సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సమగ్ర భూ సర్వేకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 6 నెలల్లో 5 వేల గ్రామాల్లో సమగ్ర భూ సర్వేను పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే రెవెన్యూ డివిజన్‌కు ఒక గ్రామం చొప్పున 51 గ్రామాల్లో సర్వేను పూర్తిచేసి భూ యజమానులకు హక్కు పత్రాలను కూడా ఇచ్చారు. జనవరి నెలాఖరు నాటికి మరో 650 గ్రామాల్లో సర్వేను పూర్తి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదే వేగంతో వచ్చే జూన్ నాటికి ఐదు వేల గ్రామాల్లో సర్వేను పూర్తి చేసి హక్కు పత్రాలు జారీ చేయాలనే లక్ష్యంతో సర్వే సెటిల్మెంట్ శాఖ పనులు ముమ్మరం చేసింది. జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం కింద చేపట్టిన సర్వేలో కీలకమైన డ్రోన్ సర్వే సుమారు 1,100 గ్రామాల్లో పూర్తయింది. మిగిలిన 3,900 గ్రామాల్లో ఈ సర్వే పూర్తి చేసేందుకు అధికారులు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.
డ్రోన్ సేవల కోసం టెండర్లు
డ్రోన్ల లభ్యత కొంచెం ఇబ్బందిగా మారినా ఆ సేవలను అందించే కంపెనీలతో ఒప్పందం చేసుకుని ఈ పనిని త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం డ్రోన్ సేవలు అందించే సంస్థల నుంచి టెండర్లు ఆహ్వానించారు. త్వరలో డ్రోన్ సర్వే పనులను మరింత ముమ్మరం చేసి గడువులోపు సమగ్ర సర్వేను పూర్తి చేయాలనే కృతనిశ్చయంతో రెవెన్యూ యంత్రాంగం ముందుకెళుతోంది.
డ్రోన్ సర్వే పూర్తయిన 433 గ్రామాల్లో క్షేత్ర స్థాయి నిజనిర్థారణ (గ్రౌండ్ ట్రూతింగ్) సైతం పూర్తయింది. సాధ్యమైనంత త్వరగా మిగిలిన గ్రామాల డ్రోన్ మ్యాపులను సర్వే బృందాలకు అందించి వాటి ద్వారా గ్రౌండ్ ట్రూతింగ్‌ను పూర్తి చేయాలని భావిస్తున్నారు. డ్రోన్ సర్వే, గ్రౌండ్ ట్రూతింగ్ పూర్తయితే మిగిలిన పనులు సర్వే బృందాల చేతిలోనే సులువుగా అయ్యేందుకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు. మరోవైపు సమగ్ర సర్వే జరుగుతున్న తీరుపై మంత్రుల కమిటీ 15 రోజులకు ఒకసారి కచ్చితంగా సమీక్ష జరుపుతుండటంతో రెవెన్యూ అధికారులు దీనిపై సీరియస్‌గా పనిచేస్తున్నారు.
సమగ్ర భూ సర్వేకు సర్కారు కసరత్తు
Published Sat, Jan 1 2022 6:05 AM | Last Updated on Sat, Jan 1 2022 3:21 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment