సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గత రెండు వారాల్లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. చాలా జిల్లాల్లో కేసుల ప్రభావం గణనీయంగా తగ్గుతోంది. ఒకానొక దశలో 24 వేలకుపైగా కేసులు వచ్చిన విషయం తెలిసిందే. గురువారం ఆ సంఖ్య 16 వేలకు తగ్గిందంటే వైరస్ తగ్గుముఖం పట్టినట్లు స్పష్టమవుతోంది. కర్ఫ్యూ పకడ్బందీగా అమలు చేయడం, కోవిడ్ నిబంధనలు పాటించడం వంటి వాటితో 10 జిల్లాల్లో కోవిడ్ తగ్గుముఖం పట్టింది. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, చిత్తూరు మినహా మిగతా 10 జిల్లాల్లో కేసులు తగ్గుతున్నాయి.
ఏప్రిల్ 5వ తేదీ నుంచి మే 23వ తేదీ వరకు 7 వారాల సగటు లెక్కిస్తే.. ఈ 10 జిల్లాల్లో కరోనా వైరస్ దాదాపు అదుపులోకి వచ్చినట్టు నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు 104 కాల్‌సెంటర్‌కు వచ్చే కాల్స్ తగ్గడం, ఐసీయూ పడకలు, ఆక్సిజన్ పడకల లభ్యత పెరగడం వంటివి కోవిడ్ తగ్గుముఖాన్ని సూచిస్తున్నాయి. కేసులు తగ్గుతున్నా ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందేనని, మాస్క్ ధరించడం, భౌతికదూరం పాటించడం, తరచూ చేతుల్ని శుభ్రం చేసుకోవడం వంటి జాగ్రత్తలు పాటించకపోతే వైరస్ మళ్లీ విజృంభించే ప్రమాదం ఉందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.
అనంతపురం జిల్లాలో 6వ వారం (మే 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు)తో పోలిస్తే 7వ వారం (మే 17 నుంచి 23 వరకు) కేసులు బాగా తగ్గాయి. ఒకదశలో ఎక్కువగా కేసులు నమోదైన గుంటూరు జిల్లాలో గత 3 వారాలతో పోల్చినా తక్కువ కేసులు నమోదయ్యాయి. విశాఖపట్నంలో మే 3వ తేదీ నుంచి 16వ తేదీ వరకు వచ్చిన కేసులతో పోలిస్తే ఇప్పుడు బాగా తగ్గాయి. శ్రీకా>కుళం జిల్లాలో గత వారంతో పోలిస్తే కేసులు కొద్దిగా పెరిగినా.. నాలుగు వారాల కేసులను పరిగణనలోకి తీసుకుంటే భారీగా తగ్గుముఖం పట్టాయి.
ప్రకాశం జిల్లాలో మే 3వ తేదీ నుంచి 16వ తేదీ వరకు వచ్చిన కేసులను పోలిస్తే ఇప్పుడు నిలకడగా ఉన్నట్టు తేలింది. నెల్లూరులో కేసుల సంఖ్య భారీగా తగ్గింది. మూడు వారాలుగా (ఏప్రిల్ 26 నుంచి మే 16 వరకు) నమోదైన కేసులతో పోలిస్తే ఇప్పుడు భారీగా తగ్గాయి. కృష్ణాజిల్లాలో తగ్గుముఖం పట్టకపోయినా కేసులు నిలకడగా ఉన్నట్టు తేలింది. కర్నూలు జిల్లాలో 5వ వారం (మే 3 నుంచి 9 వరకు) భారీగా కేసులు నమోదయ్యాయి. దీంతో పోల్చుకుంటే ఇప్పుడు బాగా తగ్గాయి. వైఎస్సార్ కడప జిల్లాలో గత వారంతో పోలిస్తే మే 17 నుంచి 23 వరకు ఏ జిల్లాలోనూ లేనంతగా కేసులు తగ్గాయి. విజయనగరం జిల్లాలో కేసులు గత రెండు వారాలతో పోలిస్తే నిలకడగా ఉన్నాయి
7వ వారంలో ఈ మూడు జిల్లాలోనూ తగ్గిన కేసులు
ప్రస్తుతం మూడు జిల్లాలోనే కేసులు బాగా కొనసాగుతున్నాయి.తూర్పుగోదావరి, చిత్తూరు, పశ్చిమ గోదావరి జిల్లాలో కేసులు ఎక్కువగా ఉన్నాయి. కానీ మే 20 నుంచి 26 మధ్య కాలంలో నమోదైన కేసులపరంగా చూస్తే ఈ మూడు జిల్లాలోనూ కేసులు తగ్గాయి. 6వ వారంతో పోలిస్తే ఈ మూడు జిల్లాల్లోను 7వ వారంలో కేసులు తగ్గాయి. దీన్నిబట్టి చూస్తే దాదాపుగా అన్ని జిల్లాల్లోనూ వైరస్ వ్యాప్తి అదుపులోకి వచ్చినట్టు భావిస్తున్నారు.
గ్రామాల్లోనే కేసులు తక్కువ
రాష్ట్రంలో పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో కరోనా పాజిటివ్ కేసులు తక్కువగా ఉన్నాయి. టెస్టుల సంఖ్యను బట్టి చూసినా, జనాభాను బట్టి చూసినా గ్రామీణ ప్రాంతాలకన్నా పట్టణాల్లోనే కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. గడిచిన 57 రోజుల్లో (ఏప్రిల్ 1 నుంచి మే 27 వరకు) గ్రామీణ ప్రాంతాల్లో 23.98 లక్షలకుపైగా టెస్టులు చేశారు. 4.09 లక్షల మందికి (17.1 శాతం) పాజిటివ్‌గా తేలింది. అదే సమయంలో పట్టణాల్లో 14.10 లక్షల టెస్టులు జరిగాయి. 3.31 లక్షల (23.5 శాతం) పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
రాష్ట్రంలో 70.54 శాతం ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో ఉండగా 29.46 శాతం మంది పట్టణాల్లో ఉన్నారు. జనాభా లెక్కన చూసినా గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణాల్లో పాజిటివిటీ రేటు 6.4 శాతం ఎక్కువగా నమోదైంది. గ్రామాల్లో ఫీవర్ సర్వే, టెస్టులు ఎక్కువగా చేస్తున్నారు. జనాభాతో పోల్చుకుంటే పల్లెల్లో వచ్చిన కేసులు ఎక్కువేమీ కాదని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ పేర్కొన్నారు.
Andhra Pradesh: 10 జిల్లాల్లో కరోనా తగ్గుముఖం
Published Fri, May 28 2021 5:04 AM | Last Updated on Fri, May 28 2021 11:34 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment