ఏ నెల పింఛను ఆ నెలలోనే.. | Andhra Pradesh Government New Testament For Pension distribution | Sakshi
Sakshi News home page

ఏ నెల పింఛను ఆ నెలలోనే..

Sep 1 2021 2:45 AM | Updated on Sep 1 2021 2:45 AM

Andhra Pradesh Government New Testament For Pension distribution - Sakshi

సాక్షి, అమరావతి: పొరుగు రాష్ట్రాల్లో శాశ్వతంగా ఉంటూ మూడు, నాలుగు నెలలకోసారి సొంతూళ్లకు దర్జాగా వచ్చి అక్రమంగా పింఛన్లు తీసుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం చెక్‌ పెట్టింది. లబ్ధిదారులు ఏ నెల పింఛను ఆ నెలలోనే తీసుకోవాలనే నిబంధనను ప్రవేశపెట్టి ఒకేసారి అన్ని నెలల పింఛనును తీసుకునే విధానానికి స్వస్తి చెప్పింది. తీసుకోని పక్షంలో ఆ మొత్తం మురిగిపోయినట్లే. బకాయిలు కూడా చెల్లించరు. బుధవారం నుంచే ఈ కొత్త నిబంధనను  అమలుచేయనున్నట్లు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) అధికారులు వెల్లడించారు. జూలై, ఆగస్టు నెలల్లో పింఛను డబ్బులు తీసుకోని వారికి ఈ నెలలో ఎటువంటి బకాయిలు మంజూరుచేయకుండా కేవలం సెప్టెంబర్‌ నెలకు చెల్లించాల్సిన పింఛను మాత్రమే ప్రభుత్వం విడుదల చేసింది. 

పొరుగు రాష్ట్రాల్లో శాశ్వత నివాసం
ఏపీలో అసలు నివాసమే ఉండకుండా హైదరాబాద్, చెన్నై, బెంగళూరు తదితర నగరాలతో పాటు పొరుగు రాష్ట్రాల్లోనే శాశ్వతంగా నివాసం ఉంటున్న వారు పెద్ద సంఖ్యలో మన రాష్ట్రంలో పింఛను పొందుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఇలాంటి వారు మూడు నెలలకోసారి వారి ఊరికి వచ్చి బకాయిలతో కలిపి ఒకేసారి డబ్బులు తీసుకెళ్తుతున్నారు. వాస్తవానికి ఇలాంటి వారిలో దాదాపు అందరూ అర్హత లేకపోయినా అక్రమంగా పింఛను పొందుతున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ తరహా అక్రమాలను అరికట్టేందుకు కొత్త నిబంధన తీసుకొస్తున్నట్లు సెర్ప్‌ అధికారులు తెలిపారు. 

రెండు లక్షల మందికి పైగానే అలాంటి వారు..
రాష్ట్రంలో నెలనెలా దాదాపు 60 లక్షల మంది లబ్ధిదారులకు ప్రభుత్వం పింఛన్‌ డబ్బులు విడుదల చేస్తోంది. అయితే, అందులో రెండు లక్షల మందికి పైగా నెలనెలా పింఛన్లు తీసుకోవడంలేదు. ఇలా ఏప్రిల్‌లో 2.04 లక్షల మంది, మేలో 2.57 లక్షల మంది.. జూన్‌లో 2.70 లక్షల మంది.. జూలైలో 2.14 లక్షల మంది.. ఆగస్టులో 2.40 లక్షల మంది తీసుకోలేదని అధికారులు గుర్తించారు. వీరిలో పొరుగు రాష్ట్రాల్లో శాశ్వతంగా ఉండే వారే ఎక్కువమంది ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇలాంటి వారికి ఇప్పటిదాకా మూడు నెలల బకాయిలు కలిపి రూ.6,750లు, లేదా అంతకంటే ఎక్కువ మొత్తం ఒకేసారి ఇస్తుండడంతో వారు కారుల్లో ఊళ్లకు వచ్చి ఆ మొత్తాన్ని తీసుకెళ్తున్నట్లు అధికారులు పసిగట్టారు. 

అసలైన అర్హులకు ఇబ్బంది ఉండదు
ఇక రాష్ట్రంలో నివాసం ఉంటున్న అర్హులైన పింఛనుదారులకు ప్రభుత్వ తాజా నిర్ణయంవల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని అధికారులు స్పష్టంచేశారు. వలంటీర్లు ఎప్పటికప్పుడు ప్రభుత్వ నిర్ణయాలను లబ్ధిదారులకు తెలియజేస్తున్నారని.. ఇప్పుడు తాజాగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని కూడా వారికి ఇప్పటికే తెలియజేసినట్లు వారు చెప్పారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement