ఇంటి వద్దకే పెన్షన్ల పంపిణీకి ఏడాది | Year for distribution of pensions at home | Sakshi
Sakshi News home page

ఇంటి వద్దకే పెన్షన్ల పంపిణీకి ఏడాది

Published Mon, Feb 1 2021 5:29 AM | Last Updated on Mon, Feb 1 2021 5:29 AM

Year for distribution of pensions at home - Sakshi

సాక్షి, అమరావతి: వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛను డబ్బులు పంపిణీ చేసే సరికొత్త పరిపాలన సంస్కరణకు నాంది పలికి ఏడాది పూర్తయింది. గతంలో మాదిరి అవ్వాతాతలు పింఛను డబ్బులు తీసుకోవడం కోసం ప్రతి నెలా నడవలేని స్థితిలో కూడా కాళ్లు ఈడ్చుకుంటూ పంచాయతీ ఆఫీసు వద్దకు వెళ్లి అక్కడ గంటల తరబడి పడిగాపులు పడే పరిస్థితి ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడా లేదు.

మారుమూల కుగ్రామంతో సహా అన్ని ప్రాంతాలలో ఒకటవ తేదీ ఉదయాన్నే వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన్‌ డబ్బులు పంపిణీ చేసే కార్యక్రమం గత ఏడాది ఫిబ్రవరి 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మొదలైన విషయం తెలిసిందే. గత 12 నెలలుగా లబ్ధిదారులలో ఏ ఒక్కరూ చిన్న ఇబ్బంది కూడా పడకుండా పంపిణీ జరుగుతోంది. రాష్ట్రంలో దాదాపు 61.50 లక్షల మంది పింఛనుదారులు ఉండగా..  ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి ప్రతి నెలా ఒకటవ తేదీనే 95 శాతం మందికి పైగా లబ్ధిదారులకు డబ్బులు చేరుతున్నాయి. లబ్ధిదారులెవరైనా అనారోగ్యంతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నా, వారున్న చోటుకే వలంటీరు వెళ్లి డబ్బులు పంపిణీ చేసిన ఉదంతాలు కోకొల్లలున్నాయి. 

ఈ నెలా 61.54 లక్షల మందికి పంపిణీకి ఏర్పాట్లు
ఫిబ్రవరి 1వ తేదీ సోమవారం 61.54 లక్షల మంది లబ్ధిదారులకు పింఛన్ల డబ్బులు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం శనివారమే డబ్బులు విడుదల చేసింది. ఆ మేరకు నగదును గ్రామ సచివాలయ కార్యదర్శుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. ప్రతి నెలా జరిగే మాదిరిగానే సోమవారం తెల్లవారుజాము నుంచే వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేస్తారని అధికార వర్గాలు వెల్లడించాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement