తూ.గో జిల్లా జి.మామిదాడలో ఓ అవ్వకు కంటి పరీక్షలు
సాక్షి అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైఎస్సార్ కంటివెలుగు యజ్ఞం ముమ్మరంగా జరుగుతోంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బోధనాసుపత్రుల్లో ఈ కంటి పరీక్షలు జరుగుతున్నాయి. గతంలో కంటి వైద్యం డబ్బుతో కూడుకున్న వ్యవహారం కావడంతో పేదలు నానా యాతన పడేవారు. వైఎస్సార్ కంటివెలుగు కార్యక్రమం మొదలయ్యాక ఇంటికి దగ్గర్లోనే పరీక్షలు చేయడం, అద్దాలు ఉచితంగా ఇవ్వడం, శుక్లాలుంటే ఆపరేషన్ చేస్తుండడంతో అవ్వాతాతల ఆనందానికి అవధుల్లేవు. ఇలా 60 ఏళ్లు దాటిన వారు భారీ సంఖ్యలో కంటి పరీక్షలకు క్యూ కడుతున్నారు. ఈ యజ్ఞంలో వందలాది మంది వైద్యులు, ఆఫ్తాల్మిక్ అసిస్టెంట్‌లు పాల్గొంటూ సేవలు అందిస్తున్నారు.
10.64 లక్షల మందికి పరీక్షలు
రాష్ట్రంలో అరవై ఏళ్లు దాటిన వారు 56.88 లక్షల మంది ఉంటారని ప్రభుత్వ అంచనా. వీళ్లందరికీ ఉచితంగా కంటిపరీక్షలు చేసి, వారికి కంటివెలుగు ప్రసాదించాలని సర్కారు సంకల్పించింది. తొలిదశలో స్కూలు పిల్లలకు పూర్తవగా, రెండో దశలో అవ్వాతాతలకు శ్రీకారం చుట్టింది. కానీ, అంతలోనే కరోనా వచ్చింది. ఇప్పుడు మళ్లీ పరీక్షలు పునరుద్ధరించారు. తాజాగా ఆగస్టు 7 నాటికి రాష్ట్రవ్యాప్తంగా 10,64,979 మంది అవ్వాతాతలకు కంటిపరీక్షలు పూర్తిచేశారు. అంటే నిర్దేశించిన లక్ష్యంలో 18.72 శాతం పూర్తిచేశారు. అత్యధికంగా విజయనగరం జిల్లాలో 25.77 శాతం మందికి పూర్తయ్యాయి.
5.43 లక్షల మందికి కళ్లద్దాలు అవసరం
ఇప్పటివరకూ కంటిపరీక్షలు పూర్తిచేసుకున్న వారిలో 5.43 లక్షల మందికి కళ్లద్దాలు అవసరమని వైద్యులు నిర్ధారించారు. మరో 94,835 మందికి కంటిశుక్లాల ఆపరేషన్లు చేయాలని తేల్చారు. వీరందరికీ కళ్లద్దాలు, ఆపరేషన్లు ఉచితమే. సర్జరీలు ప్రభుత్వాస్పత్రులతోపాటు ప్రైవేటు, ఎన్జీవో ఆస్పత్రుల్లో ప్రభుత్వ వ్యయంతోనే నిర్వహిస్తున్నారు.
84,145 మందికి కేటరాక్ట్ సర్జరీలు
డాక్టర్లు సిఫార్సు చేసిన 94,835 మందిలో ఇప్పటివరకూ 84,145 మందికి కంటి శుక్లాలకు ఆపరేషన్ నిర్వహించారు. ఇందులో అత్యధికంగా గుంటూరు జిల్లాలో 10,822 మంది చేయించుకున్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో 8,785 మంది, ఎన్జీవో ఆస్పత్రుల్లో 45,941 మంది, ప్రైవేటు ఆస్పత్రుల్లో 29,419 మంది చేయించుకున్నారు. దేశంలో ఇంత పెద్దఎత్తున ఎక్కడా కంటి సర్జరీలు, పరీక్షలు జరగడంలేదు.
సమీపంలోని పీహెచ్‌సీల్లో సంప్రదించాలి
ఎవరైనా 60 ఏళ్లు దాటిన వారు కంటి పరీక్షలు చేయించుకోవాలంటే సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంగానీ, ఆరోగ్య ఉపకేంద్రంగానీ, సచివాలయంలోగానీ అడిగితే ఎక్కడ కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారో చెబుతారు. అక్కడికెళ్తే పరీక్షలతో పాటు అవసరాన్ని బట్టి సర్జరీలు ఉచితంగా చేస్తారు.
– డాక్టర్ హైమావతి, నోడల్ అధికారి, వైఎస్సార్ కంటివెలుగు
Comments
Please login to add a commentAdd a comment