రాజకీయంగా ఎదగనివ్వలేదు.. ఆర్థికంగానూ ఆదుకోలేదు
1994లో చంద్రగిరి సీటు ఇచ్చింది ఎన్టీఆర్.. తమ్ముడికి సీటివ్వడాన్ని వ్యతిరేకించిన బాబు
సీఎం అయినా తమ్ముడిని పట్టించుకోని వైనం
రామ్మూర్తిని ఓ దశలో చంద్రబాబు గొలుసులతో కట్టేశారనే విమర్శలు
పాత చరిత్రకు మసిపూసి సోదరుడితో బంధం ఉన్నట్లు బిల్డప్
సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తినాయుడు మరణంతో అన్నదమ్ముల బంధంపై ఎల్లో మీడియా అదేపనిగా ప్రచారం చేస్తోంది. కానీ.. రామ్మూర్తినాయుడిని చంద్రబాబు ఏనాడూ పట్టించుకోలేదని ఆయనతో కలిసి పనిచేసిన ఓ మాజీ ఎమ్మెల్యే స్పష్టం చేశారు. నాలుగు సార్లు సీఎంగా పనిచేసినా రామ్మూర్తినాయుడిని చంద్రబాబు ఆర్థికంగా ఆదుకోలేదని ఆ మాజీ ఎమ్మెల్యే వెల్లడించారు. తమ్ముడిని రాజకీయంగానూ చంద్రబాబు ఎదగనీయలేదని, ఈ విషయాన్ని రామ్మూర్తినాయుడే పలు సందర్భాల్లో తనతో చెప్పారని 1994లో రామ్మూర్తినాయుడికి సహ ఎమ్మెల్యేగా ఎన్నికైన మరో మాజీ ఎమ్మెల్యే గుర్తు చేసుకున్నారు.
ఆయనకు ఎన్టీఆర్ దగ్గరకు తీసుకెళ్లి చంద్రగిరి సీటు ఇప్పించింది లక్ష్మీపార్వతి అని పేర్కొన్నారు. టీడీపీలోనే ఉన్నా తమ్ముడికి సీటు ఇవ్వడాన్ని అప్పట్లో చంద్రబాబు వ్యతిరేకించారని మాజీ ఎమ్మెల్యే గుర్తు చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన చాలా సందర్భాల్లో చెప్పేవారని వివరించారు. 1995లో ఎన్టీఆర్ మరణం తర్వాత వెన్నుపోటు రాజకీయాలతో చంద్రబాబు టీడీపీని చేజిక్కించుకున్న తరువాత రామ్మూర్తినాయుడిని పట్టించుకోలేదని, 1999 ఎన్నికల్లో తమ్ముడికి సీటు ఇచ్చినా ఆయన గెలిచేందుకు సహకరించలేదని పేర్కొన్నారు.
ఆ తర్వాత చంద్రబాబు సీఎం అయినా తమ్ముడిని, ఆయన కుటుంబాన్ని పట్టించుకోవడం మానేశారని చెప్పారు. ఆ సమయంలోనే అనేకసార్లు చంద్రబాబు తనను పట్టించుకోవడం లేదని, రాజకీయంగా అణచివేస్తున్నాడని రామ్మూర్తినాయుడు సన్నిహితులు, మీడియా వద్ద చెప్పుకుని బాధపడేవారని ఆ మాజీ ఎమ్మెల్యే పేర్కొన్నారు. కాగా.. రామ్మూర్తినాయుడు మానసిక స్థితి బాగోలేకపోవడంతో ఆయన్ను గొలుసులతో కట్టేశారంటూ అప్పట్లో చంద్రబాబుపై తీవ్ర విమర్శలు వచ్చాయి.
అన్నపై తిరుగుబాటు చేసి కాంగ్రెస్‌లో చేరిక
ఈ బాధతోనే రామ్మూర్తినాయుడు 2004 ఎన్నికల్లో అన్న చంద్రబాబుపై తిరుగుబాటు చేశారు. టీడీపీ నుంచి బయటకు వచ్చి ఎలాగైనా ఎన్నికల్లో పోటీ చేయాలని భావించి కాంగ్రెస్‌లో చేరారు. చంద్రబాబుకు కుటుంబం అన్నా కనీస గౌరవం లేదని, బాధ్యత కూడా లేదని రామ్మూర్తినాయుడు అనేవారు. ఆయనకు రాజకీయమే ముఖ్యమని, అందుకోసం ఏదైనా చేస్తాడని చెప్పేవారు. తన కుటుంబాన్ని తానే చూసుకునేవాడినని అందువల్లే చంద్రబాబు రాజకీయాల్లో రాణించగలిగారని పలు ఆయన సందర్భాల్లో తెలిపారు.
రాజకీయంగా ఎదిగిన తర్వాత హెరిటేజ్ తదితర చాలా ఆస్తులు సంపాదించినా తమ్ముడు సహా తన అక్క, చెల్లెలు గురించి చంద్రబాబు పెద్దగా పట్టించుకోలేదని రామ్మూర్తి సహచరులు చెప్పారు. 2008 నుంచి అనారోగ్యంతో రామ్మూర్తినాయుడు మంచానపడ్డారు. ఆ తర్వాత ఆయన కుమారుడు నారా రోహిత్ రాజకీయాల్లోకి రావడానికి ఆసక్తి చూపారు. 2014 ఎన్నికల్లో కుప్పం టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. అతన్ని కూడా చంద్రబాబు రాజకీయాల్లోకి రానివ్వలేదని చెబుతారు.
Comments
Please login to add a commentAdd a comment