.36 కోట్ల లీటర్ల పాలను సేకరించగా పాడి రైతులకు రూ.276 కోట్లు చెల్లించారు. లీటర్‌పై రూ.4 అదనంగా లబ్ధి చేకూర్చేలా కృషి చేస్తామని హామీ ఇవ్వగా అంతకు మించి ప్రస్తుతం లీటర్‌కు గేదె పాలకు రూ.15 నుంచి రూ.20 వరకు, ఆవుపాలకు రూ.10 నుంచి 15 వరకు అదనంగా ప్రయోజనం చేకూరుతోంది. అమూల్ రాకతో పోటీ పెరిగి ప్రైవేట్ డెయిరీలు సైతం సేకరణ ధరలను పెంచాల్సి వచ్చింది. ఫలితంగా పాడి రైతులకు రూ.2,728 కోట్ల మేర అదనంగా లబ్ధి చేకూరింది.
మార్చిలోగా మిగతా జిల్లాలకు..
జగనన్న పాల వెల్లువ కింద పాలుపోసే పాడి రైతులకు అమూల్ తరఫున రాయలసీమ, కోస్తాంధ్రలో కైరా, సబర్కాంత్ యూనిట్లు ఆరోసారి పాలసేకరణ ధరను పెంచడంతో పాటు వెన్న, ఘనపదార్థాల సేకరణ ధరలను పెంచాయి. తాజా పెంపుతో సుమారు 2.29 లక్షల మంది రైతులకు అదనపు లబ్ధి చేకూరనుంది. ఇప్పటికే 17 జిల్లాల్లో జేపీవీ అమలవుతుండగా మార్చిలోగా మిగిలిన జిల్లాలకు విస్తరించేందుకు కృషి చేస్తున్నాం.
– అహ్మద్‌బాబు, ఎండీ, ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్
Comments
Please login to add a commentAdd a comment