అంబేడ్కర్ స్మృతివనంలో ఏర్పాట్లు పరిశీలిస్తున్న వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి
సాక్షి, అమరావతి: విజయవాడ నడిబొడ్డున సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన అంబేడ్కర్ మహాశిల్పం సామాన్యమైనది కాదని.. అదొక గొప్ప సామాజిక న్యాయ మహాశిల్పమని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి, పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత వేణుంబాక విజయసాయిరెడ్డి తెలిపారు. సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా ఈ నెల 19న సాయంత్రం 4 గంటలకు ఈ మహాశిల్పం ఆవిష్కరణ జరగనుందని చెప్పారు. ఇక్కడ సమతా మహాసభ జరుగుతుందని, దీనికి దళిత సోదర, సోదరీమణులు, అంబేడ్కర్ ఆశయాలు నచ్చినవారు, పాటించేవారు కులాలు, మతాలకు అతీతంగా విచ్చేస్తారని చెప్పారు.
విజయవాడ స్వరాజ్ మైదానంలో ప్రారంభానికి సిద్ధం అవుతున్న అంబేడ్కర్ విగ్రహాన్ని స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు, నేతలతో కలిసి మంగళవారం విజయసాయిరెడ్డి పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్‌కు బీఆర్ అంబేడ్కర్‌పై ఉన్న అభిమానంతోనే అతిపెద్ద విగ్రహ నిర్మాణానికి పూనుకున్నారని తెలిపారు. అంబేడ్కర్ సిద్ధాంతాలకు అనుగుణంగా సీఎం జగన్ నవరత్నాలు రూపొందించారని పేర్కొన్నారు.
ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఈ మహాశిల్పం ఏర్పాటు సువర్ణాక్షరాలతో నిలిచిపోతుందన్నారు. 81 అడుగుల వేదికపై 125 అడుగుల మహాశిల్పం ఏర్పాటుకు (మొత్తం 206 అడుగులు ఎత్తు) రూ.400 కోట్లకు పైగా వెచ్చించామన్నారు. తరతరాల వివక్షను రూపుమాపేందుకే అంబేడ్కర్ రాజ్యాంగాన్ని రూపొందించారని, దేశంలోని వ్యవస్థలన్నీ ఇంత సక్రమంగా పని చేస్తున్నాయంటే అంబేడ్కర్ మహనీయుడి పుణ్యమేనని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా ఇలాంటి కార్యక్రమం ఇంతవరకు చూడలేదన్నారు. అంబేడ్కర్ ఆశయాలను, లక్ష్యాలను సీఎం జగన్ కొనసాగిస్తున్నారని వివరించారు.
అంబేడ్కర్ అందరివాడు
బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం సీఎం జగన్ అహర్నిశలు కృషి చేస్తున్నారని.. విగ్రహావిష్కరణ సందర్భంగా సమతాసభ ఏర్పాటు చేశామని విజయసాయిరెడ్డి చెప్పారు. ఈ సభకు అన్ని ప్రాంతాల నుంచి అన్నివర్గాల ప్రజలు తరలిరానున్నారని చెప్పారు. ఇది ప్రభుత్వ కార్యక్రమమా? పార్టీ కార్యక్రమమా? అని ఓ మీడియా ప్రతినిధి అడగ్గా.. అంబేడ్కర్ ప్రజల మనిషి అని, బడుగు, బలహీన వర్గాల కోసం కృషి చేసిన వాడని, ఆయన అందరి వాడని సమాధానమిచ్చారు. ఇది ప్రభుత్వ కార్యక్రమమా, పార్టీ కార్యక్రమమా అనే భేదం లేకుండా అందరూ పాల్గొంటారని చెప్పారు. దార్శినికుడి విగ్రహావిష్కరణకు ప్రత్యేక ఆహా్వనం అవసరం లేదన్నారు. పార్టీలకు అతీతంగా సీఎం జగన్ ఈ ప్రాజెక్ట్ చేపట్టారని.. ఇందులో పార్టీ, ప్రభుత్వం అని తేడా చూపించకూడదన్నారు.
1.20 లక్షల మంది రాక
రాష్ట్రం నలుమూలల నుంచి 1.20 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నామని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఆ రోజు సాయంత్రం 6 గంటలకు లేజర్ షో లేదా డ్రోన్ షో ఉంటుందని చెప్పారు. ప్రారంభ కార్యక్రమం తర్వాత ఈ నెల 20వ తేదీ నుంచి సందర్శకులకు అనుమతి ఉంటుందన్నారు. భవిష్యత్‌లో గొప్ప పర్యాటక కేంద్రంగా అంబేడ్కర్ విగ్రహం ప్రాంతం నిలిచిపోతుందని చెప్పారు.
లోపల ఆడిటోరియం, వెనుక కన్వెన్షన్ సెంటర్, మ్యూజియం అన్నీ పర్యాటకుల్ని ఆకర్షిస్తాయని తెలిపారు. ఆయన వెంట ఎంపీ కేశినేని నాని, మంత్రి మేరుగ నాగార్జున, ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, మునిసిపల్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వై.శ్రీలక్ష్మి, ఎమ్మెల్యేలు వెలంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, విజయనగరం జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, పశ్చిమ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జ్ ఆసిఫ్, తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జి దేవినేని అవినాశ్, కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు, పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా టాటా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment