Pension money distribution
-
ఏ నెల పింఛను ఆ నెలలోనే..
సాక్షి, అమరావతి: పొరుగు రాష్ట్రాల్లో శాశ్వతంగా ఉంటూ మూడు, నాలుగు నెలలకోసారి సొంతూళ్లకు దర్జాగా వచ్చి అక్రమంగా పింఛన్లు తీసుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం చెక్ పెట్టింది. లబ్ధిదారులు ఏ నెల పింఛను ఆ నెలలోనే తీసుకోవాలనే నిబంధనను ప్రవేశపెట్టి ఒకేసారి అన్ని నెలల పింఛనును తీసుకునే విధానానికి స్వస్తి చెప్పింది. తీసుకోని పక్షంలో ఆ మొత్తం మురిగిపోయినట్లే. బకాయిలు కూడా చెల్లించరు. బుధవారం నుంచే ఈ కొత్త నిబంధనను అమలుచేయనున్నట్లు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) అధికారులు వెల్లడించారు. జూలై, ఆగస్టు నెలల్లో పింఛను డబ్బులు తీసుకోని వారికి ఈ నెలలో ఎటువంటి బకాయిలు మంజూరుచేయకుండా కేవలం సెప్టెంబర్ నెలకు చెల్లించాల్సిన పింఛను మాత్రమే ప్రభుత్వం విడుదల చేసింది. పొరుగు రాష్ట్రాల్లో శాశ్వత నివాసం ఏపీలో అసలు నివాసమే ఉండకుండా హైదరాబాద్, చెన్నై, బెంగళూరు తదితర నగరాలతో పాటు పొరుగు రాష్ట్రాల్లోనే శాశ్వతంగా నివాసం ఉంటున్న వారు పెద్ద సంఖ్యలో మన రాష్ట్రంలో పింఛను పొందుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఇలాంటి వారు మూడు నెలలకోసారి వారి ఊరికి వచ్చి బకాయిలతో కలిపి ఒకేసారి డబ్బులు తీసుకెళ్తుతున్నారు. వాస్తవానికి ఇలాంటి వారిలో దాదాపు అందరూ అర్హత లేకపోయినా అక్రమంగా పింఛను పొందుతున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ తరహా అక్రమాలను అరికట్టేందుకు కొత్త నిబంధన తీసుకొస్తున్నట్లు సెర్ప్ అధికారులు తెలిపారు. రెండు లక్షల మందికి పైగానే అలాంటి వారు.. రాష్ట్రంలో నెలనెలా దాదాపు 60 లక్షల మంది లబ్ధిదారులకు ప్రభుత్వం పింఛన్ డబ్బులు విడుదల చేస్తోంది. అయితే, అందులో రెండు లక్షల మందికి పైగా నెలనెలా పింఛన్లు తీసుకోవడంలేదు. ఇలా ఏప్రిల్‌లో 2.04 లక్షల మంది, మేలో 2.57 లక్షల మంది.. జూన్‌లో 2.70 లక్షల మంది.. జూలైలో 2.14 లక్షల మంది.. ఆగస్టులో 2.40 లక్షల మంది తీసుకోలేదని అధికారులు గుర్తించారు. వీరిలో పొరుగు రాష్ట్రాల్లో శాశ్వతంగా ఉండే వారే ఎక్కువమంది ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇలాంటి వారికి ఇప్పటిదాకా మూడు నెలల బకాయిలు కలిపి రూ.6,750లు, లేదా అంతకంటే ఎక్కువ మొత్తం ఒకేసారి ఇస్తుండడంతో వారు కారుల్లో ఊళ్లకు వచ్చి ఆ మొత్తాన్ని తీసుకెళ్తున్నట్లు అధికారులు పసిగట్టారు. అసలైన అర్హులకు ఇబ్బంది ఉండదు ఇక రాష్ట్రంలో నివాసం ఉంటున్న అర్హులైన పింఛనుదారులకు ప్రభుత్వ తాజా నిర్ణయంవల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని అధికారులు స్పష్టంచేశారు. వలంటీర్లు ఎప్పటికప్పుడు ప్రభుత్వ నిర్ణయాలను లబ్ధిదారులకు తెలియజేస్తున్నారని.. ఇప్పుడు తాజాగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని కూడా వారికి ఇప్పటికే తెలియజేసినట్లు వారు చెప్పారు. -
ఠంచన్‌గా పింఛన్..
సాక్షి, అమరావతి: అవ్వాతాతలకే కాదు.. వితంతువులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు కష్టం కలగకుండా పంచాయతీ ఎన్నికల హడావుడిలోనూ ప్రభుత్వం పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది. సోమవారం తెల్లవారుజాము నుంచే వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పింఛను డబ్బులు పంపిణీ చేశారు. తొలి రోజున రూ.1,375.51 కోట్లు లబ్ధిదారులకు చేతికి చేరాయి. ఈ నెలలో మొత్తం 61,56,684 మందికి ప్రభుత్వం పింఛను డబ్బులు విడుదల చేయగా.. 93.42 శాతం మేర 57,51,664 మందికి సోమవారం పంపిణీ పూర్తయింది. కాగా, మిగిలిన వారి కోసం మంగళ, బుధవారాల్లో కూడా పింఛన్ల పంపిణీ కొనసాగనుంది. పింఛన్ల పంపిణీ సందర్భంగా సోమవారం రాష్ట్రవ్యాప్తంగా చోటుచేసుకున్న ఆసక్తికర సంఘటనలు ఇవీ.. ► తూర్పు గోదావరి జిల్లా పాత ఇంజరం గ్రామానికి చెందిన వలంటీర్ కేశనకుర్తి విజయ్ కొద్ది గంటల్లోనే తన వివాహం ఉన్నప్పటికీ.. పెళ్లి దుస్తుల్లోనే లబి్ధదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేశాడు. పింఛన్లు అందుకున్న వారంతా అతడికి దీవెనలందించారు. ► అనంతపురం జిల్లా కూడేరు మండల పరిధిలోని జయపురానికి చెందిన ఎరికల లింగమ్మ ఆపరేషన్ చేయించుకుని ఆస్పత్రిలోనే ఉండగా.. విషయం తెలుసుకున్న వలంటీర్ సంజీవరాయుడు 30 కి.మీ. దూరంలోని ఆస్పత్రికి వెళ్లి పింఛను నగదు అందజేశాడు. ► తూర్పు గోదావరి జిల్లా వేళంగి గ్రామానికి చెందిన దేవిశెట్టి వెంకటరమణ అనారోగ్యంతో కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతుండగా వలంటీర్ అప్పనపల్లి సూర్యకాంతి అతడి వద్దకే వెళ్లి పింఛను అందజేసింది. ► చిత్తూరు జిల్లా అంబూరు గ్రామానికి చెందిన పరంధామయ్య చెన్నైలోని కేన్సర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. వలంటీర్ వంశీకృష్ణ చెన్నై వెళ్లి మరీ పింఛను అందించాడు. ఇదే జిల్లాలోని ఎర్రప్పశెట్టిపల్లె గ్రామానికి చెందిన గంగులమ్మ తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. వలంటీర్ రమణ ఆస్పత్రికి వెళ్లి పింఛను అందించాడు. ► విశాఖ జిల్లా ఆరిలోవ ప్రాంతానికి చెందిన సింహాచలం అనే వృద్ధుడు ఇటీవల అనారోగ్యానికి గురై హెల్త్‌సిటీలో ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. వలంటీర్ మనోజ్ నేరుగా ఆస్పత్రికి వెళ్లి పింఛను సొమ్ము అందజేశాడు. -
ఇంటి వద్దకే పెన్షన్ల పంపిణీకి ఏడాది
సాక్షి, అమరావతి: వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛను డబ్బులు పంపిణీ చేసే సరికొత్త పరిపాలన సంస్కరణకు నాంది పలికి ఏడాది పూర్తయింది. గతంలో మాదిరి అవ్వాతాతలు పింఛను డబ్బులు తీసుకోవడం కోసం ప్రతి నెలా నడవలేని స్థితిలో కూడా కాళ్లు ఈడ్చుకుంటూ పంచాయతీ ఆఫీసు వద్దకు వెళ్లి అక్కడ గంటల తరబడి పడిగాపులు పడే పరిస్థితి ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడా లేదు. మారుమూల కుగ్రామంతో సహా అన్ని ప్రాంతాలలో ఒకటవ తేదీ ఉదయాన్నే వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన్ డబ్బులు పంపిణీ చేసే కార్యక్రమం గత ఏడాది ఫిబ్రవరి 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మొదలైన విషయం తెలిసిందే. గత 12 నెలలుగా లబ్ధిదారులలో ఏ ఒక్కరూ చిన్న ఇబ్బంది కూడా పడకుండా పంపిణీ జరుగుతోంది. రాష్ట్రంలో దాదాపు 61.50 లక్షల మంది పింఛనుదారులు ఉండగా.. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి ప్రతి నెలా ఒకటవ తేదీనే 95 శాతం మందికి పైగా లబ్ధిదారులకు డబ్బులు చేరుతున్నాయి. లబ్ధిదారులెవరైనా అనారోగ్యంతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నా, వారున్న చోటుకే వలంటీరు వెళ్లి డబ్బులు పంపిణీ చేసిన ఉదంతాలు కోకొల్లలున్నాయి. ఈ నెలా 61.54 లక్షల మందికి పంపిణీకి ఏర్పాట్లు ఫిబ్రవరి 1వ తేదీ సోమవారం 61.54 లక్షల మంది లబ్ధిదారులకు పింఛన్ల డబ్బులు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం శనివారమే డబ్బులు విడుదల చేసింది. ఆ మేరకు నగదును గ్రామ సచివాలయ కార్యదర్శుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. ప్రతి నెలా జరిగే మాదిరిగానే సోమవారం తెల్లవారుజాము నుంచే వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేస్తారని అధికార వర్గాలు వెల్లడించాయి. -
లబ్ధిదారుల చెంతకే పింఛన్ సొమ్ము
సాక్షి, నెట్వర్క్: లబ్ధిదారుల వద్దకే వెళ్లి పింఛన్ సొమ్ము అందజేయాలన్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచనలను పాటించేందుకు వలంటీర్లు రాష్ట్ర సరిహద్దులు కూడా దాటుతున్నారు. తాము చికిత్స తీసుకుంటున్న ఆస్పత్రి బెడ్ వద్దకే వచ్చి పెన్షన్ మొత్తం అందించడంతో లబ్ధిదారులు ఆనందంతో కంటతడి పెట్టుకున్నారు. ముఖ్యమంత్రి జగన్‌బాబుకు రుణపడి ఉంటామని వారు వలంటీర్లతో అన్నారు. తమిళనాడులో ఉంటున్న చిత్తూరు జిల్లాకు చెందిన ఇద్దరికి, గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కొల్లిపరకు చెందిన ఓ దివ్యాంగురాలికి బుధవారం పెన్షన్లు అందజేశారు. వివరాలిలా ఉన్నాయి. చిత్తూరు జిల్లా బంగారుపాళెం మండలం పాలమాకులపల్లెకు చెందిన కస్తూరమ్మ పది రోజుల క్రితం ప్రమాదానికి గురై కాలు విరిగింది. చికిత్స అనంతరం తమిళనాడులోని గుడియాత్తంలోని బంధువుల ఇంట్లో ఉంటోంది. దీంతో మాజీ సర్పంచ్ దొరస్వామి చొరవ తీసుకుని గ్రామ వలంటీర్లు నాగేంద్రబాబు, సోమశేఖర్‌ను గుడియాత్తంకు పంపి బుధవారం వృద్ధురాలికి పింఛన్ నగదు అందజేయించారు. ఏపీ ప్రభుత్వం ప్రజల కోసం చేస్తున్న సంక్షేమ పథకాలను తెలుసుకుని కస్తూరమ్మ బంధువులు సైతం అభినందించారని వలంటీర్లు తెలిపారు. చిత్తూరు ప్రశాంత్‌నగర్‌లో ఉంటున్న తులసి మూత్రపిండాల వ్యాధితో తమిళనాడు వేలూరులోని సీఎంసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న వలంటీర్ శివలక్ష్మి, వార్డు కార్యదర్శి అశోక్‌కుమార్ బుధవారం తమిళనాడులోని వేలూరులో ఉన్న సీఎంసీకు వెళ్లి డయాలసిస్ కింద రూ.10 వేల పింఛన్‌ను తులసికి అందచేశారు. ప్రభుత్వం ఇచ్చిన పింఛన్ నగదు మందులకు ఉపయోగపడుతుందని తులసీ ఆనందం వ్యక్తం చేశారు. ఇక గుంటూరు జిల్లా కొల్లిపరకు చెందిన దివ్యాంగురాలు మండ్రు వైష్ణవి అనారోగ్యంతో నెల రోజులుగా గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. గ్రామ వలంటీర్ కంచర్ల సుధాకర్ బుధవారం గుంటూరులోని ఆస్పత్రికి వెళ్లి వైష్ణవికి పింఛన్ సొమ్ము అందజేశారు. ఈ సందర్భంగా ఆమె తండ్రి ప్రభాకర్ మాట్లాడుతూ తన బిడ్డ వైష్ణవికి 70 శాతం వైకల్యం ఉన్నా గత ప్రభుత్వ హయాంలో పింఛన్ అందలేదని, 20 సార్లు దరఖాస్తు చేసినా ఫలితం లేదని పేర్కొన్నారు. ఇప్పుడు ఒక్క అర్జీకే పింఛన్ మంజూరుతోపాటు, ఆస్పత్రికి వచ్చి ఇవ్వడం సంతోషంగా ఉందని చెప్పారు. -
అవ్వాతాతల ఆనందం.. అదే మా ప్రభుత్వ లక్ష్యం
సాక్షి, అమరావతి : అవ్వాతాతల జీవితాలలో ఆనందం, సంతోషం చూడాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం వైఎస్ జగన్ ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన పింఛనుదారులందరికీ వేర్వేరుగా లేఖలు రాశారు. శనివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ తదితర పింఛనుదారులందరికీ వలంటీర్ల ద్వారా నేరుగా వారి ఇంటి వద్దనే పింఛను డబ్బులు పంపిణీ చేసే సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో రాష్ట్రంలో అర్హులైన వారందరికీ సంతృప్త స్థాయి పింఛన్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ‘నవశకం’ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో 6.11 లక్షల మందిని అర్హులుగా గుర్తించి, వారందరికీ ఫిబ్రవరి నుంచి కొత్తగా పింఛన్లు మంజూరు చేసింది. కొత్తగా పింఛను మంజూరు చేసిన సందర్భంగా సీఎం వైఎస్ జగన్.. వారందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ లేఖలు రాశారు. ఫిబ్రవరి 1వ తేదీన పింఛను డబ్బులు పంపిణీ చేసే సమయంలో వలంటీర్లు కొత్తగా పింఛన్లు మంజూరు అయిన వారందరికీ మంజూరు ఉత్తర్వు పత్రాలతో పాటు సీఎం వారి పేరుతో రాసిన లేఖ ప్రతులను కూడా లబ్ధిదారులకు అందజేస్తారని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ అధికారులు వెల్లడించారు. సీఎం లేఖలో అంశాలు ఇలా ఉన్నాయి. అవ్వా తాతలకు నమస్కారాలు.. పింఛనుదారులకు సీఎం రాసిన లేఖ పింఛనుదారులందరికీ శుభాభినందనలు. రాష్ట్రంలో అవ్వా తాతలు, పేదలు పడుతున్న ఆర్థిక ఇబ్బందులను ‘ప్రజా సంకల్పయాత్ర’లో చూసి నేను చలించిపోయాను. మీరు సమాజంలో గౌరవప్రదమైన జీవనం సాగిస్తూ ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే సదుద్దేశంతో నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే నా తొలి సంతకం ‘నవరత్నాల’లో అత్యంత ప్రాధాన్యమైన వైఎస్సార్ పింఛను పథకంలో భాగంగా పింఛన్ల పెంపుతో పాటు వయో పరిమితిని 65 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నా. అర్హులందరికీ సంతృప్త స్థాయిలో పింఛన్లు ఇవ్వాలన్న దృఢ నిశ్చయంతో పింఛన్ల అర్హతలను సరళతరం చేశాం. పింఛను మొత్తం రూ.2,000 నుంచి రూ. 3000 వరకు పెంచుకుంటూ పోతాం అని చెప్పాం. ఆ మేరకు నేను సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే రూ.2,250కి పెంచుతూ తొలి సంతకం చేశాను. ఈ మేరకు ఇప్పుడు అవ్వాతాతలకు పింఛన్లు ఇస్తున్నాం. అర్హులైన అందరికీ పింఛన్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ‘నవశకం’ కార్యక్రమం ద్వారా కొత్తగా 6.11 లక్షల మందిని అర్హులుగా గుర్తించాం. వారి కుటుంబాల్లో ఆనందం కలిగే విధంగా ఫిబ్రవరి నెల నుంచి పింఛన్లు మంజూరు చేశాం. జిల్లాల వారీగా పింఛన్‌దార్ల సంఖ్య నేటి మధ్యాహ్నానికల్లా పింఛన్ల పంపిణీ పూర్తి వలంటీర్ల ద్వారా లబ్ధిదారుల ఇళ్ల వద్దే పింఛను డబ్బులు పంపిణీ చేయాలన్న విధానం ద్వారా ఒకటవ తేదీ మధ్యాహ్నానికల్లా ప్రక్రియ దాదాపు పూర్తవుతుందని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సీఈవో రాజాబాబు తెలిపారు. ఏదైనా అత్యవసర పరిస్థితి, అనివార్య కారణాలతో తొలి రోజు వలంటీరు ఇంటికి వచ్చినప్పుడు డబ్బులు తీసుకోలేకపోయిన వారు మరో రెండు రోజుల సమయంలో ఎప్పుడైనా వలంటీర్ నుంచి తీసుకునేలా ప్రభుత్వం వీలు కల్పించిందన్నారు. ప్రతి నెలా పింఛను డబ్బులు తీసుకోవడం కోసం వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారు ఆఫీసుల వద్ద పడిగాపులు పడే పరిస్థితులు ఉండకూడదని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వలంటీర్ల ద్వారా పంపిణీకి శ్రీకారం చుట్టారని చెప్పారు. దీని వల్ల లబ్ధిదారులకు ఎటువంటి నష్టం కలగదన్నారు. లబ్ధిదారులు మూడు రోజుల్లో పింఛను డబ్బులు తీసుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు, మరుసటి నెలలో ఆ నెల డబ్బులతో కలిపి వలంటీర్ అందజేస్తారని ఆయన వివరించారు. -
‘ఆసరా’లో నకిలీ నోట్ల కలకలం!
హయత్‌నగర్: ఆసరా పథకంలో పంచిన నోట్లు నకిలీవని ప్రచారం జరగడంతో తారామతిపేటలో కలకలం రేగింది. వివరాల్లోకి వెళితే... తారామతిపేట గ్రామంలో ఈ నెల 12వ తేదీ నుంచి ఆసరా పథకంలో భాగంగా పింఛన్ డబ్బులుపంపిణీ చేశారు. గ్రామ కార్యదర్శి నర్సింగ్‌రావు హయత్‌నగర్‌లోని ఎస్బీహెచ్ బ్యాంకు నుంచి రూ.10 లక్షలు డ్రా చేసి బండరావిరాల, చిన్నరావిరాల గ్రామాలలో పంచేందుకు కొంత డబ్బును బిల్ కలెక్టర్‌కు అప్పగించాడు. కొంత డబ్బును తారామతిపేటలో పంచారు. సుమారు రూ.5 లక్షల మేర పంపకాలు పూర్తయ్యాయి. కొంతమంది లబ్ధిదారులు ఖర్చు చేసేందుకు దుకాణదారుల వద్దకు వెళ్లగా అవి చెల్లవంటూ తీసుకోలేదు. దీంతో తమకు ఇచ్చినవి నకిలీ నోట్లు అని గ్రామస్తులు వాపోయారు. ఇది కాస్తా గ్రామంలో ప్రచారం జరగడంతో ఆదివారం పింఛన్లు తీసుకునేందుకు వచ్చిన వారు కూడా తమకు వద్దు అంటూ తిరిగి వెళ్లిపోయారు. నకిలీ నోట్లు కావు: కార్యదర్శి ఆసరా పథకంలో భాగంగా గ్రామంలో పంపిణీ చేసిన నగదు నకిలీనోట్లు కావని, 2004 కంటే ముందు ముద్రించిన నోట్లు కావడంతో వాటిని ఎలక్ట్రానిక్ మిషన్ గుర్తించడం లేదని గ్రామ కార్యదర్శి నర్సింగ్‌రావు తెలిపారు. నోట్లను బ్యాంకు నుంచి ఎలా తీసుకొచ్చామో అలాగే పంచామని చెల్లుబాటు కాని నోట్లను తిరిగి ఇచ్చేస్తే బ్యాంక్‌కు ఇచ్చి మార్చి ఇస్తామని ఆయన వెల్లడించారు.