టెన్త్‌ పరీక్షలకు సర్వం సిద్ధం | Andhra Pradesh: Class 10 public exams arrangements completed | Sakshi
Sakshi News home page

టెన్త్‌ పరీక్షలకు సర్వం సిద్ధం

Published Mon, Feb 26 2024 4:55 AM | Last Updated on Mon, Feb 26 2024 11:58 AM

Andhra Pradesh: Class 10 public exams arrangements completed - Sakshi

సాక్షి, అమరావతి: పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు పాఠశాల విద్యాశాఖ ఎగ్జామ్స్‌ విభాగం ఏర్పాట్లు పూర్తిచేసింది. మార్చి 18 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించనున్న పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా అన్ని వసతులతో 3,473 సెంటర్లను సిద్ధం చేసింది. ప్రధాన పరీక్షలు మార్చి 28వ తేదీతో ముగుస్తాయి. ఆ తర్వాత రెండు రోజులు ఓరియంటల్, ఒకేషనల్‌ పరీక్షలు ఉంటాయి. కాగా, 2023–24 విద్యా సంవత్సరంలో మొత్తం 6,23,092 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు ఎన్‌రోల్‌ చేసుకున్నారు. వీరిలో గత ఏడాది పదో తరగతి ఫెయిలై తిరిగి ప్రవేశం పొందినవారు 1,02,528 మంది ఉన్నారు.

ఓరియంటల్‌ విద్యార్థులు 1,562 మంది ఉన్నారు. కాగా, మొత్తం పదో తరగతి విద్యార్థుల్లో 3,17,939 మంది బాలురు, 3,05,153 మంది బాలికలు ఉన్నారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.15 గంటలకు పరీక్షలు నిర్వహిస్తారు. విద్యార్థులను ఉదయం 8.45 నుంచి 9.30 గంటలకు వరకు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ప్రత్యేక సందర్భాల్లో మరో 30 నిమిషాల వరకు అంటే ఉదయం 10గంటల వరకు అనుమతిస్తారు. మొత్తం 156 ఫ్లయింగ్‌ స్క్వాడ్స్, 682 సిట్టింగ్‌ స్వాడ్స్‌ను అధికారులు సిద్ధంచేశారు. సమస్యాత్మక పరీక్ష కేంద్రాలను గుర్తించి అక్కడ స్థానిక జిల్లా విద్యాశాఖ అధికారులు సిట్టింగ్‌ స్క్వాడ్‌ను నియమిస్తారు. 130కి పైగా కేంద్రాల్లో సీసీ కెమెరాలను సైతం ఏర్పాటు చేశారు.

  

‘క్యూఆర్‌ కోడ్‌’తో పేపర్‌ లీకులకు చెక్‌ 
పదో తరగతి పరీక్షల్లో మాల్‌ ప్రాక్ట్రీస్‌కు అవకాశం లేకుండా ఈ ఏడా­ది ప్రశ్నపత్రాలను ప్రత్యేక టెక్నాలజీతో రూపొందించారు. ప్రతి పేపర్‌పైనా, ప్రతి ప్రశ్నకు క్యూఆర్‌ కోడ్‌ను ముద్రించారు. దీంతో మాల్‌ ప్రా్రక్టీస్‌ చేసినా, పేపర్‌ లీక్‌ చేసినా ఆ పేపర్‌ ఏ జిల్లా, ఏ మండలం, ఏ సెంటర్‌లో ఏ విద్యార్థికి కేటాయించినది అనేది వెంటనే తెలిసిపోతుంది. మరోవైపు ఇన్విజిలేటర్లు, విద్యాశాఖ అధికారులు, పోలీసు­లు, నాన్‌–టీచింగ్‌ సిబ్బంది, ఏఎన్‌ఎంలతోపాటు పరీక్షల సరళిని పర్య­వేక్షించే చీఫ్‌ ఇన్విజిలేటర్లు కూడా పరీక్షా కేంద్రాలకు సెల్‌ఫోన్‌ తీసుకువెళ్లకుండా నిషేధించారు. ఎలక్ట్రానిక్‌ పరికరాలు సైతం ఎవ­రూ తీసుకువెళ్లకూడదని విద్యాశాఖ పరీక్షల విభాగం స్పష్టంచేసింది. 

వెబ్‌ లింక్‌ ద్వారా పేపర్‌ సాఫ్ట్‌ కాపీ 
మార్చి 31 నుంచి ఏప్రిల్‌ 8 వరకు స్పాట్‌ వ్యాల్యూషన్‌ పూర్తిచేసి అనంతరం ఫలితాలను వెల్లడించనున్నారు. గతంలో రీ కౌంటింగ్, రీ వ్యాల్యూషన్‌కు దరఖాస్తు చేసుకుంటే ఫలితాలు తెలుసుకునేందుకు సంబంధిత పేపర్‌ ఇచ్చేవారు. ఈ ఏడాది అలాంటి వారికి వెబ్‌ లింక్‌ పంపించనున్నారు. సదరు లింక్‌ను ఓపెన్‌ చేస్తే పేపర్‌ సాఫ్ట్‌ కాపీని పొందేలా ఏర్పాట్లు చేశారు.  

పరీక్షలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం 
పదో తరగతి పరీక్షలకు వెళ్లే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపా­యం కల్పించారు. విద్యార్థులు పదో తర­గతి హాల్‌టికెట్‌ను చూపించి తమ ఇంటి నుంచి పరీక్ష కేంద్రాలకు అల్ట్రా పల్లెవెలు­గు, పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఉ­చితంగా వెళ్లి, రావొచ్చు. ఈ సదుపాయం ఓపెన్‌ స్కూల్‌ టెన్త్‌ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు కూడా కల్పించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement