సాక్షి, అమరావతి : అవ్వాతాతల జీవితాలలో ఆనందం, సంతోషం చూడాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం వైఎస్ జగన్ ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన పింఛనుదారులందరికీ వేర్వేరుగా లేఖలు రాశారు. శనివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ తదితర పింఛనుదారులందరికీ వలంటీర్ల ద్వారా నేరుగా వారి ఇంటి వద్దనే పింఛను డబ్బులు పంపిణీ చేసే సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో రాష్ట్రంలో అర్హులైన వారందరికీ సంతృప్త స్థాయి పింఛన్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ‘నవశకం’ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో 6.11 లక్షల మందిని అర్హులుగా గుర్తించి, వారందరికీ ఫిబ్రవరి నుంచి కొత్తగా పింఛన్లు మంజూరు చేసింది. కొత్తగా పింఛను మంజూరు చేసిన సందర్భంగా సీఎం వైఎస్ జగన్.. వారందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ లేఖలు రాశారు. ఫిబ్రవరి 1వ తేదీన పింఛను డబ్బులు పంపిణీ చేసే సమయంలో వలంటీర్లు కొత్తగా పింఛన్లు మంజూరు అయిన వారందరికీ మంజూరు ఉత్తర్వు పత్రాలతో పాటు సీఎం వారి పేరుతో రాసిన లేఖ ప్రతులను కూడా లబ్ధిదారులకు అందజేస్తారని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ అధికారులు వెల్లడించారు. సీఎం లేఖలో అంశాలు ఇలా ఉన్నాయి.
అవ్వా తాతలకు నమస్కారాలు..
పింఛనుదారులకు సీఎం రాసిన లేఖ
పింఛనుదారులందరికీ శుభాభినందనలు. రాష్ట్రంలో అవ్వా తాతలు, పేదలు పడుతున్న ఆర్థిక ఇబ్బందులను ‘ప్రజా సంకల్పయాత్ర’లో చూసి నేను చలించిపోయాను. మీరు సమాజంలో గౌరవప్రదమైన జీవనం సాగిస్తూ ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే సదుద్దేశంతో నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే నా తొలి సంతకం ‘నవరత్నాల’లో అత్యంత ప్రాధాన్యమైన వైఎస్సార్ పింఛను పథకంలో భాగంగా పింఛన్ల పెంపుతో పాటు వయో పరిమితిని 65 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నా. అర్హులందరికీ సంతృప్త స్థాయిలో పింఛన్లు ఇవ్వాలన్న దృఢ నిశ్చయంతో పింఛన్ల అర్హతలను సరళతరం చేశాం. పింఛను మొత్తం రూ.2,000 నుంచి రూ. 3000 వరకు పెంచుకుంటూ పోతాం అని చెప్పాం. ఆ మేరకు నేను సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే రూ.2,250కి పెంచుతూ తొలి సంతకం చేశాను. ఈ మేరకు ఇప్పుడు అవ్వాతాతలకు పింఛన్లు ఇస్తున్నాం. అర్హులైన అందరికీ పింఛన్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ‘నవశకం’ కార్యక్రమం ద్వారా కొత్తగా 6.11 లక్షల మందిని అర్హులుగా గుర్తించాం. వారి కుటుంబాల్లో ఆనందం కలిగే విధంగా ఫిబ్రవరి నెల నుంచి పింఛన్లు మంజూరు చేశాం.
జిల్లాల వారీగా పింఛన్‌దార్ల సంఖ్య
నేటి మధ్యాహ్నానికల్లా పింఛన్ల పంపిణీ పూర్తి
వలంటీర్ల ద్వారా లబ్ధిదారుల ఇళ్ల వద్దే పింఛను డబ్బులు పంపిణీ చేయాలన్న విధానం ద్వారా ఒకటవ తేదీ మధ్యాహ్నానికల్లా ప్రక్రియ దాదాపు పూర్తవుతుందని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సీఈవో రాజాబాబు తెలిపారు. ఏదైనా అత్యవసర పరిస్థితి, అనివార్య కారణాలతో తొలి రోజు వలంటీరు ఇంటికి వచ్చినప్పుడు డబ్బులు తీసుకోలేకపోయిన వారు మరో రెండు రోజుల సమయంలో ఎప్పుడైనా వలంటీర్ నుంచి తీసుకునేలా ప్రభుత్వం వీలు కల్పించిందన్నారు. ప్రతి నెలా పింఛను డబ్బులు తీసుకోవడం కోసం వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారు ఆఫీసుల వద్ద పడిగాపులు పడే పరిస్థితులు ఉండకూడదని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వలంటీర్ల ద్వారా పంపిణీకి శ్రీకారం చుట్టారని చెప్పారు. దీని వల్ల లబ్ధిదారులకు ఎటువంటి నష్టం కలగదన్నారు. లబ్ధిదారులు మూడు రోజుల్లో పింఛను డబ్బులు తీసుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు, మరుసటి నెలలో ఆ నెల డబ్బులతో కలిపి వలంటీర్ అందజేస్తారని ఆయన వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment