కృష్ణా జిల్లా: విజయవాడ వన్‌టౌన్‌లో 169వ వార్డు సచివాలయం పరిధిలో ఉన్న కె.సుశీల అనే వృద్ధురాలి నుంచి వేలిముద్ర(బయోమెట్రిక్)లను తీసుకుంటున్న వలంటీర్ పద్మావతి
సాక్షి, అమరావతి: అవ్వాతాతలకే కాదు.. వితంతువులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు కష్టం కలగకుండా పంచాయతీ ఎన్నికల హడావుడిలోనూ ప్రభుత్వం పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది. సోమవారం తెల్లవారుజాము నుంచే వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పింఛను డబ్బులు పంపిణీ చేశారు. తొలి రోజున రూ.1,375.51 కోట్లు లబ్ధిదారులకు చేతికి చేరాయి. ఈ నెలలో మొత్తం 61,56,684 మందికి ప్రభుత్వం పింఛను డబ్బులు విడుదల చేయగా.. 93.42 శాతం మేర 57,51,664 మందికి సోమవారం పంపిణీ పూర్తయింది. కాగా, మిగిలిన వారి కోసం మంగళ, బుధవారాల్లో కూడా పింఛన్ల పంపిణీ కొనసాగనుంది. పింఛన్ల పంపిణీ సందర్భంగా సోమవారం రాష్ట్రవ్యాప్తంగా చోటుచేసుకున్న ఆసక్తికర సంఘటనలు ఇవీ..
► తూర్పు గోదావరి జిల్లా పాత ఇంజరం గ్రామానికి చెందిన వలంటీర్ కేశనకుర్తి విజయ్ కొద్ది గంటల్లోనే తన వివాహం ఉన్నప్పటికీ.. పెళ్లి దుస్తుల్లోనే లబి్ధదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేశాడు. పింఛన్లు అందుకున్న వారంతా అతడికి దీవెనలందించారు.
► అనంతపురం జిల్లా కూడేరు మండల పరిధిలోని జయపురానికి చెందిన ఎరికల లింగమ్మ ఆపరేషన్ చేయించుకుని ఆస్పత్రిలోనే ఉండగా.. విషయం తెలుసుకున్న వలంటీర్ సంజీవరాయుడు 30 కి.మీ. దూరంలోని ఆస్పత్రికి వెళ్లి పింఛను నగదు అందజేశాడు.
► తూర్పు గోదావరి జిల్లా వేళంగి గ్రామానికి చెందిన దేవిశెట్టి వెంకటరమణ అనారోగ్యంతో కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతుండగా వలంటీర్ అప్పనపల్లి సూర్యకాంతి అతడి వద్దకే వెళ్లి పింఛను అందజేసింది.
► చిత్తూరు జిల్లా అంబూరు గ్రామానికి చెందిన పరంధామయ్య చెన్నైలోని కేన్సర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. వలంటీర్ వంశీకృష్ణ చెన్నై వెళ్లి మరీ పింఛను అందించాడు. ఇదే జిల్లాలోని ఎర్రప్పశెట్టిపల్లె గ్రామానికి చెందిన గంగులమ్మ తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. వలంటీర్ రమణ ఆస్పత్రికి వెళ్లి పింఛను అందించాడు.
► విశాఖ జిల్లా ఆరిలోవ ప్రాంతానికి చెందిన సింహాచలం అనే వృద్ధుడు ఇటీవల అనారోగ్యానికి గురై హెల్త్‌సిటీలో ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. వలంటీర్ మనోజ్ నేరుగా ఆస్పత్రికి వెళ్లి పింఛను సొమ్ము అందజేశాడు.
Comments
Please login to add a commentAdd a comment