ప్రతి ‘ఇంటి’కీ ఆర్థిక దన్ను | Andhra Pradesh Government decision to complete housing for poor | Sakshi
Sakshi News home page

ప్రతి ‘ఇంటి’కీ ఆర్థిక దన్ను

Published Wed, Mar 23 2022 3:43 AM | Last Updated on Wed, Mar 23 2022 3:43 AM

Andhra Pradesh Government decision to complete housing for poor - Sakshi

శరవేగంగా నిర్మాణాలు జరుపుకుంటున్న గృహ నిర్మాణాలు

జగనన్న గృహనిర్మాణ పథకంలో భాగంగా నాగజ్యోతికి స్థలం మంజూరైంది. గృహ నిర్మాణ పనులు ప్రారంభించిన తర్వాతే అధికారులు దశలవారీగా సొమ్ము చెల్లిస్తారు. ఇంటి పనులు ప్రారంభించడానికి కనీస సొమ్ము కూడా ఆమె చేతిలో లేదు. దీంతో స్థలం ఖాళీగానే ఉండిపోయింది. 

ఇదే పథకంలో ఇల్లు మంజూరైన స్వర్ణకుమారి సొంతింటి కల సాకారం చేసుకోవాలనే తపనతో నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించింది. పునాదులు వేసి, కిటికీల దశకు వచ్చిన తర్వాత ఆర్థిక పరిస్థితి సహకరించకపోవడంతో పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయి. 

అధికారుల పరిశీలనలో ఇలాంటి పరిస్థితులు వెలుగులోకి రావడంతో ప్రభుత్వం వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు సంకల్పించింది. వారికి ముందస్తు చెల్లింపులతో అండగా నిలవాలని నిర్ణయించింది. తద్వారా పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు వేగవంతంగా పనులు పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటోంది. 

ఏలూరు(మెట్రో): పేదలందరికీ సొంతిల్లు అందించడమే ధ్యేయంగా పరిపాలన సాగిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ మేరకు అర్హులైన ప్రతి ఒక్కరికీ గృహ వసతి కల్పిస్తోంది. దీనిలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లావ్యాప్తంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇప్పటికే స్థలాలు కేటాయించి గృహ నిర్మాణాలు చేస్తోంది. జిల్లాలో 1,23,296 గృహాలకు ఇప్పటికే మంజూరు పత్రాలను అందించిన జిల్లా అధికారులు ఆ మేరకు గృహ నిర్మాణాలను పూర్తి చేయించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో పూర్తిస్థాయిలో గృహ నిర్మాణాలు పూర్తి చేయాలని ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ ప్రతిరోజూ గృహ నిర్మాణాల ప్రగతిపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నారు. ఇప్పటికే వారం వారం గృహ నిర్మాణాలకు బిల్లులు చెల్లిస్తూ లబ్ధిదారులు ఎలాంటి ఇబ్బందీ పడకుండా చర్యలు తీసుకుంటున్నారు. 

ముందస్తు చెల్లింపులకూ రెడీ... 
ఎప్పటికప్పుడు గృహ నిర్మాణ బిల్లులు చెల్లిస్తున్న ప్రభుత్వం.. లబ్ధిదారులు పనులు వేగవంతం చేసేందుకు తాజాగా ముందస్తు చెల్లింపులు సైతం చేసేందుకు నిర్ణయించింది. లబ్ధిదారులు గృహ నిర్మాణ సామగ్రిని అందుబాటులో ఉంచుకుని నిర్మాణానికి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు వస్తే వారికి రూ.15 వేలు చొప్పున మిగులు చెల్లించేందుకు చర్యలు చేపట్టింది. గృహ నిర్మాణాల నిమిత్తం చెల్లించే మిగులులోనే వీటిని మినహాయించుకుని లబ్ధిదారులకు ఆర్థిక సహకారం అందించేందుకు ముందస్తు సహాయం చేయనుంది. లబ్ధిదారుల ఆసక్తి మేరకు ఈ నిధులు చెల్లించనున్నారు. జిల్లాలో ఇందుకు అర్హులైన లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారనే అంశంపై గృహనిర్మాణ శాఖ అధికారులు ఆయా డివిజన్లు, మండలాల వారీగా పరిశీలన చేస్తున్నారు.

నిర్మాణాలు ప్రారంభించని లబ్ధిదారులకూ సాయం... 
పశ్చిమ గోదావరి జిల్లాలో గృహ నిర్మాణాలు ఇంకా ప్రారంభించని లబ్ధిదారులకు సైతం సహకారం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆయా లబ్ధిదారులకు రూ.5 వేలు చొప్పున ముందస్తు చెల్లింపులు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే ఈ సహాయాన్ని జిల్లాలో పలువురు లబ్ధిదారులకు అందజేసింది. జిల్లా వ్యాప్తంగా రూ.15 వేలు, రూ.5 వేలు ముందస్తు ఆర్థిక సహాయానికి 93,688 మందిని గుర్తించగా, ఇప్పటికే రూ.15 వేలు చొప్పున 1816 మందికి, రూ.5 వేలు చొప్పున 1067 మందికి చెల్లింపులు చేశారు. ఈ విధంగా గృహనిర్మాణాలను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించి ఆర్థికంగా సైతం లబ్ధిదారులకు దన్నుగా నిలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా గృహ నిర్మాణాలు వేగవంతంగా పూర్తి చేసి ప్రతి ఒక్క లబ్ధిదారునికీ సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యంగా గృహ నిర్మాణాలు వేగవంతంగా పూర్తిచేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 

ఆర్థికంగా వెసులుబాటు
జిల్లాలో ఇప్పటివరకు గృహనిర్మాణాలు ప్రారంభించని లబ్ధిదారులకు ప్రోత్సాహక సహాయంగా రూ.5 వేలు చొప్పున ముందస్తు సాయంగా అందిస్తున్నాం. గృహనిర్మాణాలు చేపట్టిన లబ్ధిదారులు ఆర్థిక కారణాలతో మధ్యలోనే నిలిపివేయకుండా వారికి చేయూత అందించి పనులు చేయించడమే లక్ష్యంగా రూ.15 వేలు చొప్పున సహాయం ముందుగానే అందజేస్తున్నాం. ఈ విధంగా గృహనిర్మాణాలు వేగవంతం చేస్తూ నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. ప్రస్తుతం జిల్లాలో గృహ నిర్మాణాలు వేగవంతంగా సాగుతున్నాయి. గృహనిర్మాణాలు వేగంగా పూర్తిచేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయించింది. 
– సూరజ్‌ ధనుంజయ్‌ గనోరి, జేసీ (గృహ నిర్మాణం) 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement