గుంటూరు ఆస్పత్రిలో వైష్ణవి కుటుంబసభ్యులకు పింఛన్ అందిస్తున్న కొల్లిపర వలంటీర్
సాక్షి, నెట్‌వర్క్: లబ్ధిదారుల వద్దకే వెళ్లి పింఛన్ సొమ్ము అందజేయాలన్న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సూచనలను పాటించేందుకు వలంటీర్లు రాష్ట్ర సరిహద్దులు కూడా దాటుతున్నారు. తాము చికిత్స తీసుకుంటున్న ఆస్పత్రి బెడ్ వద్దకే వచ్చి పెన్షన్ మొత్తం అందించడంతో లబ్ధిదారులు ఆనందంతో కంటతడి పెట్టుకున్నారు. ముఖ్యమంత్రి జగన్‌బాబుకు రుణపడి ఉంటామని వారు వలంటీర్లతో అన్నారు. తమిళనాడులో ఉంటున్న చిత్తూరు జిల్లాకు చెందిన ఇద్దరికి, గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కొల్లిపరకు చెందిన ఓ దివ్యాంగురాలికి బుధవారం పెన్షన్లు అందజేశారు. వివరాలిలా ఉన్నాయి. చిత్తూరు జిల్లా బంగారుపాళెం మండలం పాలమాకులపల్లెకు చెందిన కస్తూరమ్మ పది రోజుల క్రితం ప్రమాదానికి గురై కాలు విరిగింది.
చికిత్స అనంతరం తమిళనాడులోని గుడియాత్తంలోని బంధువుల ఇంట్లో ఉంటోంది. దీంతో మాజీ సర్పంచ్ దొరస్వామి చొరవ తీసుకుని గ్రామ వలంటీర్లు నాగేంద్రబాబు, సోమశేఖర్‌ను గుడియాత్తంకు పంపి బుధవారం వృద్ధురాలికి పింఛన్ నగదు అందజేయించారు. ఏపీ ప్రభుత్వం ప్రజల కోసం చేస్తున్న సంక్షేమ పథకాలను తెలుసుకుని కస్తూరమ్మ బంధువులు సైతం అభినందించారని వలంటీర్లు తెలిపారు. చిత్తూరు ప్రశాంత్‌నగర్‌లో ఉంటున్న తులసి మూత్రపిండాల వ్యాధితో తమిళనాడు వేలూరులోని సీఎంసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న వలంటీర్ శివలక్ష్మి, వార్డు కార్యదర్శి అశోక్‌కుమార్ బుధవారం తమిళనాడులోని వేలూరులో ఉన్న సీఎంసీకు వెళ్లి డయాలసిస్ కింద రూ.10 వేల పింఛన్‌ను తులసికి అందచేశారు.
ప్రభుత్వం ఇచ్చిన పింఛన్ నగదు మందులకు ఉపయోగపడుతుందని తులసీ ఆనందం వ్యక్తం చేశారు. ఇక గుంటూరు జిల్లా కొల్లిపరకు చెందిన దివ్యాంగురాలు మండ్రు వైష్ణవి అనారోగ్యంతో నెల రోజులుగా గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. గ్రామ వలంటీర్ కంచర్ల సుధాకర్ బుధవారం గుంటూరులోని ఆస్పత్రికి వెళ్లి వైష్ణవికి పింఛన్ సొమ్ము అందజేశారు. ఈ సందర్భంగా ఆమె తండ్రి ప్రభాకర్ మాట్లాడుతూ తన బిడ్డ వైష్ణవికి 70 శాతం వైకల్యం ఉన్నా గత ప్రభుత్వ హయాంలో పింఛన్ అందలేదని, 20 సార్లు దరఖాస్తు చేసినా ఫలితం లేదని పేర్కొన్నారు. ఇప్పుడు ఒక్క అర్జీకే పింఛన్ మంజూరుతోపాటు, ఆస్పత్రికి వచ్చి ఇవ్వడం సంతోషంగా ఉందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment